రెండేళ్లలో ఇంటింటికీ ఇంకుడుగుంత
⇒ ఉపాధి హామీ పనుల పురోగతిపై సమీక్ష
⇒ మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి జూపల్లి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ మరుగుదొడ్డితోపాటు ఇంకుడు గుంతను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. హరితహారం, ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులను జిల్లాల్లో వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
2018 అక్టోబర్ 2 నాటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇటీవల కేరళలోని కొన్ని గ్రామ పంచాయతీలను తాను సందర్శించానని, అక్కడ అంతగా డ్రైనేజీ వ్యవస్థ కనిపించలేదని.. ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత, కంపోస్ట్ తయారీ, బయో గ్యాస్, వాన నీటిని బావిలోకి పంపే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య లోపమే కనిపించలేదని పేర్కొన్నారు.
జిల్లాల విభజనతో సులువైన పాలన
జిల్లాల విభజన తర్వాత కలెక్టర్లకు పర్యవేక్షణ సులువుగా మారిందని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చేందుకు కలసికట్టుగా పనిచే యాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ, హరితహారం పనులు కొన్ని జిల్లాల్లో లక్ష్యం మేరకు జరగడం లేదన్నారు. కలెక్టర్లు చొరవ చూపి పనుల్లో వేగం పెంచాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంర క్షించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఉ పాధి కూలి కుటుంబానికి 400 మొక్కల పరిర క్షణ బాధ్యతను అప్పగించాలని సూచించారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను వీలైనంత త్వరగా నాటేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది హరితహారానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
ప్రజలు కోరుకున్న మొక్కలు అక్కడక్కడ అందుబాటులో ఉంచలేకపోయామన్నారు. వచ్చే ఏడాది ఈ పరిస్థితి రాకుండా చూసు కోవడంతోపాటు ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మహిళా సంఘాలను చైతన్యపరిచి, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమా వేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, జాయింట్ కమిషనర్లు బి.సైదులు, ఎస్జె ఆషా, జాన్వెస్లీ తదితరులు పాల్గొన్నారు.