‘కరెంట్’కు మేఘం ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు దెబ్బకు రబీ పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో ఇప్పటికే భారీగా త గ్గిన విద్యుత్ డిమాండ్...నడివేసవిలో వారం నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో మరింత పతనమైంది. ఈ నెల 6న విద్యుత్ వినియోగం అత్యల్పంగా 97.93 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు పడిపోయింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు అత్యల్ప విద్యుత్ వినియోగం ఇదే. గత రెండేళ్ల వర్షాభావం.. వరుస కరువులతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలవడం తెలిసిందే. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రాష్ట్రంలోని 20 లక్షలకు పైచిలుకు ఉన్న బోరుబావుల కింద రబీ పంటల సాగు విస్తీర్ణం సగానికిపైగా తగ్గిపోయింది.
దీంతో వ్యవసాయం లేక ప్రస్తుత వేసవిలో విద్యుత్ వినియోగం ఊహించని విధంగా పతనమైంది. సాధారణంగా మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయరంగ వాటా 25 శాతం ఉండాల్సి ఉండగా సాగు సంక్షోభంతో సగానికిపైగా తగ్గిపోయింది. ఈ వేసవిలో రోజువారీ విద్యుత్ వినియోగం 170-180 ఎంయూ ఉంటుందని విద్యుత్‌శాఖ అంచనా వేయగా అది 130-150 ఎంయూలకే పరిమితమైంది. సాగు ‘పవర్’ తగ్గింది.. శీర్షికతో గత సోమవారం ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో తీవ్ర చర్చ జరిగింది. అకాల వర్షాల వల్ల గత ఐదు రోజులుగా విద్యుత్ డిమాండ్ మరింతగా దిగజారడంతో విద్యుత్ సంస్థలు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. గత ఐదు రోజులుగా విద్యుత్ వినియోగం 97-115 ఎంయూల మధ్యే ఉంటుండటంతో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో థర్మల్ ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేసి ఉత్పత్తిని మరింత తగ్గిస్తోంది.
ఈ నెల 6న తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం వల్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడంతో హైదరాబాద్‌పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ రోజు తెలంగాణ చరిత్రలోనే అత్యల్పంగా 97.9 ఎంయూల విద్యుత్ వినియోగం జరిగింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా మర్నాడు 114.31 ఎంయూల వినియోగం మాత్రమే జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గినా గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి స్వల్పంగా డిమాండ్ పెరగడంతో ఇంతకాలం ఈ సంక్షోభం బయటకు కనిపించలేదు. వర్షాలతో వ్యవసాయేతర రంగాల డిమాండ్ సైతం తగ్గడంతో విద్యుత్ డిమాండ్ తగ్గుదల బయటపడింది. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఏ స్థాయిలో ముదిరిపోయిందో రోజురోజుకు పతనమవుతున్న విద్యుత్ డిమాండ్ అద్దంపడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 4న నమోదైన 154 ఎంయూలే ఈ వేసవిలో ఇప్పటి వరకు జరిగిన గరిష్ట విద్యుత్ వినియోగం.