emerged
-
నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు.. ఆదివాసీలకు ఆహ్వానం
చర్ల/దుమ్ముగూడెం: మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఏజెన్సీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వేడుకలను విజయవంతం చేయాలంటూ వాల్‌పోస్లర్లు, కరపత్రాలు, లేఖల ద్వారా మావోయిస్టు పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ప్రభావిత ప్రాంతాల పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతాలకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. వందల సంఖ్యలో దండకారణ్యానికి చేరుకుంటున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. దీంతో సరిహద్దుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆదివాసీలకు ఆహ్వానం.. వారోత్సవాలకు హాజరు కావాలని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లో గల ఆదివాసీ ముఖ్యులను మావోయిస్టులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఏ గ్రామం నుంచి ఎవరు వెళతారనే సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
కలసి తిరిగారంటే ఖతమ్..
మోరల్ పోలీసింగ్... ఇటీవల ఈ మాట తరచుగా వినిపిస్తూనే ఉంది. యువకులు, ప్రేమ జంటలపై మోరల్ పోలీసింగ్ పేరుతో మత ఛాందస వాదులు దాడులు చేయడం సర్వసాధారణమైపోయింది. కొన్ని మత సంస్థలకు చెందిన ముఠాలు నవ్యనాగరికతపై కన్నెర్ర చేస్తూ దాడులకు తెగబడుతున్నాయి. రాజ్యాంగం వీరికి ఎటువంటి హక్కులూ కట్టబెట్టక పోయినా... మతోన్మాదానికి మోరల్ పోలీసింగ్ పేరు పెట్టి హింసాతక్మక చర్యలకు పాల్పడుతున్నా, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటున్నా పట్టించుకునే నాధుడే ఉండడు. మోరల్ పోలీసింగ్ అంటూ ఇటీవల మంగుళూరులో ఓ ముస్లిం వ్యక్తిని కరెంటు స్తంభానికి కట్టి చావబాదారు. హిందూ మహిళతో మాట్లాడటమే అతడి తప్పైంది. కర్నాటక కోస్తా తీర ప్రాంతంలో మత, మూఢవిశ్వాసాలకు ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే మంగుళూరుకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని ఓ కళాశాలనుంచి ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేయడం, వారు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడం వెనుక కూడ మత విశ్వాసాన్ని అతిక్రమించడమే కారణంగా కనిపిస్తుంది. నిజానికి మోరల్ పోలీసింగ్ మాటున మారుమూల గ్రామాల్లో జరుగుతున్న కొన్ని మతతత్వ దాడులు వెలుగులోకి కూడా రావడం లేదు. కొంతకాలం క్రితం కర్నాటకలోని మారుమూల ప్రాంతంలో జరిగిన మూడు ఘటనలను గమనిస్తే ఈ నిజం తెలుస్తుంది. మంగుళూరుకు దగ్గరలోని విట్టల్ గ్రామంలోముగ్గురు యువకులు 'ముఠా' కాలేజీ క్యాంపస్ లో యువతీ యువకులు మాట్లాడుకుంటుండగా వారిపై దాడి చేశారు. దీని వెనుక మతతత్వం కనిపిస్తుంది. వారిద్దరూ రెండు మతాలకు చెందినవారు కావడమే కారణం. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేయడంతో వాతావరణం సర్దుమణిగింది. అలాగే పుత్తూరులోని ఓ సినిమాహాలు వద్ద ముస్లిం యువతితో హిందూ యువకుడు మాట్లాడినందుకు జరిగిన ఘటన మోరల్ పోలీసింగ్ పేరిట మతతత్వ దాడులకు దారి తీసింది. కర్నాటక కోస్తా తీర ప్రాంతంలో ఈ దాడులు సర్వ సాధారణమైపోయాయి. వందలాది ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలన్నీ జరిగిన సమయంలో ఏదో స్థానిక వార్తల్లో ఏమూలో కనిపించి మాయమవ్వడమే తప్ప... బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియడం లేదు. ముఖ్యంగా మోరల్ పోలీసింగ్ పేరున కర్నాటక దక్షిణ కోస్తాలో ఈ దాడులు తీవ్రమౌతున్నాయి. మోరల్ పోలీసింగ్ మాటున మూఢత్వం పెచ్చుమీరుతోంది. యువసంఘాలూ, సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి... సమాజానికి క్రమశిక్షణ నేర్పుతామన్న ధోరణిలో దాడులకు తెగబడుతున్నాయి. స్థానిక పౌరులను ప్రజలనూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పోలీసులే చెప్తున్నారు. వీటిలో చాలావరకూ కనీసం పోలీస్ స్టేషన్ వరకూ కూడ రావడం లేదు. ఈ ఏడాది పన్నెండు మోరల్ పోలీసింగ్ ఘటనలు ఈ ప్రాంతంలో వెలుగు చూశాయంటే ఇక్కడ వీరి ప్రభావం ఎంతగా ఉందో తెలుస్తుంది. ఇక స్థానిక ప్రజలు కూడ మోరల్ పోలీసింగ్ భయంతో వణికిపోతున్నారు. తల్లితండ్రులు తమ పిల్లలకు భద్రత లేకుండాపోయిందని వాపోతున్నారు. స్నేహితులపై కూడా దాడులకు పాల్పడుతున్న నేటి పరిస్థితుల్లో ప్రాచీన నాగరికతను దృష్టిలో పెట్టుకొని రాసిన కొన్ని చట్టాలను ఆధునిక సమాజంలో తిరగ రాయాల్సిన అవసరం ఉందని అభ్యుదయ వాదులు అభిప్రాయ పడుతున్నారు. అసభ్యత, అశ్లీలత వంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు పోలీసులు కేసులు పెట్టాలి. విచారించి చర్యలు తీసుకోవాలి. కానీ యువత మోరల్ పోలీసింగ్ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నైతిక విలువలను కాపాడేందుకు ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఛాందస వాదాన్ని భుజాన వేసుకొని దాడులకు తెగబడటం ఎంతమాత్రం సమంజసం కాదు.