Employess bifurcation
-
జాబ్ ఫైరింగ్... మా డ్యూటీ!
ప్రస్తుతం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగిస్తున్నాయి. ఉద్వాసనకు గురికానున్న ఉద్యోగులను పిలిచి వారికి అర్థమయ్యేలా చెప్పి, ఏ మాత్రం నొప్పించకుండా వారిని పంపించేయడం సవాలుతో కూడుకున్న పనే. వారి తప్పేమీ లేకుండానే రాజీనామా చేయమంటే ఎవ్వరూ ఒప్పుకోరు. కొన్ని సందర్భాల్లో స్వల్ప వాదులాటలూ జరుగుతుంటాయి. ఉద్యోగులను భయపెట్టేందుకు కంపెనీలు బౌన్సర్లను కూడా నియమించుకుంటున్నాయని ఇటీవలే తెలిసొచ్చింది. ఆ తర్వాత నష్టపోయిన ఉద్యోగులు చట్టాలను ఆసరాగా చేసుకుని కంపెనీలపై కేసులు పెడుతుండటమూ చూస్తున్నాం. కానీ కంపెనీలకు ఇంత కష్టం కలిగించకుండా, న్యాయపర చిక్కులూ రాకుండానే అనవసరం అనుకున్న ఉద్యోగులను పంపించేసే మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ విధానంలో ఓ వైపు కొందరికి ఉద్యోగాలు పోతుంటే మరికొందరికి మాత్రం దీని ద్వారా పని దొరుకుతుండటం విశేషం. ఇంతకీ వీరి పనేమిటంటే కంపెనీలు ఏ ఉద్యోగిని చూపిస్తే ఆ ఉద్యోగితో మాట్లాడి, వారిని ఒప్పించి, ఏ గొడవా లేకుండా ఉద్యోగాలు మాన్పించి పంపించేయడమే. ఈ పనులు చేసిపెట్టడానికి ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని కంపెనీలు విదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నాయి. భారత్‌లోనూ వాటి సంఖ్య, అక్కడ పనిచేసే వారికి డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వీటిని ఔట్సోర్సింగ్ కన్సల్టెంట్, ఔట్‌సోర్స్ టర్మినేటర్, ఫైరింగ్ కన్సల్టెంట్ తదితర పేర్లతో పిలుస్తుంటారు. హెచ్ఆర్తో పనిలేకుండానే... సాధారణంగా ఏ కంపెనీలో అయినా మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం కీలకమైనది. సంస్థ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగులను నియమించుకోవడం, పనితీరును, సామర్థ్యాన్ని మదింపు చేసి బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఏటా వేతనాలు పెంచడంతోపాటు, అనుకున్న విధంగా రాణించలేని వారిని తొలగించడం కూడా వీరి పనే. కానీ కొత్త విధానంలో మాత్రం ఉద్యోగుల తొలగింపులో హెచ్ఆర్ విభాగం పాత్ర చాలా పరిమితం. ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించాలో కంపెనీ నిర్ణయించాక, వారి జాబితాను ఫైరింగ్ కన్సల్టెంట్ కంపెనీలకు ఇస్తే చాలు. ఆ కంపెనీ ఉద్యోగులు వచ్చి, ఉద్వాసనకు గురికానున్న ఉద్యోగులతో మాట్లాడతారు. వారికి పూర్తిగా పరిస్థితిని వివరించి, నచ్చజెప్పి, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని వాటిపై ఉద్యోగి సంతకాలు తీసుకుని రాజీనామా చేయిస్తారు. ఘర్షణాత్మక వైఖరికి అవకాశం లేకుండా సులువైన పద్ధతులను అనుసరిస్తారు. ఇలాంటి విషయాల్లో హెచ్ఆర్ మేనేజర్లకు శిక్షణ కూడా ఇస్తారు. భారత్‌లోనూ పెరుగుతున్న డిమాండ్ మరొకరి ఉద్యోగాన్ని ఊడగొట్టే ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు మన దగ్గరా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఈ రంగం కొత్త వృత్తిగా అవతరిస్తోంది. ఈ తరహా సేవల కోసం గతేడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు 88.7 బిలియన్ డాలర్లు ఖర్చుచేసినట్లు అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న ఐడీసీ(ఎన్వైఎస్ఈ–ఐడీసీ) పరిశోధక సంస్థ వెల్లడించింది. పెద్ద కంపెనీలతో పోల్చితే చిన్న కంపెనీలకు ఉద్యోగుల రిక్రూట్మెంట్, పనితీరు సమీక్ష, ఉద్వాసనలు వంటి ముఖ్యమైన విధుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు లేనందువల్ల ఇటువంటి కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్నాయంది. ఈ తరహా సేవలందించే ట్రైనెట్ అనే అమెరికన్ కంపెనీ వ్యవస్థాపకుడు మార్టిన్ బాబినెట్ మాట్లాడుతూ 2002తో పోల్చితే తమ ఆదాయం ఇప్పడు ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించడంలో అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని హెచ్ఆర్ విభాగంలో నియమించుకుంటున్నాయి. 2009లో విడుదలైన, ప్రముఖ నటుడు జార్జి క్లూనీ నటించిన హాలీవుడ్ సినిమా ‘అప్ ఇన్ ది ఎయిర్’ ఈ తరహా కథాంశంతో వచ్చిందే. ఈ సినిమా అప్పట్లోనే వివిధ దేశాల్లో కలిపి 44 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. మన దేశంలో ఉన్న రైట్ మేనేజ్మెంట్, ఆప్టిమమ్, హ్యుమన్ డైనమిక్, హ్యుసిస్ కన్సల్టింగ్, షిల్పుట్సీ వంటి కన్సల్టెన్సీ సంస్థలు ఈ కోవకు చెందినవే. ‘మా కంపెనీ సేవలను పొందేందుకు ఒక్కో ఉద్యోగికి రూ.2 లక్షల వరకు ఆయా సంస్థలు వెచ్చిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మా సేవలను ఎక్కువగా గ్లోబల్ కంపెనీలే ఎక్కువగా ఉపయోగించుకునేవి. రానురాను మా సేవలు కోరుతున్న భారతీయ కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోంది’ అని రైట్ మేనేజ్మెంట్ సంస్థకు ఇండియా మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ పాండే తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సర్టిఫికెట్లతో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ
కమలనాథన్ కమిటీ నిర్ణయం ఉద్యోగుల సర్వీస్ రికార్డులతో పాటే పరిశీలన ఆప్షన్లు దుర్వినియోగం కాకుండా గట్టి చర్యలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో స్థానికతను నిర్ధారించడానికి సర్వీసు రికార్డులతోపాటు, ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఆప్షన్ల విధానం దుర్వినియోగం కాకుండా చూసేందుకు అవసరమైన ఇతర చర్యలకూ సిద్ధమైంది. విభజన తేదీకి ముందు ఉద్యోగులు లేదా వారి కుటుంబసభ్యుల్లో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న, అంగవైకల్యం ఉన్నట్లు నమోదైన వారినే పరిగణనలోకి తీసుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులపై మెడికల్ బోర్డుతో పరిశీలన చేయించాలని కూడా కమిటీ అభిప్రాయపడుతోంది. ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీ బుధవారం తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అర్చనావర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో పాటు తెలంగాణ ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, రామకృష్ణారావు, ఏపీ అధికారులు ఎల్వీ సుబ్రమణ్యం, డాక్టర్ పీవీ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల స్థానికతను సర్వీసు రికార్డుల ఆధారంగా తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వాదించారు. మరోవైపు ఉద్యోగుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని తెలంగాణ సీఎస్ సూచించారు. దీంతో ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి ఈ కమిటీ గత నెల 25న జారీ చేసిన మార్గదర్శకాలపై వంద వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. ఎక్కువగా 18(ఎఫ్) నిబంధనపై అభ్యంతరాలు వచ్చాయి. ఒక కేడర్‌లో స్థానికత ఆధారంగా సీనియర్లందరినీ భర్తీ చేశాక.. మిగిలిన వాటిని స్థానికతతో సంబంధం లేకుండా ఏ రాష్ర్టంలోని జూనియర్లతోనైనా భర్తీ చేయొచ్చని 18(ఎఫ్) నిబంధనలో ఉంది. దీనిపైనే ఎక్కువగా అభ్యంతరాలు రావడంతో స్వల్ప మార్పులు చేయడానికి కమిటీ నిర్ణయించింది. తప్పనిసరి ఆప్షన్స్ ఉన్న ఉద్యోగుల్లో భార్యాభర్తలు, ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తదితర అంశాలను దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక ఉద్యోగుల విభజన సెల్లో తెలంగాణ అధికారులకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ఆంధ్రా సచివాలయానికి సంబంధించి మొత్తం సమాచారం సీజీజీ విభాగం నుంచి రానున్న నేపథ్యంలో.. దానికి డీజీగా ఉన్న తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా విభజన ప్రక్రియలో భాగస్వామిని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, చివరి గ్రేడ్ ఉద్యోగులైన అటెండర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు తదితరులను స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఈ ఉద్యోగులు ఆప్షన్స్ ఇస్తే ఆ ప్రకారమే విభజిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం కేడర్ పోస్టులను ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టనున్నారు. తుదకు ఖరారు చేసిన మార్గదర్శకాలు కేంద్ర హోం, న్యాయ శాఖల ద్వారా ప్రధాని ఆమోదం కోసం వెళతాయి. అక్కడ ఆమోదముద్ర పడగానే ఇరు రాష్ట్రాలకు కేడర్ పోస్టులను కేటాయిస్తారు. వీటి ఆధారంగా తుది మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన జరుగుతుంది. భౌగోళికంగా కచ్చితంగా ఉండాల్సిన పోస్టులను ఆయా రాష్ట్రాలకే కేటాయించనున్నారు. ఉదాహరణకు పోర్టులు, ఈఎస్ఐ సంస్థలు ఉన్న చోట మొత్తం ఉద్యోగులను ఆయా రాష్ట్రాలకే కేటాయిస్తారు. ఇక్కడ 58:42 నిష్పత్తిని పాటించరు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ తాత్కాలికంగా పూర్తయ్యాక ఏ ప్రభుత్వం ఎన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించడానికి అంగీకరిస్తుందో తెలుస్తుందని, దాని ఆధారంగా శాశ్వత విభజన చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు ఎలాంటి ప్రతిపాదనలు చేయనట్లు సమాచారం. -
కమలనాధన్ కమిటీని కీలుబొమ్మలా ఆడిస్తోంది
హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. కమలనాధన్ కమిటీపై ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ పెత్తనం చేస్తోందని దేవీ ప్రసాద్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదని దేవీ ప్రసాద్ హెచ్చరించారు. 18 (ఎఫ్ ) నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ జీవోను తొలగించాల్సిందేనని టీఎన్జీ వో నేత విఠల్ అన్నారు. కమలనాధన్ కమిటీని కేంద్రం కీలుబొమ్మలా చేసి ఆడిస్తోందని, జోనల్, జిల్లా పోస్టుల విభజన కూడా జరగాల్సిందన్నారు. ఏపీ ప్రభుత్వం వెకిలి చేష్టలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలు చేశారు.