సమస్యల ‘సర్కిల్’
ఇందూరు: అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా బీసీ స్టడీ సర్కిల్ లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన స్టడీ సర్కిల్‌ను నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అది కూడా అడవి, గుట్ట ప్రాంతం మధ్యలో ఉంది. ఇక్కడ పాములు, విష పురుగుల భయంతోపాటు, సాయంత్రమైతే మందుబాబుల బెడద తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇంత దూరం వరకు వచ్చి శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. వారికి ప్రతిరోజు దారి ఖర్చులే రూ.50 వరకు అవుతాయి. వసతులు సరిగా లేని అద్దె భవనంలో శిక్షణ పొందటం, చుట్టూ భయానక వాతావరణం ఉండడంతో అభ్యర్థులు జంకుతున్నారు.
ఉచిత శిక్షణ కోసం
బీసీ విద్యార్థులు, అభ్యర్థులు గ్రూప్స్, పోలీసు, ఆర్మీ, ఫారెస్ట్, ఎక్సైజ్, డీఎస్సీ, వీఆర్ఓ, వీఆర్ఏ, బ్యాంకు, తదితర పోటీ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం 2010లో బీసీ స్టడీ సర్కిల్‌ను మంజూరు చేసింది. ఆ సమయంలో జిల్లా కేంద్రంలోనే అద్దె భవనంలో దీనిని ఏర్పాటు చేయగా, తర్వాత నాగారం రాజారాం స్టేడియం వెనుక ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి అభ్యర్థులు స్టడీ సర్కిల్‌కు రావడానికి వెనకడుగు వేస్తున్నారు. వ్యయప్రయాసలకోర్చి నిత్యం ఏడు కిలో మీటర్ల దూరం వెళ్లే బదులు జిల్లా కేంద్రంలో ఉన్న ఏదో ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేరిపోదామని ఆలోచిస్తున్నారు.
మహిళలు నాగారం వరకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇన్నేళ్లో శిక్షణ తీసుకోవడానికి మహిళలు ఐదుగురికి మించి రాలేదు. 2014-15 సంవత్సరానికి కేవలం రెండు కోర్సుల అభ్యర్థులకే శిక్షణనిచ్చారు. అవి కూడా ఒకటి ఫారెస్ట్ పరీక్షలు కాగా, మరొకటి బ్యాంకింగ్ కోచింగ్. ఫారెస్టు పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం బ్యాంకింగ్వారికే శిక్షణ ఇస్తుంది. ఇందులో 60 సీట్లకు గాను కేవలం 26 మంది మాత్రమే కోచింగ్ తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ కోచింగ్ తీసుకునే వారికి మెటీరియల్ బుక్స్ అందలేదు. డబ్బులిస్తాం మీరే కొనుక్కోవాలని సూచించినట్లు సమాచారం.
నిధులు వృథా
పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు, స్టడీ సర్కిల్లో పని చేసే ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రభుత్వం ఏటా రూ.25 లక్షలను మంజూరు చేస్తుంది. కానీ, సంవత్సరంలో రెండు నుంచి మూడు కోర్సులకు మాత్రమే శిక్షణ ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. బయటి వ్యక్తులచే అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అలా అయితే ఉద్యోగులు ఉండి ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇతరులచే క్లాస్ చెప్పించే కార్యక్రమం పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. స్టడీ సర్కిల్లో ప్రస్తుతం కోర్సు కో ఆర్డినేటర్, లైబ్రేరియన్, వాచ్‌మన్, అటెండర్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్/ టైపిస్టు/ కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్, ఇలా మొత్తం ఏడుగురు ఉద్యోగులు పని చే స్తున్నారు. గతంలో ఇంతమంది అవసరం లేదని, నిధులు వృథా అవుతున్నాయని అటెండర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు తప్ప మిగతావాటిని రద్దు చేసింది. రాజకీయ నాయకుల సహకారంతో మళ్లీ ఆ నాలుగు పోస్టులను తిరిగి మంజురు చేయించుకున్నారు. ప్రస్తుతం వారు ఏ పని లేకపోగా కూర్చుండి నెలనెలా జీతాలు తీసుకుంటున్నారు. విషయం తెలిసీ కూడా సంబంధిత ఉన్నతాధికారులు మౌనంగా ఉంటున్నారు. స్టడీ సర్కిల్ లక్ష్యం నెరవేరకుండానే, ఏటా రూ.25 లక్షల నిధులు వృథాగా అవుతున్నాయి.
కలగానే నూతన భవన నిర్మాణం
బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని జిల్లా కేంద్రంలో నిర్మించాలని ఒత్తిడితేగా ప్రభుత్వం 2012లో మంజురు చేసింది. ఇందుకు నగరంలోని గంగాస్థాన్‌లో ఉన్న 2000 వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.15 కోట్లను కూడా మంజురు చేసింది. అప్పటి ఎంపీ మధుగౌడ్ అదనంగా రూ. 30 లక్షలు కూడా అందజేశారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడంతో ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముంది.
చర్యలు తీసుకుంటున్నాం
బీసీ స్టడీ సర్కిల్లో సమస్యలు వాస్తవమే. శిక్షణ తీసుకునేందుకు అభ్యర్థులు నాగారం వరకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అద్దె భవనం పాతది కావడంతో అభ్యర్థులు శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ సంవత్సరంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో కోర్సులు ప్రారంభించలేదు. జిల్లా కేంద్రంలో కొత్త భవనం మంజూరై రెండేళ్లవుతోంది. నిర్మించడంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారు. -విమలాదేవి, బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ అధికారి