⇒ గాడి తప్పిన నగరపాలక సంస్థ పాలన
⇒ పట్టాలెక్కని నగరాభివృద్ధి పథకాలు
⇒ పెండింగ్‌లో భవన నిర్మాణ దరఖాస్తులు
⇒ కాంపౌండ్ జరిమానాలతో యజమానుల బెంబేలు
⇒ అవినీతి మత్తులో రెవెన్యూ విభాగం
⇒ పన్నుల పెంపు పేరిట అక్రమ వసూళ్లు
⇒ మరో వైపు ముంచుకొస్తున్న తాగునీటి గండం
గుంటూరు : నగరపాలక సంస్థలో అత్యంత ప్రధానమైనది పట్టణ ప్రణాళికా విభాగం. రాజధాని జిల్లా కేంద్రం గుంటూరు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతోపాటే నిర్మాణాలు సైతం వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఆరు నెలల క్రితం అప్పటి కమిషనర్లు నిర్మాణ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించినా ఇప్పటి వరకు ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. కొత్త కమిషనర్ రావడంతో ఆమె మరోసారి నిర్మాణ దరఖాస్తులు పరిశీలించిన తర్వాతే ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించారు. కమిషనర్‌గా నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తున్నా సిటీప్లానర్‌కు రెండురోజుల ముందు వరకు డెలిగేషన్ పవర్స్ ఇవ్వలేదు. గత కమిషనర్లు ఆమోదం తెలిపిన భవన నిర్మాణాలను యజమానులు ప్రారంభించారు. దీంతో ఆయా యజమానులకు కాంపౌండ్ జరిమానా కింద రూ.10 వేల నుంచి రూ. 15వేల వరకు విధిస్తున్నారు. దీంతో బిల్డర్లు, భవన యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే భవన నిర్మాణ దరఖాస్తులతోపాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీలో సైతం ఇదే విధానం కొనసాగిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నూతన భవనాలకు పన్ను విధింపులో అవినీతి ...
ఇక రెవెన్యూ విభాగంలో ఇంతకు ముందు లేని విధంగా దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగు తోంది. నూతనంగా విలీనమైన గ్రామాల్లోని గృహాలకు పన్నులు పెంచే అంశంపై సర్వే చేస్తున్నారు. ఇదే అదనుగా సిబ్బంది పన్నులు పెంచుతామంటూ ప్రజలను బెదిరిస్తూ పెద్ద ఎత్తున డబ్బు గుంజుతున్నారు. నగరంలో నూతనంగా నిర్మించిన భవనాలకు పన్ను విధింపులో సైతం పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నిర్మించిన భవనాలతో పాటు అండర్ అసెస్‌మెంట్ల విషయంలో ఇది తార స్థాయికి చేరింది. కమిషనర్‌ని సైతం రెవెన్యూ ఉన్నతాధికారులు తప్పదారి పట్టిస్తున్నారు.
అధికారుల మధ్య సమన్వయలోపం...
ఇదే సమయంలో నగరానికి మంచినీటిని తెచ్చే కృష్ణానదిలో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. దీంతో గుంటూరు చానల్‌కు ఆనకట్ట వేసి నీటిని నిల్వ చేసుకోవాల్సిన అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. మరో పది, పదిహేను రోజుల కంటే కృష్ణానీరు నగరానికి అందే అవకాశం లేదు. ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారు ల మధ్య సమన్వయలేమి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించేలా ఉంది. కమిషనర్ సైతం దీనిపై ఇప్పటి వరకు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇంజినీరింగ్ విభాగంలో నెలకొన్న ఆధిపత్య పోరు నగరాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, సూపరింటెండెంట్ ఇంజినీర్ల మధ్య వర్గ పోరు చినికి చినికి గాలి వానలా మారింది.
అభివృద్ధిలో 20 ఏళ్ల వెనక్కు...
గతంలో కమిషనర్లుగా పనిచేసిన కన్నబాబు, అనురాధలు నగరాభివృద్ధిలో భాగంగా చెరువుల అభివృద్ధి, కార్పొరేషన్‌కు నూతన భవన నిర్మాణం, మానస సరోవరం, గాంధీపార్కు అభివృద్ధి, నగరంలో 12 రోడ్ల విస్తరణ, కూడళ్లు అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీటిని పట్టాలెక్కించే సమయానికి బదిలీ అయ్యారు. తర్వాత అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగురు కమిషనర్లు మారడంతో పాటు అభివృద్ధిని 20 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లారన్న విమర్శలు వస్తున్నాయి. పనిచేసే అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వానికి త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
గాడి తప్పిన నగరపాలక సంస్థ పాలన
Published Sat, Jan 23 2016 3:08 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement