Employees Association
-
రాష్ట్ర సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 750 మంది వైద్య సేవలు పొందారు. శిబిరంలో డాక్టర్ వేణు గోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శివ, ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుపై హర్షం
సాక్షి, అమరావతి: పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలివ్వడంపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం థాంక్యూ సీఎం సార్.. అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ముఖ్య ఉపాధ్యక్షుడు నాయుడు, ప్రధాన కార్యదర్శి అబ్రహాంలు ప్రసంగించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. 52,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ 2020 జనవరి 1న నూతన సంవత్సర కానుక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చి పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతన స్కేల్స్ ద్వారా పీఆర్సీని అమలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలోనూ ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఏపీ పీటీడీ ఈయూ హర్షం ఆర్టీసీ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలివ్వడంపై ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, చీఫ్ వైస్‌ప్రెసిడెంట్ సుబ్రమణ్యంరాజు, ఉప ప్రధాన కార్యదర్శులు జీవీ నరసయ్య, ఆవుల ప్రభాకర్‌లు శనివారం ప్రకటనలు విడుదల చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో దసరా పండగకు ముందే ఆర్టీసీ ఉద్యోగులకు పండుగొచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. -
మీ పత్రిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులతో ఆటలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయంగా తమకున్న అక్కసు, కక్షతో ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు సమాచారంతో కథనాలు రాస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం, ఆందోళన కలిగించేందుకు ప్రయత్నిస్తోందని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ తప్పు బట్టింది. సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బీఆర్ఆర్ కిషోర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణలు సోమ వారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని సచివాలయ వ్యవస్థను ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసి, నా లుగు నెలల వ్యవధిలోనే ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య అపోహలు కలిగించేలా ఆ పత్రిక కథనాలు రాయడాన్ని తాము ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో అర్హులకు జూన్ నెలాఖరుకల్లా ప్రొబేషన్ ఖరారు చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేయా లని సీఎం జగన్ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఆదేశాలకనుగుణంగా గతేడాదిలోనే డిపార్ట్మెంట్ టెస్ట్ పాసైన దాదాపు 60 వేల మంది సచివాలయ ఉద్యోగుల వివరాలు ఇప్పటికే అధికారులు తెప్పించుకున్నారని, దీనికి తోడు గత నెలలో డిపార్ట్మెంట్ పరీక్షల్లో పాసైన మరో 12 వేల మంది ఉద్యోగుల వివరాలనూ అధికారులు సేకరిస్తున్నారని అసోసియేషన్ నేతలు గుర్తుచేశారు. ఇంకో 13 వేల మంది ఏఎన్ఎంలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవడంతో వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. మరో 14 వేల మహిళా పోలీసులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ టెస్ట్‌లో పాస్ కాని వారికీ మరోసారి డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు ప్రకటించి వారికి సైతం ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసిన తరుణంలో ఆ పత్రిక యజమాన్యం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగుల జీవితాలతో ఆట లాడుకోవాలనుకోవడం సరికాదని అసోసియేషన్ ప్రతినిధులు ఆ ప్రకటనలో హితవుపలికారు. -
Andhra Pradesh: సుదీర్ఘ చర్చలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం బుధవారం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. సచివాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఏడు గంటలకుపైగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ సహా ప్రతి అంశంపైనా బుగ్గన రాజేంద్రనాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి కూలంకషంగా చర్చించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించి తమ ఆలోచనలు చెప్పారు. కార్యదర్శుల కమిటీ నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని, 11వ పీఆర్సీని యథాతథంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. కేంద్ర వేతన సంఘంతో తమకు సంబంధం లేదంటూ ఫిట్‌మెంట్‌పై తమ డిమాండ్లు తెలిపాయి. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఫిట్‌మెంట్‌పై ఇప్పుడు చేస్తున్న డిమాండ్ కాకుండా అందరు కలిసి ఒక అంకె చెప్పాలని కోరారు. దానిపై నాయకులు ఇప్పటికిప్పుడు చెప్పలేమని తెలిపారు. దీంతో ఫిట్‌మెంట్‌పై మళ్లీ చర్చిద్దామని చెప్పిన సజ్జల మిగిలిన అంశాలపై వివరంగా చర్చించారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సజ్జల హమీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించి త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆందోళనలు చేస్తున్న ఉద్యోగుల జేఏసీ నేతలతో విడిగా మాట్లాడి ఆందోళనలు విరమించుకోవాలని సజ్జల, ఆర్థిక మంత్రి కోరారు. సమస్యల పరిష్కారంపై రూట్ మ్యాప్ ఇస్తే ఆందోళనలు విరమిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. కాగా, నేడు మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ఫిట్మెంట్ విషయంలో స్పష్టత రాలేదన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదిక కాకుండా అధికారుల కమిటీ కొత్తగా సిఫార్సులు చేయడం సంప్రదాయం కాదన్నారు. అన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కనీసంగా 34 శాతం ఫిట్మెంట్ æఇవ్వాలని అడిగామని, మెడికల్ రీయింబర్సుమెంటు రూ. 10 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఫిట్మెంట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ 20 అంశాలపై అన్ని సంఘాలు ఒకే తాటిపై నిలబడ్డాయన్నారు. నిబద్ధతతో ఉన్నాం: సజ్జల ఉద్యోగుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ మీద తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. సీపీఎస్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కసరత్తు చేస్తున్నామని సజ్జల చెప్పారు. -
లక్ష మందితో నవంబర్‌లో సీఎంకు కృతజ్ఞత సభ
సాక్షి, అమరావతి: నవంబర్‌లో లక్ష మందితో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించినట్టు ఆ సంఘం గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. విజయవాడ ఆర్టీసీ సమావేశ మందిరంలో ఆదివారం కార్యవర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరిన వెంటనే సీఎం సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని చెప్పారు. చదవండి: Andhra Pradesh: ఊరికి ఆరోగ్య రేఖ తదనుగుణంగా ఆ ప్రక్రియ జరుగుతోందని, డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణులైన ఉద్యోగులందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వానికి విన్నవించుకుంటూ పలు తీర్మానాలు చేశామన్నారు. డిపార్టుమెంటల్ టెస్ట్ లేని 8 శాఖలకు ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని, ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉద్యోగుల సెలవు దినాలను పనిదినాలుగా పరిగణించి వారిక్కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరారు. స్లైడింగ్‌లో శాఖ మారిన ఉద్యోగుల మొత్తం సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మహిళా పోలీసుల విషయంలో ఆప్షన్ ఇచ్చి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని వెంకట్రామిరెడ్డి కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని 35 మందితో ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడిగా భీమిరెడ్డి అంజిరెడ్డి, వర్కింగ్ అధ్యక్షులుగా నిఖిల్ కృష్ణ, సుధాకర్, భార్గవ్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల అంకం రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఆర్ కిషోర్, ఉపాధ్యక్షులుగా పి.హరీష్, కిషోర్, బాజిని ఎన్నుకున్నారు. చదవండి: వడివడిగా ‘ఈ పంట’ నమోదు -
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. పీఆర్సీ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నివేదికకు వ్యతిరేకంగా బీఆర్కే భవన్ ఎదుట ఉద్యోగ సంఘాల ధర్నాకు దిగడమేకాక పీఆర్సీ ప్రతులను చించేశాయి. ఇక ధర్నా నేపథ్యంలో పోలీసులకు, ఉద్యోగ సంఘాలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు పలువురు ఉద్యోగ సంఘం నేతలను అరెస్ట్ చేశారు. ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం జగన్
-
క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం జగన్
అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లను, డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీపీఆర్టీయూ(ఆంధ్రప్రదేశ్ ప్రొగ్రసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) అధ్యక్షుడు ఎం కృష్ణయ్య, ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
విప్రోపై అమెరికాలో ‘క్లాస్ యాక్షన్’ దావా
వాషింగ్టన్: ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందంటూ ఐటీ దిగ్గజం విప్రోపై అమెరికాలో అయిదుగురు ఉద్యోగుల బృందం క్లాస్ యాక్షన్ దావా వేసింది. దక్షిణాసియా, భారతీయ మూలాలున్న వారికే ప్రాధాన్యమిస్తోందని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన కేసులో ఆరోపించింది. మొత్తం అమెరికా ఐటీ పరిశ్రమలో దక్షిణాసియా ఉద్యోగుల సంఖ్య 12% కాగా, ఒక్క విప్రో అమెరికా విభాగంలో ఏకంగా 80% మంది ఉన్నారని (ప్రధానంగా భారతీయులు) ఉద్యోగుల బృందం పేర్కొంది. కోర్టులో వ్యాజ్యం ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించబోమని విప్రో తెలిపింది. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులను కించపరిచేలా మాట్లాడటం చంద్రబాబు, టీడీపీ నేతలకు కొత్తేమీ కాదన్నారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, గోపాలకృష్ణ ద్వివేదిపై చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. ‘గతంలో ఐపీఎస్ అధికారిని పట్టుకుని అచ్చెన్నాయుడు యూస్‌లెస్ ఫెలో అంటూ బూతులు తిట్టారు. ఐపీఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై కేశినేని నాని, బోండా ఉమా నడిరోడ్డుపైనే దాడికి దిగారని’ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులను కించపరిచేలా మాట్లాడటం తగదని సూర్యనారాయణ పేర్కొన్నారు. -
జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం
-
జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం
సాక్షి, విజయవాడ: అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో సచివాలయం, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల వెనుకబడిన రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఎలాంటి నిర్మాణాలు జరగలేదన్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు. విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. తన రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు ఉద్యోగులను ఉన్నపళంగా అమరావతి తీసుకొచ్చారన్నారు. సచివాలయాన్ని విశాఖలో పెట్టిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. -
పదవీ విరమణ వయసు పెంచొద్దు
ఏపీ ప్రభుత్వానికి ఆప్కాబ్ స్టాఫ్ యూనియన్, ఎంప్లాయిస్ అసోసియేషన్ వినతి సాక్షి, హైదరాబాద్: ఆప్కాబ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచొద్దంటూ ఆ బ్యాంక్ స్టాఫ్ యూనియన్, ఎంప్లాయిస్ అసోసియేషన్లు ప్రభుత్వానికి విన్నవించాయి. విభజన నేపథ్యంలో ఆప్కాబ్‌కు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో రెండు బ్రాంచ్‌లు, 235 మంది ఉద్యోగులను కేటాయించారని పేర్కొన్నాయి. ఇప్పటికే 55 మంది ఉద్యోగులు అధికంగా ఉన్నారని.. పదవీ విరమణ వయసును పెంచితే త్వరలో రిటైర్ అయ్యే 35 మంది ఉద్యోగులను కలుపుకుంటే 90 మంది ఉద్యోగులు అధికంగా ఉన్నట్లు అవుతుందని ప్రభుత్వానికి వివరించాయి. ఇది బ్యాంకుకు ఆర్థిక భారంగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఏఎస్సీఏబీ, తొమ్మిది డీసీసీబీల్లో 750 మంది ఉద్యోగులను నియమించడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నాయి. పదవీ విరమణ వయసును పెంచకపోతే ఆప్కాబ్, డీసీసీబీల పరిధిలో ఖాళీగా ఉన్న 800 ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని సూచించాయి. ఈ మేరకు ఆ బ్యాంక్ యూనియన్ నేతలు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు.