కరువు | drought in district | Sakshi
Sakshi News home page

కరువు

Published Sat, Nov 1 2014 4:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కరువు - Sakshi

కరువు

సాక్షి, మంచిర్యాల : జిల్లాను కరువు దుర్భిక్షం అలుముకుంది. నాలుగు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగు సంక్షోభంలో పడింది. కరుణించని వరుణుడు.. కనికరించని కరెంటు అన్న చందంగా ఈ ఖరీఫ్ కూడా రైతులకు నష్టాలనే మిగిల్చింది. తానూరులో అతి తక్కువగా -68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దీంతోపాటు 46 మండలాల్లో లోటు వర్షం కురిసింది. లోటు వర్షపాతంతో ఇప్పటికేపంట దిగుబడులు భారీగా తగ్గాయి. వరి పంట ఎక్కువగా దెబ్బతింది. మొక్కజొన్న, కందుల దిగుబడి తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి.

వర్షాభావం దృష్ట్యా మరో పది రోజుల్లో మిగిలిన పంటలూ ఎండిపోయే ప్రమాదముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నమోదైన వర్షపాతం.. భూగర్భ జలమట్టం.. సాగు విస్తీర్ణం.. పంట నష్టం.. సాగునీరు.. విద్యుత్తు కోతలకు సంబంధించిన నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మరోపక్క.. ఈ నెల నుంచి ప్రారంభంకానున్న రబీ సీజన్ ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు పంటలు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో పంట దిగుబడి మరింత తగ్గే ప్రమాదముంది.
 
వర్షపాతం ఇలా..
జూన్ నుంచి గురువారం వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే జిల్లాలో 33 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం 52 మండలాల్లో ఇచ్చోడ, బజార్‌హత్నూర్, బెజ్జంకి, నెన్నెల, వేమనపల్లి మినహా అన్ని మండలాలను వర్షాభావం వెంటాడింది. ఈ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 46 మండలాల్లో 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. తానూరు మండలంలో అతి తక్కువగా వర్షపాతం నమోదైంది. కుభీర్, ఇంద్రవెల్లిలో సాధారణం కంటే 50 శాతం లోటు వర్షపాతం ఉంది.
 
పడిపోయిన భూగర్భ జలాలు..!
క్రమంగా పడిపోతున్న భూగర్భ జల మట్టాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 11 మండలాల్లో భూగర్భ జలం పది మీటర్ల లోతుకు చేరుకున్నట్లు భూగర్భ జల అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్ డివిజన్‌లోని పలు మండలాల్లో భూగర్భ జలం ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. తాజా దుస్థితిని విశ్లేషిస్తూ భూగర్భ జల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ కోటా లేకపోవటంతో వ్యవసాయానికి ఇచ్చే ఐదు గంటల్లోనూ కోత పెడుతున్నారు. మరోవైపు జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిపోవటంతోపాటు పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు కాపాడుకోవటానికి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సలహాలు సూచనలు అందించినా పంటలు మాత్రం ఎండు ముఖమే పట్టాయి.
 
కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని నివేదించాం..
 - రోజ్‌లీలా, వ్యవసాయ శాఖ, జాయింట్ డెరైక్టర్
 జిల్లా అంతటా కరువు ఉంది. ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. వారం రోజుల్లో మరిన్ని పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కరువు పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement