planning section
-
గాడి తప్పిన నగరపాలక సంస్థ పాలన
⇒ గాడి తప్పిన నగరపాలక సంస్థ పాలన ⇒ పట్టాలెక్కని నగరాభివృద్ధి పథకాలు ⇒ పెండింగ్‌లో భవన నిర్మాణ దరఖాస్తులు ⇒ కాంపౌండ్ జరిమానాలతో యజమానుల బెంబేలు ⇒ అవినీతి మత్తులో రెవెన్యూ విభాగం ⇒ పన్నుల పెంపు పేరిట అక్రమ వసూళ్లు ⇒ మరో వైపు ముంచుకొస్తున్న తాగునీటి గండం గుంటూరు : నగరపాలక సంస్థలో అత్యంత ప్రధానమైనది పట్టణ ప్రణాళికా విభాగం. రాజధాని జిల్లా కేంద్రం గుంటూరు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతోపాటే నిర్మాణాలు సైతం వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఆరు నెలల క్రితం అప్పటి కమిషనర్లు నిర్మాణ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించినా ఇప్పటి వరకు ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. కొత్త కమిషనర్ రావడంతో ఆమె మరోసారి నిర్మాణ దరఖాస్తులు పరిశీలించిన తర్వాతే ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించారు. కమిషనర్‌గా నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తున్నా సిటీప్లానర్‌కు రెండురోజుల ముందు వరకు డెలిగేషన్ పవర్స్ ఇవ్వలేదు. గత కమిషనర్లు ఆమోదం తెలిపిన భవన నిర్మాణాలను యజమానులు ప్రారంభించారు. దీంతో ఆయా యజమానులకు కాంపౌండ్ జరిమానా కింద రూ.10 వేల నుంచి రూ. 15వేల వరకు విధిస్తున్నారు. దీంతో బిల్డర్లు, భవన యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే భవన నిర్మాణ దరఖాస్తులతోపాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీలో సైతం ఇదే విధానం కొనసాగిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన భవనాలకు పన్ను విధింపులో అవినీతి ... ఇక రెవెన్యూ విభాగంలో ఇంతకు ముందు లేని విధంగా దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగు తోంది. నూతనంగా విలీనమైన గ్రామాల్లోని గృహాలకు పన్నులు పెంచే అంశంపై సర్వే చేస్తున్నారు. ఇదే అదనుగా సిబ్బంది పన్నులు పెంచుతామంటూ ప్రజలను బెదిరిస్తూ పెద్ద ఎత్తున డబ్బు గుంజుతున్నారు. నగరంలో నూతనంగా నిర్మించిన భవనాలకు పన్ను విధింపులో సైతం పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నిర్మించిన భవనాలతో పాటు అండర్ అసెస్మెంట్ల విషయంలో ఇది తార స్థాయికి చేరింది. కమిషనర్ని సైతం రెవెన్యూ ఉన్నతాధికారులు తప్పదారి పట్టిస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయలోపం... ఇదే సమయంలో నగరానికి మంచినీటిని తెచ్చే కృష్ణానదిలో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. దీంతో గుంటూరు చానల్‌కు ఆనకట్ట వేసి నీటిని నిల్వ చేసుకోవాల్సిన అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. మరో పది, పదిహేను రోజుల కంటే కృష్ణానీరు నగరానికి అందే అవకాశం లేదు. ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారు ల మధ్య సమన్వయలేమి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించేలా ఉంది. కమిషనర్ సైతం దీనిపై ఇప్పటి వరకు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇంజినీరింగ్ విభాగంలో నెలకొన్న ఆధిపత్య పోరు నగరాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, సూపరింటెండెంట్ ఇంజినీర్ల మధ్య వర్గ పోరు చినికి చినికి గాలి వానలా మారింది. అభివృద్ధిలో 20 ఏళ్ల వెనక్కు... గతంలో కమిషనర్లుగా పనిచేసిన కన్నబాబు, అనురాధలు నగరాభివృద్ధిలో భాగంగా చెరువుల అభివృద్ధి, కార్పొరేషన్‌కు నూతన భవన నిర్మాణం, మానస సరోవరం, గాంధీపార్కు అభివృద్ధి, నగరంలో 12 రోడ్ల విస్తరణ, కూడళ్లు అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీటిని పట్టాలెక్కించే సమయానికి బదిలీ అయ్యారు. తర్వాత అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగురు కమిషనర్లు మారడంతో పాటు అభివృద్ధిని 20 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లారన్న విమర్శలు వస్తున్నాయి. పనిచేసే అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వానికి త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. -
వీళ్లు.. పెద్ద ముదుర్లు
అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్‌లో ‘డబ్బు కొట్టు.. పోస్టు పట్టు’ అన్న చందాన డిప్యుటేషన్ల వ్యవహారం సాగిపోతోంది. కొంతమంది ఉద్యోగులు కాల పరిమితి లేకుండా తమకు నచ్చిన పోస్టులో ఏళ్ల కొద్దీ తిష్టవేస్తున్నారు. వీరికీ వెసులుబాటును జెడ్పీ ఉన్నతాధికారులే కల్పిస్తున్నారు. రెగ్యులర్ పోస్టులో పనిచేయకుండానే డిప్యుటేషన్లపై సర్వీసును పూర్తి చేస్తున్న అధికారులూ లేకపోలేదు. జెడ్పీ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులకు డిప్యుటేషన్ నియామకాలు చేపట్టరాదని గతంలోనే జీవో (పీ) నంబర్ 10, మెమో నంబర్ 9668/సీపీఆర్ ద్వారా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. డిప్యుటేషన్‌పై ఇతర జిల్లాల్లో మాత్రమే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఈ నిబంధనకు తిలోదకాలిచ్చి జిల్లాలోనే ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్ నియామకాలు చేపడుతున్నారు. ఎప్పుడూ ప్రాధాన్యత పోస్టుల్లోనే పనిచేసే అధికారులు బదిలీల సమయంలో అప్రాధాన్యత పోస్టులకు వెళుతున్నా ఎక్కువ రోజులు అక్కడ ఉండడం లేదు. పలుకుబడిని ఉపయోగించి తిరిగి యథా స్థానాలకు కొంతమంది వస్తుంటే.. మరికొందరు ప్రాధాన్యత పోస్టులను చేజిక్కించుకుంటున్నారు. ఈ తతంగంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జెడ్పీ నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మచ్చుకు కొన్ని డిప్యుటేషన్ నియామకాలను పరిశీలిస్తే..నిబంధనలకు నీళ్లొదిలిన విషయం స్పష్టమవుతోంది. జెడ్పీ కార్యాలయంలో పదేళ్లుగా పక్కకు కదలకుండా ఒకే సీటులో పనిచేస్తున్న ఘనులూ ఉన్నారు. ప్లానింగ్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ దాస్ పదేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల సాధారణ బదిలీల్లో ఈయన కళ్యాణదుర్గానికి బదిలీ అయినా అక్కడ పనిచేస్తున్న అధికారితో పరస్పర ఒప్పందం కుదుర్చుకొని అదే రోజే తిరిగి యథా స్థానానికి రావడం గమనార్హం. బీఆర్‌జీఎఫ్‌ను పరిశీలించే శివకుమార్‌శర్మ కూడా పదేళ్లుగా కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన బుక్కరాయసముద్రం ఎంపీడీఓ కార్యాలయానికి బదిలీ అయినా డిప్యుటేషన్‌పై మళ్లీ ఇక్కడికే వచ్చారు. ఇదే కోవలో సూపరింటెండెంట్ వెంకట్రావు కూడా ఉన్నారు. కూడేరు మండల పరిషత్ సూపరింటెండెంట్‌గా నియమితులైన ఈయన.. డిప్యుటేషన్‌పై కొన్నేళ్లుగా సీఈఓ పేషీలో పనిచేస్తున్నారు. ఎన్నడూ మండలాల్లో పనిచేయలేదు. ఇటీవల సీఈఓ రామచంద్ర కార్యాలయంలోనే డిప్యుటేషన్‌పైనే పీఎఫ్ సెక్షన్‌కు బదిలీ చేశారు. డీఆర్డీఏ కార్యాలయంలో మేనేజర్‌గా నియమితులైన రాజ్‌గోపాల్ కూడా ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ చమన్‌కు సీసీగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శంకర్ , టైపిస్టు జాకీర్లు కొన్నేళ్లుగా డిప్యుటేషన్లపైనే పనిచేస్తున్నారు. తాజాగా పుట్లూరు సూపరింటెండెంట్ సుభాన్ డిప్యుటేషన్ నియామకంపై తర్జనభర్జన పడుతున్నారు. తొలుత జెడ్పీ కార్యాలయంలోనే పనిచేయాలని భావించినా.. అది జరగలేదు. శింగనమల ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో అక్కడకు వెళ్లేందుకు దాదాపు ఖరారయినా చివరి నిమిషంలో నాయకులు వ్యతిరేకించడంతో సాధ్యపడలేదు. ఇలా జెడ్పీలో కొంతమంది ఉద్యోగులు చివరిదాకా ప్రాధాన్యత పోస్టుల్లోనే ఉండేందుకు మక్కువ చూపుతున్నారు. పాలనాపరంగా ఇబ్బందులు వస్తాయనే.. జిల్లా పరిషత్‌లో డిప్యుటేషన్‌పై కొంతమంది అధికారులు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న మాట వాస్తవమే. పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని డిప్యుటేషన్లు నేను రాకమునుపే జరిగాయి. ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ దాస్ కోర్టు కేసులు, సూపరింటెండెంట్ శివకుమార్ శర్మ బీఆర్జీఎఫ్ విభాగాలను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటికీ వారే కరెక్ట్ అనే భావనతో అక్కడే ఉంచాం. మిగిలిన వారికి త్వరలోనే స్థాన చలనం కల్పిస్తాం. రామచంద్ర, సీఈఓ, జిల్లా పరిషత్