జామాయిల్‌ జల దోపిడీ! | Jamoil water exploitation! | Sakshi
Sakshi News home page

జామాయిల్‌ జల దోపిడీ!

Published Mon, Jun 12 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

జామాయిల్‌ జల దోపిడీ!

జామాయిల్‌ జల దోపిడీ!

- కర్ణాటకలో జామాయిల్‌ తోటల సాగుపై నిషేధం
భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరడానికి ఈ తోటలే మూలమని గుర్తింపు
జామాయిల్‌ మొక్కల పెంపకాన్ని ఆరేళ్ల క్రితమే నిలిపివేసిన కర్ణాటక అటవీ శాఖ 
 
వర్షాలు బాగా కురవాలన్నా, కరువు తీరాలన్నా చెట్లను ఎక్కువగా పెంచాలన్నది మనకున్న జ్ఞానం. అయితే, కురిసిన వర్షం కన్నా ఎక్కువ నీటిని భూమిలో నుంచి పీల్చేసే చెట్లున్నాయి. ఇటువంటి జాతుల చెట్లతో లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుంది. పర్యావరణానికి జరిగే నష్టం ఒకటి, రెండేళ్లలో ప్రస్ఫుటంగా బయటపడదు. ఒకటి, రెండు దశాబ్దాలు గడిస్తే గానీ దానివల్ల జరుగుతున్న తీరని నష్టమేమిటో బోధపడదు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు కదా.. జామాయిల్‌(యూకలిస్టస్‌ లేదా నీలగిరి) చెట్ల సాగును నాలుగు దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే కనువిప్పు కలిగింది. కనీసం మూడు జిల్లాల్లో భూగర్భ జలాలు అతిగా అడుగంటడానికి ఈ కలప పంటే కారణమని నిర్థారణకు వచ్చింది. దేశంలో జామాయిల్‌ సాగుకు శ్రీకారం చుట్టిన రాష్ట్రమే మూడు నెలల క్రితం తొలిగా నిషేధం విధించింది! 
 
తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, అటవీ, బంజరు భూముల్లో సామాజిక వనాలుగా.. 
రైతుల మెట్ట పొలాల్లోనూ యూకలిప్టస్‌ 
విస్తారంగా సాగులో ఉంది. 
మరి మనకెప్పుడు కనువిప్పు కలుగుతుంది..? 
పొరుగు రాష్ట్రానికి ఎదురైన చేదు అనుభవం నుంచి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా..?? 
 
జామాయిల్‌ సాగు.. కొన్ని వాస్తవాలు..
వంట చెరకు, కలప అవసరాల కోసం జామాయిల్‌ సాగును ప్రపంచబ్యాంకు సహాయంతో సామాజిక వనాల సాగు ప్రాజెక్టులో భాగంగా 1980వ దశకంలో ప్రారంభించారు. 
750 ఎం.ఎం. కన్నా ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో జామాయిల్‌ తోటలు శిలీంద్రపు తెగుళ్ల బారిన పడుతున్నందున.. ఆయా ప్రాంతాల్లో ఈ తోటల సాగును 1984లో కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. 
జామాయిల్‌ మొక్కకు రోజుకు 50 నుంచి 90 లీటర్ల వరకు నీరు అవసరం. 20–30 అడుగుల లోపలి వరకు వేళ్లను చొప్పించి నీటిని, పోషకాలను గ్రహించగల లక్షణం దీనికి ఉంది. 
బెంగళూరు రూరల్‌ ప్రాంతాల్లో మూడేళ్ల గణాంకాలు పరిశీలించగా.. కురిసిన వర్షం కన్నా ఎక్కువగా నీటిని జామాయిల్‌ చెట్లు పీల్చుకుంటున్నాయని తేలింది. 
గ్రామీణాభివృద్ధి పథకాలలో భాగంగా నాటే మొక్కల జాబితా నుంచి యూకలిప్టస్‌ను 1990 దశకం చివర్లోనే కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది.
కర్ణాటక అటవీ శాఖ నర్సరీలలో జామాయిల్‌ మొక్కల పెంపకాన్ని, ప్రభుత్వ స్థలాల్లో నాటడాన్ని 2011లో ప్రభుత్వం నిషేధించింది. 
► కోలారు తదితర జిల్లాల్లో ప్రజాఉద్యమాల నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోరిక మేరకు 2017 ఫిబ్రవరి 25 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో జామాయిల్‌ సాగును కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. 
 
నిటారుగా, ఠీవీగా కనిపించే చెట్టు యూకలిప్టస్‌!  దీన్నే మనం జామాయిల్‌ అని, నీలగిరి అని పిలుచుకుంటున్నాం. ఆస్ట్రేలియా దీని జన్మస్థలం. కాలక్రమంలో దక్షిణ ఐరోపా, ఆఫ్రికా దేశాలతోపాటు భారత్‌కు చేరింది. కరువు కాలంలోనూ జామాయిల్‌ కలప ఏపుగా పెరుగుతుందని.. తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతోనే సాగు చెయ్యవచ్చని.. మూడేళ్లకోసారైనా సరే మంచి నికరాదాయాన్నిస్తుందని ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంత రైతులు తమ పొలాల్లో జామాయిల్‌ను విస్తారంగా సాగు చేస్తున్నారు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక అనేక ఏళ్ల తర్జన భర్జనలు, ప్రజాందోళనల అనంతరం జామాయిల్‌ తోటల సాగును నిషేధించింది. కర్ణాటక రాష్ట్ర అటవీ, పర్యావరణ, వాతావరణ శాఖ జామాయిల్‌ సాగును నిషేధిస్తూ 2017 ఫిబ్రవరి 25న ఉత్తర్వు జారీ చేసింది. అప్పటికే ఉన్న తోటలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. 
 
జామాయిల్‌ వల్ల కర్ణాటకలో జరిగిందేమిటి?
అది 1980వ దశకం. పట్టణీకరణ జోరందుకుంటున్న నేపథ్యంలో వంట చెరకు, కలప కొరత తీర్చడానికని ప్రపంచ బ్యాంకు ఆర్థిక తోడ్పాటుతో కర్ణాటకలో జామాయిల్‌ చెట్ల సాగు తొలుత ప్రభుత్వ, అటవీ భూముల్లో సామాజిక వనాల పెంపకంగా ప్రారంభమైంది. తదనంతరం రైతుల పొలాలకు విస్తరించింది. ఫలితంగా కోలారు, చిక్కబళ్లాపూర్, బెంగళూరు రూరల్‌ జిల్లాల్లో భూములు ఇవ్వాళ భూగర్భ జలాలు ఘోరంగా అడుగంటి, నిస్సారమై పనికిరాకుండా పోయాయని వార్తలొచ్చాయి. 
 
20–30 అడుగుల లోతులకు వేళ్లు చొప్పించి మరీ భూగర్భ జలాన్ని అదేపనిగా జుర్రేసుకునే శక్తి జామాయిల్‌ చెట్టుకు ఉంది. అంతెందుకు.. రోజుకు 50 నుంచి 90 లీటర్ల నీటిని తాగితే తప్ప జామాయిల్‌ చెట్టు దాహం తీరదని ఆ మధ్య నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పేర్కొన్నట్లు సమాచారం. భూగర్భ జలవనరులను జామాయిల్‌ చెట్లు కొల్లగొడుతున్న సంగతిని 2011 నాటికే ప్రభుత్వం చూచాయగా గుర్తించింది. అయితే, ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఆధారసహితంగా తెలియజెప్పే అధ్యయన పత్రాలు అప్పటికి అందుబాటులో లేవు. అయితే, గత ఏడాది నాటికి అనేక పరిశోధనా పత్రాలు, అధ్యయనాలు, నివేదికల ద్వారా జామాయిల్‌ సాగు వల్ల జలవనరులకు, పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతున్నదీ ప్రభుత్వానికి అవగతమైంది. 2017 జనవరిలో అటవీ, పర్యావరణ, వాతావరణ మంత్రి సార«థ్యంలోని నిపుణుల కమిటీ విచారణ చేపట్టింది. ముఖ్యంగా మూడు జిల్లాల్లో అసాధారణ నీటి కష్టనష్టాలకు జామాయిల్‌ తోటలు ఒకానొక ముఖ్యకారణమని తెలుసుకొని కమిటీ అవాక్కయింది. 
 
నిజానికి 1990వ దశకంలోనే కర్ణాటక అటవీ శాఖ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (యూకే), మైసూర్‌ పేపర్‌ మిల్లు సంయుక్తంగా ఈ సమస్యపై తొలిగా అధ్యయనం చేశాయి. ఏటా 800 ఎం.ఎం. వర్షపాతం నమోదయ్యే శివమొగ్గ, బెంగళూరు రూరల్‌ (హాస్‌కోట్‌) వంటి ప్రాంతాల్లో సాధారణ పంటలకన్నా రెట్టింపు నీటిని జామాయిల్‌ తోటలు పీల్చేస్తున్నాయని గుర్తించారు. మూడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే.. కురిసిన వర్షం కన్నా ఎక్కువ నీటిని భూగర్భం నుంచి ఈ తోటలు లాగేస్తున్నట్లు బయటపడిందని అటవీ మంత్రి ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 
 
కోలారు జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి అథఃపాతాళంలోకి జారిపోవడంతో చాలా మంది రైతులు వ్యవసాయానికి స్వస్తి చెప్పారు. ముకుంద్‌ జోషి, కె. పళనిస్వామి నిర్వహించిన మరో అధ్యయనం ప్రకారం.. 100 నుంచి 200 మీటర్ల లోపు ఉండే భూగర్భ జలాలు.. జామాయిల్‌ తోటల సాగు ప్రారంభించిన 20 ఏళ్లలో తామర తంపరగా తవ్విన బోర్ల వల్ల 260 మీటర్లకు దిగజారాయి. 
 
2014లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పంజాబ్‌లో భూగర్భ జలాలకు సంబంధించిన కేసులో పర్యావరణ సంక్షోభానికి అద్దంపడుతున్న ఈ గణాంకాలను ప్రస్తావించింది. జామాయిల్‌ తోటల చుట్టూ కిలోమీటరు పరిధి వరకు కొత్తగా తవ్విన బోర్లలో నీటి లభ్యత 3–5 ఏళ్లలో 35 నుంచి 42 శాతం వరకు తగ్గిందని ట్రిబ్యునల్‌ను ఉటంకిస్తూ కర్ణాటక అధికారులు తెలిపారు.  కర్ణాటక అటవీశాఖ అధికారులు, రైతులు దశల వారీగా జామాయిల్‌ తోటలను తొలగించి టేకు, చందనం, మలబారువేప తదితర మొక్కలు నాటుతున్నారు.
 
భూతాపం పెరగడం, వాతావరణ మార్పుల వల్ల నెలకొన్న పర్యావరణ సంక్షోభం వ్యవసాయాన్ని మరింత కష్టతరంగా మార్చుతున్నది. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరమైన నష్టం చేకూర్చని, తక్కువ నీటితో సాగయ్యే పంటలు, తోటలపైనే దృష్టి సారించడం అన్ని విధాలా మేలు. ఇదే దీర్ఘకాలంలో శ్రేయస్కరమన్నదే కర్ణాటక చేదు అనుభవం నేర్పుతున్న గుణపాఠంగా పాలకులు, రైతులు.. అందరం గుర్తించాల్సిన తరుణం ఇది. 
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
ఇన్‌పుట్స్‌: సజ్జేంద్ర కిశోర్, సాక్షి, బెంగళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement