ఆ ఐటీ కంపెనీలో 2000 ఉద్యోగాలు కట్
కంప్యూటర్ల తయారీలో ప్రపంచపు అగ్రగామి సంస్థ డెల్ టెక్నాలజీస్ రెండు వేల నుంచి మూడు వేల ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ప్రపంచ సాంకేతిక రంగంలో అతిపెద్ద విలీనానికి తెరలేపిన డెల్, ఈఎంసీ కార్పొరేషన్‌ను తనలో విలీనం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో వ్యయ భారాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేయనుందని కంపెనీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యధిక ఉద్యోగాల కోత అమెరికాలోనూ, సప్లైచైన్, అడ్మిన్‌స్ట్రేషన్, మార్కెటింగ్ ఉద్యోగాల్లో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ కొనుగోలు లావాదేవీ పూర్తైన అనంతరం మొదటి 18 నెలలు 1.7 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోవాలని డెల్ యోచిస్తోంది. ఈ డీల్‌తో ఆ మొత్తానికి అత్యధిక రెట్ల అమ్మకాలు జరపాలని కంపెనీ దృష్టిసారిస్తోంది.
ఈ కొత్త కంపెనీలో మొత్తం 140,000 ఉద్యోగులున్నారు. ఈ కామెంట్లపై డెల్ అధికార ప్రతినిధి డేవ్ ఫార్మర్ మాత్రం స్పందించలేదు. ఒప్పందం ప్రకారం ఈఎంసీ కార్పొరేషన్‌ను రూ.4.50 లక్షల కోట్లకు(67 బిలియన్ డాలర్లకు) డెల్ కొనుగోలు చేస్తోంది. కొత్తగా ఏర్పడే సంస్థ తక్షణమే డెల్ టెక్నాలజీస్ పేరుతో కార్యకలాపాలు కొనసాగించనుంది. ఈ విలీనానికి గత జూలైలోనే ఈఎంసీ వాటాదార్లు అంగీకారం తెలిపారు.క్లౌడ్ సర్వీసుల్లో ప్రత్యర్థి కంపెనీలు అమెజాన్.కామ్, మైక్రోసాప్ట్, గూగుల్ వంటి నుంచి వస్తున్న పోటీని తట్టుకుని, విస్తరించే క్రమంలో ఈ రెండు కంపెనీలు జతకట్టి ముందుకు సాగనున్నాయి. ఈఎంసీ కార్పొరేషన్ తమలో విలీనం కానున్నట్టు గతేడాది అక్టోబర్‌లోనే డెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.