వీళ్లు.. పెద్ద ముదుర్లు | JOBS | Sakshi
Sakshi News home page

వీళ్లు.. పెద్ద ముదుర్లు

Published Mon, Apr 20 2015 3:06 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

JOBS

 అనంతపురం సెంట్రల్ :   జిల్లా పరిషత్‌లో ‘డబ్బు కొట్టు.. పోస్టు పట్టు’ అన్న చందాన డిప్యుటేషన్ల వ్యవహారం సాగిపోతోంది. కొంతమంది ఉద్యోగులు కాల పరిమితి లేకుండా తమకు నచ్చిన పోస్టులో ఏళ్ల కొద్దీ తిష్టవేస్తున్నారు. వీరికీ వెసులుబాటును జెడ్పీ ఉన్నతాధికారులే కల్పిస్తున్నారు. రెగ్యులర్ పోస్టులో  పనిచేయకుండానే డిప్యుటేషన్లపై సర్వీసును పూర్తి చేస్తున్న అధికారులూ లేకపోలేదు. జెడ్పీ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులకు డిప్యుటేషన్ నియామకాలు చేపట్టరాదని గతంలోనే జీవో (పీ) నంబర్ 10, మెమో నంబర్ 9668/సీపీఆర్ ద్వారా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.

డిప్యుటేషన్‌పై ఇతర జిల్లాల్లో  మాత్రమే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఈ నిబంధనకు తిలోదకాలిచ్చి జిల్లాలోనే ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్ నియామకాలు చేపడుతున్నారు. ఎప్పుడూ ప్రాధాన్యత పోస్టుల్లోనే పనిచేసే అధికారులు బదిలీల సమయంలో అప్రాధాన్యత పోస్టులకు వెళుతున్నా ఎక్కువ రోజులు అక్కడ ఉండడం లేదు. పలుకుబడిని ఉపయోగించి తిరిగి యథా స్థానాలకు కొంతమంది వస్తుంటే.. మరికొందరు ప్రాధాన్యత పోస్టులను చేజిక్కించుకుంటున్నారు. ఈ తతంగంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 

 జెడ్పీ నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మచ్చుకు కొన్ని డిప్యుటేషన్ నియామకాలను పరిశీలిస్తే..నిబంధనలకు నీళ్లొదిలిన విషయం స్పష్టమవుతోంది.  జెడ్పీ కార్యాలయంలో పదేళ్లుగా పక్కకు కదలకుండా ఒకే సీటులో పనిచేస్తున్న ఘనులూ ఉన్నారు. ప్లానింగ్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్ దాస్ పదేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల సాధారణ బదిలీల్లో ఈయన కళ్యాణదుర్గానికి బదిలీ అయినా అక్కడ పనిచేస్తున్న అధికారితో పరస్పర ఒప్పందం కుదుర్చుకొని అదే రోజే తిరిగి యథా స్థానానికి రావడం గమనార్హం.
 
 బీఆర్‌జీఎఫ్‌ను పరిశీలించే శివకుమార్‌శర్మ కూడా పదేళ్లుగా కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన బుక్కరాయసముద్రం ఎంపీడీఓ కార్యాలయానికి బదిలీ అయినా డిప్యుటేషన్‌పై మళ్లీ ఇక్కడికే వచ్చారు. ఇదే కోవలో సూపరింటెండెంట్ వెంకట్రావు కూడా ఉన్నారు. కూడేరు మండల పరిషత్ సూపరింటెండెంట్‌గా నియమితులైన ఈయన.. డిప్యుటేషన్‌పై కొన్నేళ్లుగా సీఈఓ పేషీలో పనిచేస్తున్నారు. ఎన్నడూ మండలాల్లో పనిచేయలేదు. ఇటీవల సీఈఓ రామచంద్ర కార్యాలయంలోనే డిప్యుటేషన్‌పైనే పీఎఫ్ సెక్షన్‌కు బదిలీ చేశారు.
 
 
 డీఆర్‌డీఏ కార్యాలయంలో మేనేజర్‌గా నియమితులైన రాజ్‌గోపాల్ కూడా ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ చమన్‌కు సీసీగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శంకర్ , టైపిస్టు జాకీర్‌లు కొన్నేళ్లుగా డిప్యుటేషన్లపైనే పనిచేస్తున్నారు. తాజాగా పుట్లూరు సూపరింటెండెంట్ సుభాన్ డిప్యుటేషన్ నియామకంపై తర్జనభర్జన పడుతున్నారు. తొలుత జెడ్పీ కార్యాలయంలోనే పనిచేయాలని భావించినా.. అది జరగలేదు. శింగనమల ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో అక్కడకు వెళ్లేందుకు దాదాపు ఖరారయినా చివరి నిమిషంలో నాయకులు వ్యతిరేకించడంతో సాధ్యపడలేదు. ఇలా  జెడ్పీలో కొంతమంది ఉద్యోగులు చివరిదాకా ప్రాధాన్యత పోస్టుల్లోనే ఉండేందుకు మక్కువ చూపుతున్నారు.   
 
 
 పాలనాపరంగా ఇబ్బందులు వస్తాయనే..   
 జిల్లా పరిషత్‌లో డిప్యుటేషన్‌పై కొంతమంది అధికారులు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న మాట వాస్తవమే. పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని డిప్యుటేషన్లు నేను రాకమునుపే జరిగాయి. ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ దాస్ కోర్టు కేసులు, సూపరింటెండెంట్ శివకుమార్ శర్మ బీఆర్‌జీఎఫ్ విభాగాలను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటికీ వారే కరెక్ట్ అనే భావనతో అక్కడే ఉంచాం. మిగిలిన వారికి త్వరలోనే స్థాన చలనం కల్పిస్తాం.
 రామచంద్ర, సీఈఓ, జిల్లా పరిషత్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement