ఎండుతున్న ఆశలు
♦ జాడలేని వర్షం చినుకు ఆందోళనలో రైతన్న
♦ విత్తన స్థాయిలోనే నష్టం!98 వేల హెక్టార్లలో పంటలు
♦ వానలు కురవకపోతే ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం
సాక్షి, సంగారెడ్డి: వరుస కరువుతో అల్లాడిన మెతుకుసీమ రైతాంగం.. ఖరీఫ్‌పై గంపెడాశలు పెట్టుకుంది. మృగశిర ప్రవేశానికి ముందు మురిపించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. జిల్లాలో-13 శాతం మేర వర్షాభావం ఉంది. కొందరు ఇది వరకే విత్తనాలు వేసుకోగా, మరికొందరు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. వర్షాభావం కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు 98 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. వీటిలో పప్పుధాన్యాలు ఎక్కువగా ఉన్నాయి. పత్తి రైతులు సైతం ఆరంభంలో కురిసిన వర్షాలకు విత్తనాలు విత్తుకున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవటంతో దిగాలు చెందుతున్నారు. పెసర, మినుము, కంది, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు మండుతున్న ఎండలకు మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడా బిందెలతో నీటిని తెచ్చి చల్లుతున్నారు. నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అందరి చూపూ ఆకాశం వైపే..
రైతులంతా వర్షాలు కురవాలని ఆశగా ఆకాశంవైపు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైతులు అక్కడక్కడా విత్తనాలు, ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్‌కు మొత్తం 1.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా 50,072 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. వీటిలో ఇప్పటి వరకు 35,811 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. 35వేల క్వింటాళ్ల వరి విత్తనాలకుగాను ఇప్పటి వరకు 9,176 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశారు. 29 వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు డిమాండ్ ఉండగా 4,877 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. సోయాబీన్ 53వేల క్వింటాళ్ల అవసరం కాగా ఇప్పటి వరకు 15219 క్వింటాళ్ల మేర విత్తనాలను అందజేశారు.
సాగుపై ప్రభావం
ఖరీఫ్‌లో ఆరంభం నుంచే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావించినప్పటికీ వరుణుడు కరుణించలేదు. వర్షాభావం కారణంగా ఖరీఫ్ సాగుపై ప్రభావం పడింది. జిల్లాలో జూన్ మాసంలో 125.6 మి.మీ సాధారణ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 61.3 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. -13.9 శాతం మేర వర్షాభావం ఉంది. దీంతో ఖరీఫ్ సాగు ఆశించిన స్థాయిలో సాగటంలేదు. ఖరీఫ్‌లో 3.30 లక్షల హెక్టార్ట సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు రైతులు కేవలం 98,628 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు విత్తుకున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. రైతులు వర్షాలు లేని కారణంగా వేరు శనగ, సన్‌ఫ్లవర్, నువ్వులు, ఆముదం, మిర్చీ, ఉల్లిగడ్డ పంటలను ఇంకా సాగు చేయలేదు.