Engineers Association
-
ట్రాన్స్‌కో భూమిని రక్షించండి
ట్రాన్స్‌కో సీఎండీకి వినతిపత్రం ఇచ్చిన ఇంజనీర్స్ అసోసియేషన్ సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో తమ సంస్థకు చెందిన రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ట్రాన్స్‌కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సన్నద్ధమయ్యారు. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ భూమిని స్టార్ హోటల్‌కు 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టాలని ప్రభుత్వ ముఖ్యనేత నిర్ణయించడంతో శుక్రవారం పర్యాటక శాఖ అధికారులు ఇక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. లీజు ముసుగులో ట్రాన్స్‌కో భూమికి చినబాబు ఎసరు పెట్టడంపై ‘స్టార్.. స్టార్.. దగా స్టార్’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. విలువైన భూమిని స్టార్ హోటల్‌కు అప్పనంగా కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ను కలిశారు. ట్రాన్స్‌కో భూమి బినామీల పరం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. -
తెలంగాణకు చేరిన ఇంజనీర్లు
టీఎస్ జెన్కోలో భర్తీ చేయనున్న యూజమాన్యం ? పాల్వంచ: ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ సీలేరు పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఇంజనీర్లు గురువారం తమ విధులు బహిష్కరించి స్వరాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత దిగువ సీలేరు ఆంధ్రాలోకి వెళ్లడంతో ఇంతకాలం అక్కడే విధుల్లో కొనసాగారు. ఈ క్రమంలో తెలంగాణ స్థాని కత కలిగిన వారిని రిలీవ్ చేసి పంపించాలని అక్కడ ఇంజనీర్లు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీనికి తెలంగాణ లో అన్ని ఇంజనీర్స్ అసోసియేషన్లు సంఘీభావం తెలుపుతున్నాయి. కానీ ఉద్యోగుల విభజన చేసి పంపడంలో జాప్యంతో విధులు బహిష్కరించి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విధులు బహిష్కరించిన వారిని టీఎస్ జెన్కోలో భర్తీ చేసేందుకు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బాధ్యత తీసుకుందని తెలుస్తోంది. యాజమాన్యం, ప్రభుత్వం నుంచిఅనుమతి తీసుకున్నామని ఆ సంఘ నేతలు చెబుతున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు మంగీలాల్ నేతృత్వంలో సీలేరుకు వెళ్లిన 30 మంది ఇంజనీర్లు (ఏఈలు, సబ్ ఇంజనీర్లు, అకౌంట్స్ సిబ్బంది) సీఈ మోహన్ రావుకు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ఆ వెంటనే వారు విధులు బహిష్కరించి తెలంగాణ చేరుకున్నారు. మార్గమధ్యలో పాల్వంచలోని కేటీపీఎస్ కాంప్లెక్స్‌కు గురువారం రాత్రికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే వీరు నేరుగా టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిసి టీఎస్ జెన్కోలో తమను భర్తీ చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగులు సైతం టీఎస్ జెన్కోలో పనిచేస్తుండటంతో వారిని ఎక్కడ భర్తీ చేయాలనే విషయమై తర్జనభర్జన జరుగుతోంది. తక్కువ మందే రావడంతో వెంటనే వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీ కరించిందని ఇంజనీర్ల సంఘాలు హామీ ఇచ్చి మరీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో చేర్చుకునేందుకు సుముఖం సీలేరులో విధులు బహిష్కరించి వచ్చే వారిని తెలంగాణలో జాయిన్ చేసుకునేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల విభజనను త్వరగా చేపట్టాలి
నల్లగొండ :విద్యుత్ ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తిచేయాలని ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, కార్యదర్శి స్వామిరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ వసతి గృహంలో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఇంజినీర్లను వీలైనంత త్వరగా వారి ప్రాంతాలకు పంపాలన్నారు. అదే విధంగా బంగారు తెలంగాణ సాధన దిశగా విద్యుత్ ఇంజినీర్ల సంఘం నిరంతం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కే వీఎన్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.