Empty spaces
-
10 శాతంపై ఇక లెక్క.. పక్కా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మొండికేసిన రియల్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం పైచేయి సాధించింది. లేఅవుట్లలో పది శాతం ఖాళీ స్థలాలను పంచాయతీలకు బదలాయించకుండా అట్టిపెట్టుకున్న జాగాలను ఎట్టకేలకు స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో ఏకంగా రూ.5 వేల కోట్ల విలువైన భూములను తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటి వరకు 1,764.07 ఎకరాలను గుర్తించిన యంత్రాంగం.. వీటిపై యాజమాన్య హక్కులు పొందే దిశగా అడుగులు వేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి.. ఏదేనీ వెంచర్/లేఅవుట్ అభివృద్ధి చేస్తే మొత్తం విస్తీర్ణంలో పది శాతం ఓపెన్ ఏరియాను స్థానిక గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా అప్పగించాలి. ఈ స్థలాన్ని గిఫ్ట్ డీడ్ రూపేణా రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే, ఈ నిబంధన క్షేత్రస్థాయిలో అమలవ్వడం లేదు. లేఅవుట్లలో ఖాళీ స్థలంగా పేర్కొన్న జాగాలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదనే ఆంక్షలు ఉన్నప్పటికీ రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమ్మేస్తున్నారు. ఈ స్థలాలను కాపాడాల్సిన పంచాయతీ కార్యదర్శులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వీటికి రెక్కలొస్తున్నాయి. ఇలా ఎక్కడికక్కడ భూములను కొల్లగొడుతుండటంతో నగరీకరణ నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న కాలనీల్లో పచ్చదనం లేకుండా పోతోంది. ప్రజావసరాలకే ఉపయోగించాలి హెచ్ఎండీఏ లేదా డీటీసీపీ లేఅవుట్ల ప్లాన్లలో పది శాతం భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరత్రా అవసరాలకు వినియోగించరాదు. ఒకవేళ భూ వినియోగ మార్పిడి జరగాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ స్థలంలో పచ్చదనం లేదా సామాజిక అవసరాలకు అది కూడా కలెక్టర్ ఆమోదంతో చేపట్టాలి. అయితే, ఇవేవీ పట్టించుకోని వ్యాపారులు వీటిని కూడా అమ్మేస్తున్నారు. నగర శివార్లలో భూముల విలువలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో కారుచౌకగా లభించే ఈ స్థలాలను ల్యాండ్ మాఫియా కొట్టేస్తోంది. మరోవైపు కొన్ని చోట్ల ఈ స్థలాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో ఇలా కైంకర్యమవుతున్న స్థలాలను కాపాడాలని భావించిన జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి.. లేఅవుట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తద్వారా రియల్టర్ల కబంధ హస్తాల్లో చిక్కుకున్న వేలాది ఎకరాలకు విముక్తి కల్పించారు. భారీగా భూ నిధి.. పది శాతం స్థలాలపై పట్టు బిగించిన జిల్లా యంత్రాంగం.. ఇందులో 837 ఎకరాలను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. జిల్లావ్యాప్తంగా భారీగా ల్యాండ్ బ్యాంక్(భూ నిధి)ను సమకూర్చుకున్న పంచాయతీలకు భవిష్యత్తులో ప్రజావసరాలకు సరిపడా స్థలాలు దక్కాయి. కాగా, విలువ ప్రకారం చెప్పుకుంటే రాజేంద్రనగర్‌లో అత్యంత ఖరీదైన స్థలాలు గ్రామ పంచాయతీల వశమయ్యాయి. ఈ మండలంలో ఏకంగా 97 ఎకరాలు సేకరించిన అధికారగణం.. వీటి ఖరీదు రూ.1,400 కోట్లపైనే ఉంటుందని లెక్కగట్టింది. మహేశ్వరంలో స్వాధీనం చేసుకున్న 440 ఎకరాల విలువ దాదాపు రూ.450 కోట్లు ఉంటుందని అంచనా వేస్తోంది. ఇదిలావుండగా, అక్రమ లేఅవుట్లు పుట్టుకురాకుండా చర్యలు తీసుకుంటోంది. పంచాయతీల వారీగా భూ రికార్డులను తయారు చేస్తోంది. పార్కులుగా అభివృద్ధి చేస్తాం సేకరించిన స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే 1.95 లక్షల మొక్కలు నాటాం. ఆర్థిక వనరులు బాగా ఉన్న గ్రామాల్లో ఆ స్థలాలకు ప్రహరీలు నిర్మిస్తున్నాం. ఇంకా స్థలాలు అప్పగిం చని, అమ్ముకున్నట్లు తేలిన రియల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – డీపీవో పద్మజారాణి -
ఈత మొక్కలతో గీత కార్మికులకు ఉపాధి
గీత కార్మికులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు ఖాళీ ప్రదేశాల్లో, పొలాల గెట్లపై ఈత మొక్కలు నాటుకోవాలి, బిచ్కుంద : ఈత మొక్కలతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తోందని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. శుక్రవారం బిచ్కుంద సౌదర్ చెరువు కట్టపై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు ఖాళీ ప్రదేశాల్లో, పొలాల గెట్లపై ఈత మొక్కలు నాటుకోవాలని, అందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవడానికి సిద్ధంగా ఉందన్నారు. గీత కార్మికులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని వారి అభివృద్ధికి కృషి చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకుటే స్వఛమైన గాలితో అందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. చాలా మంది చెట్లను నరుకుతున్నారు కానీ మొక్కలు నాటకపోవడంతో పచ్చదనం తగ్గి వర్షాలు పడడంలేదన్నారు. కనీసం ఒక వ్యక్తి ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సాయిరాం, రాజుల్లా సర్పంచ్ అశోక్ పటేల్, ఎక్సైజ్ సీఐ సాయన్న, ఎంపీడీవో సాయిబాబా, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రావు, బాబాగౌడ్, బొమ్మల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ స్థలాలు... లెక్క తప్పింది!
నగరంలో ఖాళీ స్థలాలు 14,915 బకాయిలు రూ.53.78 కోట్లు స్థలాలు తగ్గిపోయాయంటూ అధికారుల వింత వాదన ఆస్తిపన్నూ పెరగని వైనం కొందరు సిబ్బంది అవినీతి వల్లే ఖజానాకు గండి! విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయి అంటే.. ఏమో అన్న సమాధానం ఎదురవుతోంది. పక్కగా లెక్క చెప్పాల్సిన రెవెన్యూ అధికారులు కాకిలెక్కలతో గారడీ చెస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని కార్పొరేషన్ కోల్పోతోంది. ఖాళీ స్థలాల పన్ను బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. నగరంలో 14,915 ఖాళీ స్థలాలు ఉన్నాయంటూ రికార్డుల్లో పేర్కొన్న అధికారులు పన్నులు వసూలు చేయమంటే అబ్బే.. అన్ని స్థలాలు ఎక్కడ ఉన్నాయ్ అంటూ వింత వాదన మొదలెట్టారు. మరి ఆ ఖాళీ స్థలాల వివరాలు ఎలా వచ్చాయంటే సమాధానం ఉండటం లేదు. చేయి చాస్తున్నారు... ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నగరపాలక సంస్థలో ఖాళీ స్థలాల పన్ను వసూళ్లు ప్రహసనంలా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలో వేల సంఖ్యలో ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ కార్పొరేషన్‌కు వస్తున్న ఆదాయం అరకొరే. కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతూ కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఖాళీ స్థలాల పన్ను వసూళ్ల విషయంలో మేయర్ కోనేరు శ్రీధర్ సీరియస్‌గా ఉన్నారు. పన్నులు రాబట్టాల్సిందిగా డీసీఆర్ రమణిని ఆదేశించారు. రెండు నెలల కిత్రం బాధ్యతలు చేపట్టిన ఆమె ఖాళీస్థలాల సంగతేంటో తేల్చాలని కింది సిబ్బందికి సూచించారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. నగరపాలక సంస్థలో 14 వేల ఖాళీ స్థలాలు లేవని, అదోదే పాత లెక్క అని సిబ్బంది తేల్చేశారు. ఖాళీ స్థలాలు ఏమయ్యాయి సిబ్బంది చెప్పినట్లు ఖాళీ స్థలాల్లో ఇళ్లు కడితే ఆస్తిపన్ను పెరగాల్సి ఉంటుంది. నగరంలోని 59 డివిజన్ల పరిధిలో లక్షా 79 వేల 245 అసెస్మెంట్ల నుంచి రూ.80 కోట్ల 65 లక్షల 28 వేల 571 ఆస్తిపన్ను డిమాండ్‌గా రికార్డుల్లో పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లుగా ఇదే డిమాండ్ చూపుతున్నారు. గృహ నిర్మాణాల సంఖ్య పెరగనప్పుడు ఖాళీ స్థలాలు ఏమయ్యాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కమిషనర్ సాయంత్రం సరదాగా కార్యాలయానికి వచ్చివెళుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఆర్ఐలు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్ రెవెన్యూ విభాగం సిబ్బంది పనితీరుపై మండిపడ్డారు. బకాయిలను వసూలు చేసి.. రెవెన్యూను గాడిలో పెట్టడం డిప్యూటీ కమిషనర్‌కు సవాల్‌గా మారింది. నగరపాలక సంస్థ పరిధిలో 14,915 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఏడాదికి పన్నుల రూపంలో వీటి నుంచి రూ.53 కోట్ల 78 లక్షల 99 వేల 635 వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.4 కోట్ల 60 లక్షల 50 వేల 845 వసూలైంది. ఇదీ రెవెన్యూ రికార్డుల లెక్క. కార్పొరేషన్లో 14,915 ఖాళీ స్థలాలు లేవని మా (రెవెన్యూ) వాళ్లు చెబుతున్నారు. అత్యధిక స్థలాల్లో ఇళ్లు కట్టేశారు. వాళ్లకు ఇంటి పన్ను వేస్తాం. అప్పుడు ఖాళీ స్థలాల పన్ను డిమాండ్ తగ్గిపోతుంది కదా. నేను బాధ్యతలు చేపట్టి రెండు నెలలే అయింది. - ఏవీ రమణి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డివిజన్లలో తిరిగితే తెలుస్తోంది. పటమట ప్రాంతంలోనే పది ఎకరాల భూమి ఖాళీగా ఉంది. భవానీపురం దర్గా భూముల్లో షెడ్లు వేసి మార్బుల్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ల నుంచి ఎందుకు పన్నులు వసూలు చేయడం లేదు? అధికారులు దృష్టిసారిస్తే సిబ్బంది పనిచేస్తారు. - కోనేరు శ్రీధర్, మేయర్, నగరపాలక సంస్థ