చింత తీర్చని చినుకు
► కరుణిస్తున్న వరుణుడు
► సాధారణ వర్షపాతానికి చేరువుగా గణాంకాలు
► వరుస కరువుతో చల్లారని భూతాపం
► ఇంకిపోతున్న జలాలు
► సాగుపై రైతన్న ఊగిసలాట
కొద్దిరోజులుగా అడపాదడపా వరుణుడు కరుణిస్తున్నాడు. గతేడాది ఇదే సీజనుతో పోల్చితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు రైతులకు ఆశాజనకమే. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వరుస కరువుతో నెర్రెలిచ్చిన నేలకు ఈ తడి సరిపోవడం లేదు. భూగర్భ జలాలు అందనంత లోతుకు పోయాయి. అందుకే నీరందడం లేదు. సాగు చేద్దామంటే రైతుకు ధైర్యం చాలడం లేదు. మరికొంత వర్షం పడితే తప్ప పరిస్థితిలో మార్పు రాదు.
చిత్తూరు, సాక్షి: వరుసగా రెండేళ్ల కరువుతో భూగర్భజలాలు అథఃపాతాళానికి పడిపోయాయి. సాగునీరే కాదు తాగునీటికి కూడా ఇబ్బంది పడ్డారు ప్రజలు. వర్షాకాలం వచ్చి రెండు నెలలకు పైగా అవుతోంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. కానీ భూతాపం ఇంకా చల్లారలేదు. పడిన నీరు పడినట్లే ఇంకిపోతోంది. ఫలితంగా చెరువులు, కుంటలు నిండటం లేదు. బోర్లలో నీటి మట్టాలు పెరగడం లేదు. జిల్లాలోని చిన్నాచితక రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. జిల్లాలోని తూర్పు మండలాల్లో అధికంగా సాగయ్యే వరిఈసారి సగం కూడా సాగవలేదు. కాకుంటే కొన్ని మండలాల్లో తాగునీటి కష్టాలు మాత్రతీరే అవకాశం ఉంది. మరో రెండు నెలలు వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇప్పుడు వేసిన పంట, రబీపై ఆశలు పెట్టుకోవచ్చు.
25.36 మీటర్ల లోతులో నీటి మట్టాలు..
జూన్ మొదటి నుంచి ఇప్పటి వరకు సగం వర్షాకాలం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఆగస్టు మొదటి వారం వరకు సాధారణ వర్షపాతం 117.4 మిల్లీమీ టర్లు కాగా 100.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురి సింది. 32 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గుడిపల్లి, చిత్తూరు, కార్వేటినగరం, పెనుమూరు, కేవీబీ పురం, పెదమండ్యం, ములకలచెరువు, తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో సాధారణం కన్నా 20 శాతం అధికంగా వర్షం కురిసింది. జీడీ నెల్లూరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే 67 శాతం తక్కువ కురిసింది. గణాం కాలు చూస్తే సీజన్ అనుకూలంగానే ఉన్నాయి.
కానీ భూగర్భజల వనరుల శాఖ జులై నెలాఖరుకు ఇచ్చిన తాజా నివేదిక పరిశీలిస్తే జిల్లాలో దుర్భర పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. జూన్ కంటే ముందు 25.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలం ఇప్పుడు 24.29 మీటర్లలో ఉంది. ఇది 60 శాతానికి తగ్గితే కానీ కష్టాలు తీరవు. గుడిపాల, నిమ్మనపల్లి, పాలసముద్రం, సోమల మండలాల్లో మంచి వర్షం కురిసింది. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో భూగర్భజలాలు ఇంకా సరాసరి 50 మీటర్ల లోతులోనే ఉన్నాయి. గుడిపాల, నిమ్మనపల్లి, పాలసముద్రం మండలాల్లో 27 మీటర్ల నుంచి 22 మీటర్ల వరకు వచ్చింది. అయితే తాగునీటి సమస్య మాత్రం కొంతమేర తగ్గింది.
సంక్షోభంలో వరిసాగు..
జిల్లాలోని తూర్పు మండలాల్లో వరి గణనీ యంగా సాగవుతుంది. జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 17 వేల హెక్టార్లు. ఈ సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు కేవలం ఆరు వేల హెక్టార్లలో మాత్రమే సాగయింది. తాజా వర్షాల వల్ల కొన్ని చోట్ల కుంటల్లో నీరు చేరింది. బోర్లు రీచార్జయ్యాయి. ఈ సీజన్‌కు వరకు కొంతమేర పంట సాగు చేసుకునేందుకు ఏ ఇబ్బందీ లేదు. అయినా రైతుల ముఖంలో మాత్రం ఆనందం కనిపించడం లేదు. జిల్లాలో పంటలు సాగయ్యే సాధారణ విస్తీర్ణం 2.11 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు 1.50 లక్షల హెక్టార్ల మేరకు సాగయింది. 1.04 లక్షల హెక్టార్లు ఆరుతడి పంటలైన వేరుశనగ, ఇతరాలు సాగయ్యాయి. పంటల సాగు సగానికి తగ్గడానికి కారణం ప్రధానంగా భూగర్భజలాలు పాతాళానికి చేరుకోవడమే.