దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు శ్రీదేవి భౌతిక కాయం
దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ ముగిసింది. అనంతరం ఆమె మృతదేహాన్నిభర్త బోనీకపూర్‌కు అప్పగించారు. శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ చేస్తున్న సమయంలో బోనీకపూర్, ఖుషీ కపూర్ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి పార్థీవ దేహం దుబాయి ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకు వెళ్లనున్నారు. శ్రీదేవి మృతదేహం రాత్రి 9గంటలకల్లా ముంబై చేరే అవకాశం ఉంది.
మరోవైపు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్...శ్రీదేవి మృతిపై విచారణను ముగించింది. అన్ని కోణాల్లో విచారణ జరిపామని, ఆమె మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పృహ కోల్పోయి టబ్‌లో పడిపోవటం వల్లే శ్రీదేవి మరణించిందని, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని, బోనీకపూర్ ముంబై వెళ్లవచ్చని దుబాయ్ ప్రభుత్వం పేర్కొంది.
ఎంబామింగ్ అంటే...
ఎంబామింగ్ అంటే కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మృతదేహం కుళ్లిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలంపాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలను ధమనుల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావకాలనే 'ఎంబామింగ్ ఫ్లూయిడ్స్' అని పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్‌తోపాటు మరికొన్ని రకాల రసాయనాలను ఈ ప్రక్రియలో వాడతారు. ఎంబామింగ్ ప్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏరకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్ గా పనిచేయవు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, సత్యసాయి బాబా మరణించినప్పుడు కూడా ఎంబామింగ్ చేసిన విషయం తెలిసిందే.
గ్రూమింగ్..
తమ ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ 'తుది జ్ఞాపకం' ఇబ్బందికరంగా కాకుండా, ఎప్పట్లా ఆత్మీయంగానే ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ కోరికను బాడీ గ్రూమింగ్ తీరుస్తోంది. ఇది కూడా ఎంబామింగ్‌లో భాగమే. ఈ ప్రక్రియలో మరణించిన వ్యక్తి అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఉపయోగిస్తారు.