వెండి వాకిలి వద్ద అత్యవసర ద్వారం
రద్దీ పెరిగినప్పుడే వినియోగంలోకి తెస్తాం
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: భక్తుల భద్రత దృష్ట్యా వెండి వాకిలి వద్ద అత్యవసర ద్వారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీనిని రద్దీ పెరిగినప్పుడు మాత్రమే వినియోగంలోకి తెస్తామని చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వెండివాకిలి వద్ద ఇనుప నిచ్చెనలు’ కథనంపై టీటీడీ అధికారులు స్పందించారు.
ఈవోతో పాటు టీటీడీ జేఈవోలు మీడియాకు వివరణ ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగినప్పుడు వెండి వాకిలి ద్వారా ఒకేసారి 1,500 నుంచి 2 వేల మంది బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటారని, అలాంటి సమయాల్లో తొక్కిసలాట జరిగే ప్రమాదముందన్నారు. అత్యవసర ద్వారం ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇది కేవలం అత్యవసర ద్వారం మాత్రమేనని, రద్దీ పెరిగినప్పుడే వినియోగంలోకి తెస్తామన్నారు. పొరపాట్లకు ఆస్కారమివ్వకుండా, ఆగమశాస్త్రం ప్రకారమే నడుచుకుంటామని ఈవో వివరించారు.