Energy consumption
-
ఇంధన డిమాండ్ తగ్గితే ఏటా 2 లక్షల కోట్ల డాలర్ల ఆదా
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఇంధన వినియోగ డిమాండ్ తీవ్రతను తగ్గించుకునేలా తగిన చర్యలు తీసుకోగలిగితే ప్రపంచ ఎకానమీకి ఏటా 2 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు ఆదా కాగలవని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో వెల్లడించింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు, గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొంది. జనవరి 15–19 మధ్య దావోస్‌లో వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీతో కలిసి తయారు చేసిన ఈ రిపోర్టు రూపకల్పనలో 120 మంది పైగా గ్లోబల్ సీఈవోలు సహాయ, సహకారాలు అందించారు. ప్రభుత్వాలు విధానపరంగా సరైన చర్యలు తీసుకుంటే వృద్ధి.. ఉత్పాదకతకు తో డ్పాటు లభించగలదని, కంపెనీలు నిధులను ఆదా చేసుకోగలవని, కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించగలవని నివేదిక పేర్కొంది. ఫ్యాక్టరీ లైన్లను డిజైన్ చేయడంలో కృత్రిమ మేథను ఉపయోగించుకోవడం, విద్యుత్ వినియోగంలో సమర్ధతను మెరుగుపర్చుకోవడం, రవాణా వ్యవస్థను విద్యుదీకరించ డం మొదలైన చర్యలను పరిశీలించవచ్చని సూచించింది. -
భారత్‌లో ఇంధనానికి భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో భారత్‌లో ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఏఈఏ) అంచనావేసింది. ‘‘భారత్ 2025 నాటికి అత్యధిక జనాభా దేశంగా ఉంటుంది. పట్టణీకరణకుతోడు, పారిశ్రామికీకరణ వల్ల ఏటా ఇంధన డిమాండ్ 3 శాతం చొప్పున పెరుగుతుంది’’అని తెలిపింది. పప్రంచ ఇంధన వినియోగంపై అంచనాలతో ఓ నివేదికను గురువారం విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, సమర్థవంతమైన విధానాల వల్ల 2030 నాటికి పెరగనున్న విద్యుత్ డిమాండ్‌లో 60 శాతాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాలే తీరుస్తాయని వివరించింది. అదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ మొత్తం ఇంధన డిమాండ్‌లో మూడింట ఒకటో వంతు ఉంటుందని అంచనా వేసింది. ఒకటో వంతు అవసరాలు చమురు ద్వారా తీరతాయని పేర్కొంది. శిలాజ ఇంధనాల దిగుమతుల బిల్లు వచ్చే రెండు దశాబ్దాల కాలంలో రెట్టింపు అవుతుందని అంచనా వ్యక్తీకరించింది. ఇది ఇంధన భద్రతకు రిస్క్‌గా అభివర్ణించింది. ప్రపంచం మొదటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మధ్యస్థ దశలో ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి దీనికి ప్రేరణనిచ్చిందని తెలిపింది. ‘‘రష్యా ప్రపంచంలో శిలాజ ఇంధనాల ఎగుమతుల్లో పెద్ద దేశంగా ఉంది. అయితే, యూరప్‌కు సహజ వాయువు సరఫరాను రష్యా తగ్గించేయడం, అదే సమయంలో రష్యా చమురు, బొగ్గు ఎగుమతులపై యూరప్ ఆంక్షలు విధించడం ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ప్రధాన అవరోధాలు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇంధనాల వారీగా డిమాండ్.. ► భారత్‌లో 2030 నాటికి బొగ్గు డిమాండ్ గరిష్ట స్థాయిలో రోజువారీగా 770 మిలియన్ టన్ను లకు చేరుతుంది. 2021 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యం 240 గిగావాట్లుగా ఉంటే, 2030 నాటికి 275 గిగావాట్లకు పెరుగుతుంది. ► చమురుకి డిమాండ్ 2021కి రోజువారీగా 4.7 మిలియన్ బ్యారెళ్లు ఉంటే, 2030 నాటికి 6.7 మిలియన్ బ్యారెళ్లకు పెరుగుతుంది. 2040 నాటికి 7.4 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుంది. ► 2030 నాటికి అదనంగా పెరిగే విద్యుత్ అవసరాల్లో 60 శాతాన్ని పునరుత్పాదక వనరులు తీరుస్తాయి. అప్పటికి మొత్తం విద్యుత్ అవసరాల్లో పునరుత్పాదక ఇంధనాల వాటా 35 శాతం మేర ఉంటుంది. ఇందులో సోలార్ పీవీ ప్లాంట్ల ద్వారానే 15 శాతం అవసరాలు తీరతాయి. ► సహజ వాయువు డిమాండ్ 2030 నాటికి 115 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుతుంది. 2021 నాటికి ఇది 66 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. మొత్తం మీద పెరిగే ఇంధన అవసరాల్లో గ్యాస్ వాటా 5 శాతంగానే ఉంటుంది. ► తక్కువ ఉద్గారాలు విడుదల చేసే ప్రత్యామ్నా య ఇంధన వనరుల్లో వేగవంతమైన పురోగతి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు.. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. -
ఏపీ లక్ష్యం 6.68 ఎంటీవోఈ చమురు ఆదా
సాక్షి, అమరావతి: కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ఇంధనశాఖ రాష్ట్రాలకు కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగా రాష్ట్ర ఇంధన శాఖకు 6.68 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీవోఈ) చమురును ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకి తగ్గించాలనే కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర విద్యుత్‌శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా రాష్ట్ర ఇంధన సామర్థ్య కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వ ఇంధన కార్యదర్శులతో వెబినార్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి 750 బిలియన్ యూనిట్లకు సమానమైన 887 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో రాష్ట్రాలన్నీ కలిసి 150 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనాన్ని ఆదాచేయాలని కేంద్ర ఇంధనశాఖ సూచించింది. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రి ప్రశంసలు రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలపై ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ వివరించారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)–2017 ద్వారా బిల్డింగ్ బైలాస్‌లో సవరణలు చేసి, తప్పనిసరిచేసిన కొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటని ఆయన తెలిపారు. ఎకో నివాస్ సంహిత (ఈఎన్ఎస్)–2018 ద్వారా ఏపీలో నిరుపేదలకు జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న 28.3 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీధి దీపాల జాతీయ కార్యక్రమం (ఎస్ఎల్ఎన్పీ) అమలులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 6.02 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 23.54 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ఇంధన పొదుపు లక్ష్యాలను చేరుకోవడానికి కీలక శాఖలతో సమన్వయం చేసుకుని ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో అమలు చేయాలని, ఈఎన్ఎస్ని రాష్ట్ర బిల్డింగ్ బైలాస్‌లో చేర్చాలన్నారు. జగనన్న కాలనీలు, ఇతర విభాగాల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున అమలు చేయడం ద్వారా ఏపీ గ్రీన్హౌస్ వాయు ఉద్గార తగ్గింపు చర్యలకు అత్యంత ఊతమిస్తోందని ప్రశంసించారు. అన్నిచోట్లా ఈవీ స్టేషన్లు ప్రధాన నగరాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని బీఈఈ అధికారులు సూచించారు. ఇంధన రిటైల్ అవుట్లెట్లు, మునిసిపల్ పార్కింగ్, మెట్రో పార్కింగ్, రైల్వే స్టేషన్లు, ఏయిర్‌పోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు వంటి ఇతర ప్రదేశాలలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వెబినార్‌లో కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆలోక్‌కుమార్, బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్, సెక్రటరీ ఆర్కే రాయ్, డైరెక్టర్ మిలింద్ డియోర్,తదితరులు పాల్గొన్నారు. -
ఏసీ 26 డిగ్రీల కన్నా తగ్గితే ఇల్లు గుల్లే
సాక్షి, అమరావతి: ఎండాకాలం.. 24 గంటలూ ఏసీ వేయడం మామూలే. దీనివల్ల కరెంట్ బిల్లు పెరగడమే కాదు.. ప్రజలకూ హాని కలుగుతోంది. 8నుంచి 10 గంటల పాటు ఏసీ వేస్తే ఏకంగా 10 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ విపత్కర పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏసీల వినియోగంపై రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ అవగాహన కార్యక్రమం చేపట్టింది. ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ వివరాలను ఆ సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ఏసీల వార్షిక విద్యుత్ డిమాండ్ 2,800 మిలియన్ యూనిట్లు. వీటిని 26 డిగ్రీల స్థాయిలో వాడుకుంటే ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా మేలని ఇంధనశాఖ చెబుతోంది. దీనివల్ల తక్కువ విద్యుత్తు వినియోగమవుతుంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఆరోగ్యంపైనా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటోంది. గదిలో ఏసీ ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీల వద్ద ఉంటే.. అవి సాధారణ శరీర ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువని, తద్వారా అల్పోష్ణస్థితి, ఆర్థరైటిస్, చర్మ అలర్జీలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తేందుకు అవకాశముందని పేర్కొంది. ఇలా చేస్తే మేలు ఏసీలు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నడుస్తున్నప్పుడు కంప్రెషర్ నిరంతరాయంగా పనిచేయాలని, అందుకు అధిక విద్యుత్ అవసరమవుతుందని.. ఫలితంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను ఎప్పుడూ 26, ఆ పైన ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం, ఫ్యాన్ స్పీడును తక్కువగా ఉంచడం ఉత్తమమని.. తద్వారా తక్కువ కరెంటు అవసరమవుతుందని పేర్కొంటున్నారు. 26 డిగ్రీల మీద నడపడం ద్వారా ఒక్కో ఏసీకి ఒక్క రాత్రికి కనీసం 5 యూనిట్లు ఆదా చేస్తే.. 10 లక్షల ఇళ్లల్లో రోజుకు 5 మిలియన్ యూనిట్లు పొదుపు చేయవచ్చని అంచనా. దీనివల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని ఇంధన పొదుపు సంస్థ తెలిపింది. స్టార్ రేటెడ్ బెస్ట్ 5 స్టార్ ఏసీ వినియోగం వల్ల రోజుకు 4.5 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. 1 స్టార్ స్లి్పట్ ఏసీ (1.5 టన్)తో ఏడాదికి రూ.665 ఆదా అయితే.. 5 స్టార్ ఏసీతో రూ.2,500 వరకు పొదుపు చేయవచ్చు. ఇళ్లల్లో స్టార్ రేటెడ్ విద్యుత్తు ఉపకరణాల వినియోగం, కరెంటు బిల్లులపై వాటి ప్రభావం అనే అంశంపై రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఏపీఎస్ఈసీఎం అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఏసీ ఉష్ణోగ్రతల సెట్టింగుల్లో 1 డిగ్రీ తగ్గితే, విద్యుత్తు వినియోగం 6% తగ్గుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్తుశాఖ సూచన మేరకు స్టార్ రేటెడ్ ఏసీలను కొనేలా, 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో నడిపేలా వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం మొత్తం ఏసీల స్థాపిత సామర్థ్యం 80 మిలియన్ టీఆర్ (టన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ (74,234 మెగావాట్లు)). పదేళ్లలోపే ఇది 250 మిలియన్ టీఆర్ (2,31,982 మెగావాట్లు)కు పెరుగుతుందని.. ఫలితంగా 2030 కల్లా దేశంలో ఏసీల వల్లే కనెక్టెడ్ లోడ్ 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. దీనివల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. -
‘విద్యుత్’ లేని చోట డీజిల్ జనరేటర్లే
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో అత్యధికంగా డీజిల్ జనరేటర్లపై ఆధారపడుతున్నట్లు నీతిఆయోగ్ సర్వే వెల్లడించింది. విద్యుత్ సదుపాయం లేని చోట ఎటువంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగిస్తున్నారనే అంశంపై ఈ సర్వే నిర్వహించారు. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొత్తం మీద అన్ని రకాల వినియోగదారులు 32 శాతం డీజిల్ జనరేటర్లపై ఆధారపడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై 20 శాతం, కిరోసిన్‌పై 16 శాతం, సోలార్ ప్యానల్స్‌పై పదిశాతం, స్థానిక మినీ గ్రిడ్స్‌పైన ఆరుశాతం ఆధారపడుతుండగా 19 శాతం తెలియదని చెప్పినట్లు సర్వే వెల్లడించింది. కిరోసిన్‌కు సబ్సిడీ ఉండటంతో విద్యుత్ సౌకర్యం లేని చోట కిరోసిన్ వినియోగిస్తున్నారని, డీజిల్ సులభంగా లభిస్తుండటంతో వ్యవసాయ రంగంలో దాన్ని వినియోగిస్తున్నారని తేలింది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను కల్పించాలని సర్వే సూచించింది. ఎక్కువగా కొండ ప్రాంతాలైన మేఘాలయ వంటి చోట అత్యధికంగా విద్యుత్ సౌకర్యం లేదని తేలింది. కొవ్వొత్తులు, రీచార్జి బ్యాటరీలను కూడా వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. విద్యుత్ లేని చోట దేశంలో రంగాల వారీగా గృహావసరాలు, వ్యవసాయం, వాణిజ్యం, ఇనిస్టిట్యూషన్లలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపైన కూడా నీతిఆయోగ్ సర్వేలో విశ్లేషించారు. -
‘రూ . 24,000 కోట్లు ఆదా చేశాం’
సాక్షి, న్యూఢిల్లీ : పునరుత్పాదక ఇంధనంతో భారత్ ఏడాదిలో రూ 24,000 కోట్లు ఆదా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత ఎనర్జీ ఫోరం వేదికను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఇంధన భద్రతతో స్వయం సమృద్ధి సాధించవచ్చని అన్నారు. కరోనా వైరస్‌తో ప్రపంచ ఎనర్జీ డిమాండ్ మూడోవంతు పడిపోయిందని, అయితే దీర్ఘకాలంలో భారత్‌లో ఇంధన వినియోగం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. మన ఇంధన రంగం వృద్ధి దిశగా సాగుతున్నదని పునరుత్పాదక ఇంధన వినియోగంలో చురుకైన దేశంగా భారత్ వ్యవహరిస్తోందని అన్నారు. భారత్ అతితక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగిన దేశమని చెప్పుకొచ్చారు. ఇంధన వనరుల పరిరక్షణలో భారత్ పలు చర్యలు చేపడుతోందని చెప్పారు. గత ఆరేళ్లుగా 1.1 కోట్ల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని దీంతో ఏడాదికి 6000 కోట్ల యూనిట్ల ఇంధన ఆదా జరిగిందని పేర్కొన్నారు. ఇంధన ఆదాతో ఏటా 24,000 కోట్ల రూపాయల మేర ఇంధన ఖర్చులను మనం ఆదా చేశామని చెప్పారు. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. చదవండి : నిరంతరం రైతన్నకు మేలు -
‘ఇంధనం అందరికీ అందాలి’
సాక్షి, న్యూఢిల్లీ : హేతుబద్ధమైన ధరల్లో ఇంధనం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. కృత్రిమంగా ధరలను పెంచడం స్వయం వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. చమురు దిగ్గజాలు ఒపెక్ అధిపతి, సౌదీ చమురు మంత్రి ఖలీద్ అల్ ఫలీ సమక్షంలో అంతర్జాతీయ ఇంధన వేదిక (ఐఈఎఫ్)ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. చమురు వినియోగ దేశాల్లో ఇంధన వినియోగం పెరిగితే చమురు ఉత్పాదకులకు మేలు చేకూరుతుందన్నారు. పేదలకు సైతం అందుబాటులో ఉండేలా ఇంధన వనరులు భారత్‌కు అవసరమని ఆకాంక్షించారు. అందుబాటు ధరలతో పాటు సురక్షిత, నిలకడతో కూడిన ఇంధన సరఫరాలు కీలకమన్నారు. భారత్ తక్కువ ద్రవ్బోల్బణంతో అధిక వృద్ధిని సాధిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధన వినియోగం నాన్ ఒపెక్ దేశాల్లో భారీగా ఉందని, రానున్న ఐదేళ్లలో భారత్ ఇంధన డిమాండ్‌కు కీలక మార్కెట్‌గా ఎదుగుతుందని అన్నారు. -
‘కరెంట్’కు మేఘం ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు దెబ్బకు రబీ పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో ఇప్పటికే భారీగా త గ్గిన విద్యుత్ డిమాండ్...నడివేసవిలో వారం నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో మరింత పతనమైంది. ఈ నెల 6న విద్యుత్ వినియోగం అత్యల్పంగా 97.93 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు పడిపోయింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు అత్యల్ప విద్యుత్ వినియోగం ఇదే. గత రెండేళ్ల వర్షాభావం.. వరుస కరువులతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలవడం తెలిసిందే. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రాష్ట్రంలోని 20 లక్షలకు పైచిలుకు ఉన్న బోరుబావుల కింద రబీ పంటల సాగు విస్తీర్ణం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో వ్యవసాయం లేక ప్రస్తుత వేసవిలో విద్యుత్ వినియోగం ఊహించని విధంగా పతనమైంది. సాధారణంగా మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయరంగ వాటా 25 శాతం ఉండాల్సి ఉండగా సాగు సంక్షోభంతో సగానికిపైగా తగ్గిపోయింది. ఈ వేసవిలో రోజువారీ విద్యుత్ వినియోగం 170-180 ఎంయూ ఉంటుందని విద్యుత్‌శాఖ అంచనా వేయగా అది 130-150 ఎంయూలకే పరిమితమైంది. సాగు ‘పవర్’ తగ్గింది.. శీర్షికతో గత సోమవారం ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో తీవ్ర చర్చ జరిగింది. అకాల వర్షాల వల్ల గత ఐదు రోజులుగా విద్యుత్ డిమాండ్ మరింతగా దిగజారడంతో విద్యుత్ సంస్థలు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. గత ఐదు రోజులుగా విద్యుత్ వినియోగం 97-115 ఎంయూల మధ్యే ఉంటుండటంతో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో థర్మల్ ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేసి ఉత్పత్తిని మరింత తగ్గిస్తోంది. ఈ నెల 6న తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం వల్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడంతో హైదరాబాద్పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ రోజు తెలంగాణ చరిత్రలోనే అత్యల్పంగా 97.9 ఎంయూల విద్యుత్ వినియోగం జరిగింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా మర్నాడు 114.31 ఎంయూల వినియోగం మాత్రమే జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గినా గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి స్వల్పంగా డిమాండ్ పెరగడంతో ఇంతకాలం ఈ సంక్షోభం బయటకు కనిపించలేదు. వర్షాలతో వ్యవసాయేతర రంగాల డిమాండ్ సైతం తగ్గడంతో విద్యుత్ డిమాండ్ తగ్గుదల బయటపడింది. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఏ స్థాయిలో ముదిరిపోయిందో రోజురోజుకు పతనమవుతున్న విద్యుత్ డిమాండ్ అద్దంపడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 4న నమోదైన 154 ఎంయూలే ఈ వేసవిలో ఇప్పటి వరకు జరిగిన గరిష్ట విద్యుత్ వినియోగం. -
పవర్.. ఓవర్
నగరంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో రోజుకు 4.4 మిలియన్ యూనిట్లుగా నమోదు సీఎం క్యాంపు ఆఫీసులో నెలకు 10 వేల యూనిట్ల పైనే వాడకం. విజయవాడ : నగరంలో విద్యుత్ వాడకం రోజురోజుకూ రెట్టింపవుతోంది. విజయవాడ రాజధాని హోదా రావడంతో విద్యుత్‌కు డిమాండ్ బాగా పెరిగింది. నాలుగు నెలల క్రితం వరకు నగరంలో రోజుకు సగటున రెండు మిలియన్ యూనిట్ల వాడకం ఉండేది. ఇప్పుడది రెట్టింపు స్థాయి కూడా దాటింది. మండువేసవిలో మాత్రమే నెలకు నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినయోగం రోజూ ఉండేది. నెల రోజులుగా నగరంలో రోజుకు సగటున 4.4 మిలియన్ యూనిట్ల వాడకం జరుగుతోంది. ఎన్టీపీసీ నుంచి నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ కోత సమస్య ఉత్పన్నం కావడం లేదు. మరో ఆరు నెలల్లోనే విద్యుత్ వాడకం రోజుకి 5 మిలియన్ యూనిట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ఎక్కువ సబ్స్టేషన్ల నిర్మాణంపై దృష్టి సారించారు. అమాత్యులు, అధికారులు ఇక్కడే.. ముఖ్యమంత్రి మొదలుకొని వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు నెలలో ఎక్కువ రోజులు నగరంలోనే ఉంటున్నారు. ఇప్పటికే సూర్యారావుపేటలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటై కార్యకలాపాలు మొదలయ్యాయి. డీజీపీ క్యాంప్ ఆఫీసు కూడా ఇటీవలే ప్రారంభమైంది. మరో 20 రోజుల వ్యవధిలో సీఎస్ క్యాంపు కార్యాలయం, మరో నాలుగు వరకు ప్రధాన శాఖల కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. అన్నిచోట్లా విద్యుత్ వినియోగం తప్పనిసరి. గత నెలలో సీఎం క్యాంపు కార్యాలయంలో 10,200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. విద్యుత్ శాఖ సుమారు రూ. 46 లక్షలతో అన్ని పనులు నిర్వహించింది. కీలక శాఖలు వస్తే నెలకు అదనంగా 50 వేల నుంచి 70 వేల యూనిట్ల వాడకం పెరుగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే సులువుగా ఐదు మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుంది. ఈ ఏడాది మే 26న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 4.434 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగింది. నగరంలో ఇప్పుడది సర్వసాధారణమైంది. నగరంలో సుమారు 2.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో విజయవాడ టౌన్ డివిజన్ పరిధిలో 3, గుణదల సబ్‌డివిజన్ కింద మూడు సబ్స్టేషన్ల పరిధిలో ఓవర్‌లోడ్ ఇబ్బందులు కొంత కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో మరో ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణంతో ఓవర్‌లోడ్ సమస్యను కొంత నివారించటానికి కసరత్తు సాగిస్తున్నారు. మల్టీ స్టోరేజ్ భవనాల నిర్మాణం బాగా పెరగటం, మల్టీప్లెక్స్‌లు, మాల్స్ ఎక్కువగా రావడం, మూడు లక్షలకు పైగా ఏసీల వినియోగం ఉండటం కూడావిద్యుత్ అధిక వాడకానికి కారణాలుగా ఉన్నాయి. వచ్చే మార్చి నాటికి నగరంలో ఐదు మిలియన్ యూనిట్ల వాడకం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.