నగరంలో ఖాళీ స్థలాలు 14,915
బకాయిలు రూ.53.78 కోట్లు
స్థలాలు తగ్గిపోయాయంటూ అధికారుల వింత వాదన
ఆస్తిపన్నూ పెరగని వైనం
కొందరు సిబ్బంది అవినీతి వల్లే ఖజానాకు గండి!
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయి అంటే.. ఏమో అన్న సమాధానం ఎదురవుతోంది. పక్కగా లెక్క చెప్పాల్సిన రెవెన్యూ అధికారులు కాకిలెక్కలతో గారడీ చెస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని కార్పొరేషన్ కోల్పోతోంది. ఖాళీ స్థలాల పన్ను బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. నగరంలో 14,915 ఖాళీ స్థలాలు ఉన్నాయంటూ రికార్డుల్లో పేర్కొన్న అధికారులు పన్నులు వసూలు చేయమంటే అబ్బే.. అన్ని స్థలాలు ఎక్కడ ఉన్నాయ్ అంటూ వింత వాదన మొదలెట్టారు. మరి ఆ ఖాళీ స్థలాల వివరాలు ఎలా వచ్చాయంటే సమాధానం ఉండటం లేదు.
చేయి చాస్తున్నారు...
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నగరపాలక సంస్థలో ఖాళీ స్థలాల పన్ను వసూళ్లు ప్రహసనంలా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలో వేల సంఖ్యలో ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ కార్పొరేషన్‌కు వస్తున్న ఆదాయం అరకొరే. కొందరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతూ కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఖాళీ స్థలాల పన్ను వసూళ్ల విషయంలో మేయర్ కోనేరు శ్రీధర్ సీరియస్‌గా ఉన్నారు. పన్నులు రాబట్టాల్సిందిగా డీసీఆర్ రమణిని ఆదేశించారు. రెండు నెలల కిత్రం బాధ్యతలు చేపట్టిన ఆమె ఖాళీస్థలాల సంగతేంటో తేల్చాలని కింది సిబ్బందికి సూచించారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. నగరపాలక సంస్థలో 14 వేల ఖాళీ స్థలాలు లేవని, అదోదే పాత లెక్క అని సిబ్బంది తేల్చేశారు.
ఖాళీ స్థలాలు ఏమయ్యాయి
సిబ్బంది చెప్పినట్లు ఖాళీ స్థలాల్లో ఇళ్లు కడితే ఆస్తిపన్ను పెరగాల్సి ఉంటుంది. నగరంలోని 59 డివిజన్ల పరిధిలో లక్షా 79 వేల 245 అసెస్‌మెంట్ల నుంచి రూ.80 కోట్ల 65 లక్షల 28 వేల 571 ఆస్తిపన్ను డిమాండ్‌గా రికార్డుల్లో పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లుగా ఇదే డిమాండ్ చూపుతున్నారు. గృహ నిర్మాణాల సంఖ్య పెరగనప్పుడు ఖాళీ స్థలాలు ఏమయ్యాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కమిషనర్ సాయంత్రం సరదాగా కార్యాలయానికి వచ్చివెళుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఆర్‌ఐలు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్ రెవెన్యూ విభాగం సిబ్బంది పనితీరుపై మండిపడ్డారు. బకాయిలను వసూలు చేసి.. రెవెన్యూను గాడిలో పెట్టడం డిప్యూటీ కమిషనర్‌కు సవాల్‌గా మారింది.
నగరపాలక సంస్థ పరిధిలో 14,915 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఏడాదికి పన్నుల రూపంలో వీటి నుంచి రూ.53 కోట్ల 78 లక్షల 99 వేల 635 వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.4 కోట్ల 60 లక్షల 50 వేల 845 వసూలైంది. ఇదీ రెవెన్యూ రికార్డుల లెక్క.
కార్పొరేషన్‌లో 14,915 ఖాళీ స్థలాలు లేవని మా
(రెవెన్యూ) వాళ్లు చెబుతున్నారు. అత్యధిక స్థలాల్లో ఇళ్లు కట్టేశారు. వాళ్లకు ఇంటి పన్ను వేస్తాం. అప్పుడు ఖాళీ స్థలాల పన్ను డిమాండ్ తగ్గిపోతుంది కదా. నేను బాధ్యతలు చేపట్టి రెండు నెలలే అయింది.
- ఏవీ రమణి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ)
డివిజన్లలో తిరిగితే తెలుస్తోంది. పటమట ప్రాంతంలోనే పది ఎకరాల భూమి ఖాళీగా ఉంది. భవానీపురం దర్గా భూముల్లో షెడ్లు వేసి మార్బుల్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ల నుంచి ఎందుకు పన్నులు వసూలు చేయడం లేదు? అధికారులు దృష్టిసారిస్తే సిబ్బంది పనిచేస్తారు.
- కోనేరు శ్రీధర్, మేయర్, నగరపాలక సంస్థ
ఖాళీ స్థలాలు... లెక్క తప్పింది!
Published Sat, Nov 21 2015 12:55 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement