ట్రాన్స్‌కో సీఎండీకి వినతిపత్రం ఇచ్చిన ఇంజనీర్స్ అసోసియేషన్
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో తమ సంస్థకు చెందిన రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ట్రాన్స్‌కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సన్నద్ధమయ్యారు. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ భూమిని స్టార్ హోటల్‌కు 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టాలని ప్రభుత్వ ముఖ్యనేత నిర్ణయించడంతో శుక్రవారం పర్యాటక శాఖ అధికారులు ఇక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. లీజు ముసుగులో ట్రాన్స్‌కో భూమికి చినబాబు ఎసరు పెట్టడంపై ‘స్టార్.. స్టార్.. దగా స్టార్’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. విలువైన భూమిని స్టార్ హోటల్‌కు అప్పనంగా కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ను కలిశారు. ట్రాన్స్‌కో భూమి బినామీల పరం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు.
ట్రాన్స్‌కో భూమిని రక్షించండి
Published Sun, Mar 19 2017 3:11 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
Advertisement
Advertisement