
సాక్షి, న్యూఢిల్లీ : హేతుబద్ధమైన ధరల్లో ఇంధనం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. కృత్రిమంగా ధరలను పెంచడం స్వయం వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. చమురు దిగ్గజాలు ఒపెక్ అధిపతి, సౌదీ చమురు మంత్రి ఖలీద్ అల్ ఫలీ సమక్షంలో అంతర్జాతీయ ఇంధన వేదిక (ఐఈఎఫ్)ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
చమురు వినియోగ దేశాల్లో ఇంధన వినియోగం పెరిగితే చమురు ఉత్పాదకులకు మేలు చేకూరుతుందన్నారు. పేదలకు సైతం అందుబాటులో ఉండేలా ఇంధన వనరులు భారత్‌కు అవసరమని ఆకాంక్షించారు. అందుబాటు ధరలతో పాటు సురక్షిత, నిలకడతో కూడిన ఇంధన సరఫరాలు కీలకమన్నారు. భారత్ తక్కువ ద్రవ్బోల్బణంతో అధిక వృద్ధిని సాధిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధన వినియోగం నాన్ ఒపెక్ దేశాల్లో భారీగా ఉందని, రానున్న ఐదేళ్లలో భారత్ ఇంధన డిమాండ్‌కు కీలక మార్కెట్‌గా ఎదుగుతుందని అన్నారు.