సర్దుకోవాలే..!
రెవెన్యూ శాఖలో ఉద్యోగుల కొరత
కొత్తగా 400 మందికి పైగా అవసరం
నూతన పోస్టులు కేటాయించని ప్రభుత్వం
హన్మకొండ అర్బన్ :
కొత్త జిల్లాల ఏర్పాటుకు గడువు సమీపిస్తున్న కొద్ది రెవెన్యూ ఉద్యోగుల్లో హైరానా పెరుగుతోంది. ప్రస్తుత వరంగల్ జిల్లా విడిపోయి ఐదు జిల్లాలుగా ఏర్పడనుండడంతో సిబ్బందిని సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. ప్రధానంగా ఈ ఇబ్బంది రెవెన్యూ శాఖలో తీవ్రంగా ఉంది. అసలే సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖలో ప్రస్తుతం కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేయడం ఇబ్బందిగా పరిణమించనుంది. కొత్త మండలాలు, జిల్లాలకు సిబ్బందిని ఇస్తామని మొదట్లో ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చినా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఉన్నవారితో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
400మందికి పైగా..
ప్రస్తుత ముసాయిదా ప్రకారం వరంగల్ జిల్లాలోని మండలాలకు తోడు పక్క జిల్లాల నుంచి కొన్ని మండలాలను కలుపుకుని ఐదు జిల్లాలు ఏర్పడనున్నాయి. అదేవిధంగా మూడు రెవెన్యూ డివిజన్లు, 13 కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఒక్కో కలెక్టరేట్‌కు కలెక్టర్, జేసీ, డీఆర్వో కాకుండా ఇతర పోస్టులు 47 ఉంటాయి. ఇక ఒక్కో తహసీల్దార్ కార్యాలయానికి పది మంది ఉద్యోగులు అవసరం. వీరితో పాటు సర్వేయర్లు, ఏఎస్‌వోలు అదనం. ఇదేవిధంగా మూడు కొత్త ఆర్డీవో కార్యాలయాలను ప్రతిపాదించగా.. ఇందులో ఒక్కో కార్యాలయానికి 15మందికి తగ్గకుండా సిబ్బంది కావాలి. ఇలా ఐదు కలెక్టరేట్లు, మూడు కొత్త రెవెన్యూ డివిజన్లు, 13మండలాలకు కలిపి మొత్తంగా తహసీల్దార్ కేడర్ నుంచి కింది వరకు సుమారు 400మందికి పైగా సిబ్బంది అవసరమవుతారు. అయితే వీటిలో తాత్కాలికంగా కొన్ని పోస్టులు సర్దుబాటు చేసి మిగతావి కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా స్థాయిలో పదోన్నతుల ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త పోస్టులు మంజూరు కానందున పదోన్నతులు ఇచ్చేందుకు వీలు లేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద డీపీసీ కోసం డీటీల జాబితా సిద్ధంగా ఉంది అయితే కొత్త జిల్లాలకు పోస్టులు మంజూరైతేనే ఈ జాబితాపై ఆమోదముద్ర వేసేందుకు వీలు కలుగుతుంది.
ఇప్పటికే ఖాళీ పోస్టులు
ప్రస్తుతం జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. జిల్లాలో మొత్తం 51 మండలాల్లో ఇప్పటికే ఆరు మండలాలకు తహసీల్దార్లు లేరు. కలెక్టరేట్లో 12మందికి ఏడుగురే ఉన్నారు. ఇక డీటీలు, ఆర్ఐలు కూడా అంతంత మాత్రమే. చాలా మండలాల్లో ఎంఆర్ఐ, ఏఆర్ఐ పోస్టులకు ఒక్కొక్కరితోనే నెట్టుకొస్తున్నారు.
మండలాల సిబ్బంది ఇలా...
కొత్తగా ఏర్పడే రెవెన్యూ మండలాలకు 1985 మండలాల ఏర్పాటు చట్టం ప్రకారం ఉద్యోగులను కేటాయించాలి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంజూరు, ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే కింది స్థాయి ఉద్యోగులను పదోన్నతులు, అఫీషియేటింగ్ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే దసరాకు ఒక రోజు ముందో... అదే రోజో ఉత్తర్వులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జిల్లా స్థాయిలో ఉన్నవారితో సర్దుబాటు చేయాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ప్రసుత్తం కలెక్టరేట్ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.
ఉన్నతాధికారుల కేటాయింపు
ప్రసుతం ఉన్న సమాచారం ప్రకారం కొత్త జిల్లాలకు సంబంధించి తహసీల్దార్ స్థాయి నుంచి కింద పోస్టులు జిల్లా స్థాయిలో ఉన్నవారితో సర్దుబాటు చేసుకోవాలి. ఇక కొత్త ఏర్పడే జిల్లాలు, డివిజన్లకు కలెక్టర్, జేసీ, డీఆర్వో, ఆర్డీవో పోస్టులకు అధికారులను ప్రభుత్వం కేటాయించనుంది.
కేటాయింపు ఇలా..
ప్రస్తుతం జిల్లాలో కొత్తగా తొర్రూరు, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ రూరల్ పేరుతో మూడు రెవెన్యూ డివిజన్లు అధికారులు ప్రతిపాదించారు. అక్కడ ఆర్డీవో పోస్టును రాష్ట్రం నుంచి భర్తీ చేసినా మిగతా సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్.. ఇతర పోస్టులు ఇక్కడే సర్ధుబాటు చేయాలి. ఇక కొత్త మండలాలలకు మాత్రం డీటీ నుంచి కింది స్థాయి ఉద్యోగులను అదే రెవెన్యూ డివిజన్ పరిధిలోని నుంచి పక్క మండలాల వారిని కేటాయిస్తున్నారు. ఆర్ఐలు ఇద్దరు ఉన్నచోట ఒకరిని కొత్త మండలాలకు ఇస్తారు. ఆర్ఐ పీరియడ్ పూర్తయిన వారికి సీనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.