18 నెలలు జైల్లో గడిపాను!
ఎమర్జెన్సీ అనుభవాలను గుర్తు చేసుకున్న వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి రోజని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి అదొక మాయని మచ్చ అని, ఒక వ్యక్తి తన పదవిని కాపాడుకోవడానికి రాజకీయాల్లో ఏస్థాయికి దిగజారుతారనేదానికి ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. అత్యవసర స్థితి రోజులను బుధవారం ఆయన గుర్తు చేసుకుంటూ.. నియంతృత్వాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని చరిత్ర రుజువు చేసిందన్నారు.
‘40 ఏళ్ల కిందట పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేశారు. జయప్రకాశ్ నారాయణ్ను విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి ప్రభుత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇప్పించడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. పదిహేడున్నర నెలల పాటు విశాఖ, హైదరాబాద్, ముషీరాబాద్, నెల్లూరు జైళ్లల్లో ఉన్నాను’ అని గుర్తు చేసుకున్నారు. ‘నాడు దేశంలో ప్రజాస్వామ్య భావనలు గట్టిగా ఉన్నాయి. జేపీ లాంటి అనేక మంది నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నడిపించారు.
ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ సంస్థలు చురుకైన పాత్ర పోషించాయి. సోషలిస్టు పార్టీలూ ఉద్యమించాయి. వాజ్పేయి, జార్జఫెర్నాండెజ్ లాంటి నేతలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. మొరార్జీదేశాయ్, అద్వానీ లాంటి నేతలను అరెస్టు చేసి హింసించారు’ అని వెంకయ్యనాయుడు వివరించారు. ఎమర్జెన్సీ తర్వాత తనతో సహా అనేక మంది యువనేతలు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ‘మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయారు. నేను లా చదివి, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనేది మా అమ్మ కోరిక అని అమ్మమ్మ చెబుతుండేది’ అని గుర్తు చేసుకున్నారు.