ఐటీ దిగ్గజం విప్రోకు ఓ గండం గట్టెక్కింది!
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఓ గండం నుంచి గట్టెక్కింది. నిధుల దుర్వినియోగ ఆరోపణలపై గత ఆరేళ్లుగా సాగుతున్న విచారణ నుంచి బయటపడింది. ఓ ఉద్యోగికి సంబంధించిన 4 మిలియన్ డాలర్ల(రూ.27 కోట్లకు పైగా) నిధులను విప్రో కంపెనీ దుర్వినియోగానికి పాల్పడిందని అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) విచారణ జరుపుతోంది. ఈ కేసులో అమెరికా ఏజెన్సీతో విప్రో సెటిల్మెంట్ కుదుర్చుకుంది. ఈ సెటిల్మెంట్ కింద కంపెనీ 5 మిలియన్ డాలర్ల(రూ.33 కోట్లకు పైగా) జరిమానా చెల్లించాల్సి ఉంది. అమెరికా ఏజెన్సీతో సెటిల్మెంట్ కుదుర్చుకున్న విషయాన్ని విప్రో దిగ్గజం నేడు బొంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే ఈ సెటిల్మెంట్లో కంపెనీ సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ యాక్ట్ 1934 నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలను విప్రో ఖండించలేదు.
విప్రో ఓ ఉద్యోగికి సంబంధించిన 4 మిలియన్ డాలర్ల నిధులో దుర్వినియోగానికి పాల్పడినట్టు వెల్లడైంది. దీన్ని 2009లో కంపెనీ గుర్తించింది. 2010 సెప్టెంబర్‌లో అమెరికా ఏజెన్సీ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించిన వెంటనే కంపెనీ సైతం అంతర్గతంగా, బహిరంగంగా ఎన్నో విచారణలను చేపట్టింది. అదనంగా అకౌంటింగ్, ఫైనాన్స్‌కు సంబంధించిన అధికారులను నియమించుకోవడం చేసింది. ఎంతో కాలంగా సాగుతున్న ఈ విచారణ ఓ కొలిక్కి రావాలని స్టాక్ హోల్డర్స్ అందరూ భావించారని, ఈ మేరకు ఏజెన్సీలతో పరిష్కారం కుదుర్చుకున్నామని విప్రో తెలిపింది.