ప్రశాంతంగా ఎంసెట్
జేఎన్టీయూ, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ గురువారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రాల పరిసరాల వద్ద జిరాక్స్ కేంద్రాలను కలెక్టర్ ఆదేశాల మేరకు మూసివేశారు. ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 94.12 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 92.89 శాతం మంది హాజరయ్యారు.
అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షిరిడీసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎస్ఎస్బీఎన్ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాల, ఇంటెలెక్చువల్ ఇంజినీరింగ్ కళాశాల, అనంతలక్ష్మి, పాలిటెక్నిక్ కళాశాల, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో, రైపర్ , ఇంటెల్ కళాశాల, ఎస్ఆర్ఐటీ, పీవీకేకే , ఎస్వీఐటీ కళాశాల, సీఆర్ఐటీ కళాశాలల్లో మొత్తం 8187 మంది హాజరుకావాల్సి ఉండగా 7706 మంది హాజరైనట్లు జేఎన్టీయూ రీజినల్ కో-ఆర్డినేటర్ ఆచార్య కేఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. 482 మంది గైర్హాజరయ్యారన్నారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించిన మెడిసిన్ ప్రవేశ పరీక్షకు అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో 544, రైపర్ కళాశాలలో 455, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 457, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో 920తో కలిపి మొత్తం 2558 మందికిగాను 2,376 మంది అభ్యర్థులు హాజరయినట్లు ఆయన తెలిపారు.
182 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్షకు ఆలస్యంగా ఎవరూ హాజరు కాలేదన్నారు. మాస్‌కాపీయింగ్, నకిలీ అభ్యర్థులు హాజరుకాకుండా గట్టి నిఘాను ఏర్పాటు చేశామన్నారు. కళ్లజోడు, డిజిటల్ వాచీలను అనుమతించలేదన్నారు.