england spinner
-
పాక్ మూలాలు ఉన్న ఇంగ్లండ్ స్పిన్నర్‌కు ఎట్టకేలకు భారత వీసా
భారత వీసా లభించకపోవడంతో తొలి టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఊరట లభించింది. వీసా లేకపోవడంతో అతను జట్టుతో పాటు భారత్‌కు ప్రయాణించకుండా యూఏఈ నుంచి ఇంగ్లండ్‌కు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బషీర్‌కు వీసా మంజూరైందని గురువారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ‘బషీర్ తన వీసా అందుకున్నాడు. ఈ వారాంతంలో భారత్‌కు వచ్చి అతను జట్టుతో కలుస్తాడు. సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది’ అని ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పుట్టినా... పాకిస్తాన్ మూలాలు ఉన్న కారణంగానే బషీర్ వీసాను భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని గత రెండు రోజులుగా విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ ప్రభుత్వ అధికారి కూడా ఒకరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అంతా సుఖాంతమైంది. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బషీర్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. ఒకవేళ బషీర్ జట్టుతో పాటు భారత్‌కు చేరుకుని ఉంటే ఇంగ్లండ్ తుది జట్టులో అతను ఉండేవాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. రెహన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హర్ట్లీలతో కూడిన ఇంగ్లండ్ స్పిన్ త్రయం భారత బ్యాటర్లను ఢీ కొట్టనుంది. భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
జూన్ 16 నుంచి ప్రారంభం కాబోయే యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాలి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. తాజాగా ఐర్లాండ్‌తో ముగిసిన ఏకైక టెస్ట్ సందర్భంగా లీచ్ ఫ్రాక్చర్ కారణంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తదనంతరం జరిపిన స్కాన్‌లో లీచ్ పాదంలో పగుళ్లు గుర్తించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. లీచ్ ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, 31 ఏళ్ల జాక్ లీచ్ 2018లో ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి 35 మ్యాచ్‌ల్లో 124 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. బ్యాటింగ్‌లో లీచ్ ఓ హాఫ్ సెంచరీ (92) సాధించాడు. 2019లో లీడ్స్‌లో జరిగిన టెస్ట్‌లో చివరి వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో నెలకొల్పిన భాగస్వామ్యం లీచ్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. ఆ మ్యాచ్‌లో లీచ్ చేసింది ఒక్క పరుగే అయినా వికెట్ పడకుంగా స్ట్రయిక్ రొటేట్ చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. మరో ఎండ్‌లో స్టోక్స్ (135 నాటౌట్) చారిత్రక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో లీచ్ సహకారంతో స్టోక్స్ చివరి వికెట్‌కు ఏకంగా 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదిలా ఉంటే, 5 టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ జూన్ 16న మొదలై, జులై 31తో ముగుస్తుంది. బిర్మింగ్హమ్ వేదికగా తొలి టెస్ట్ (జూన్ 16-20), లార్డ్స్‌లో రెండో టెస్ట్ (జూన్ 28-జులై 2), లీడ్స్‌లో మూడో టెస్ట్ (జులై 6-10), మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్ (జులై 19-23), ఓవల్ వేదికగా ఐదో టెస్ట్ (జులై 27-31) జరుగుతుంది. చదవండి: WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారు..? -
PAK VS ENG 3rd Test: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బౌలర్
PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. పురుషుల క్రికెట్లో అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన 18 ఏళ్ల 126 రోజుల వయసున్న రెహాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 48 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. Rehan Ahmed becomes the youngest debutant to claim a five-for in Men’s Tests 💪#WTC23 | 📝 https://t.co/y5SkcqY16s pic.twitter.com/LoDZE7Yimd — ICC (@ICC) December 19, 2022 గతంలో ఈ రికార్డు ఆసీస్ టెస్ట్ జట్టు సారధి పాట్ కమిన్స్ పేరిట ఉండేది. కమిన్స్ 18 ఏళ్ల 196 రోజుల వయసులో టెస్ట్‌ల్లో (అరంగేట్రం మ్యాచ్) 5 వికెట్ల ఘనత సాధించాడు. తాజాగా రెహాన్.. చాలాకలంగా పదిలంగా ఉండిన కమిన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెహాన్ ఈ రికార్డుతో పాటు మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్ చరిత్ర సృష్టించాడు. రెహాన్‌కు ముందు ఈ రికార్డు బ్రియాన్ క్లోజ్ పేరిట ఉండేది. క్లోజ్.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రెహాన్ పాకిస్తాన్ సంతతికి చెందిన వాడు. రెహాన్ తండ్రి నయీమ్ అహ్మద్ పాకిస్తాన్లో జన్మించి, ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. రెహాన్, అతని సోదరులు ఫర్హాన్, రహీమ్‌లు కూడా క్రికెటర్లే కావడం విశేషం. ఇంగ్లండ్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న రెహాన్.. తన తండ్రి పుట్టిన దేశంపైనే విశ్వరూపం ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు నెగ్గిన ఇంగ్లండ్.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్‌లోనూ విజయం సాధించి పాకిస్తాన్‌ను వారి స్వదేశంలో క్లీన్ స్వీప్ చేస్తుంది. రెహాన్ ధాటికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది. -
ఇంగ్లండ్ ఒక్క టెస్ట్ కూడా గెలువలేదు: గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు ఒక్క టెస్ట్ కూడా గెలిచే అవకాశం లేదని టీమిండియా మాజీ ఓపెనర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై ఇంగ్లీష్ జట్టు పేలవమైన స్పిన్ అటాక్‌తో బరిలోకి దిగుతుందని, ఇది టీమిండియాకు కలిసొచ్చే విషయమని గౌతీ పేర్కొన్నారు. ఇంగ్లండ్ స్పిన్ విభాగానికి సారధ్యం వహిస్తున్న మొయిన్ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. 60 టెస్ట్‌ల్లో 181 వికెట్లు సాధించిన మొయిన్ అలీ ఒక్కడే భారత్‌పై కాస్తో కూస్తో ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు. ఇంగ్లీష్ స్పిన్నర్లు డామ్ బెస్, జాక్ లీచ్‌లను భారత బ్యాట్స్మెన్లు ఓ పట్టు పడతారని ఆయన భరోసాను వ్యక్తం చేశాడు. చెరి 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అనుభవమున్నఈ ఇంగ్లండ్ స్పిన్నర్లపై టీమిండియా బ్యాట్స్మెన్లు ఎదురుదాడికి దిగితే.. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0 లేదా 3-1 తేడాతో చేజిక్కించుకునే అవకాశం ఉందని గంభీర్ జోస్యం చెప్పాడు. అయితే పింక్ బాల్‌తో జరిగే టెస్ట్‌లో మాత్రం ఇరు జట్లకు సమానమైన అవకాశాలు ఉన్నయని ఆయన పేర్కొన్నాడు. శ్రీలంకపై 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్ సారధి జో రూట్‌కు ఈ సిరీస్ చేదు అనుభవాల్ని మిగిలిస్తుందని గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు బూమ్రా, అశ్విన్‌లు ఈ సిరీస్‌లో కీలకం కానున్నారని గంభీర్ పేర్కొన్నాడు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగబోయే తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలో, మూడు, నాలుగు టెస్ట్‌లు అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి. -
మందు కొట్టిన మత్తులో...
లండన్: అప్పట్లో సైమండ్స్ తప్పతాగడం... చిందులేయడం... చేపలు పట్టడం... ఇది సహించని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆగ్రహంతో సైమండ్స్ జట్టులో స్థానాన్నే కోల్పోయాడు. ఇటీవల జెస్సీ రైడర్ (కివీస్), వార్నర్ (ఆసీస్)లు బ్యాటింగ్‌లో మెరుపులకన్నా, తాగితూగిన ఉదంతాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రైడర్ అయితే ఏకంగా ప్రాణాల మీదికే తెచ్చుకున్నాడు. అదృష్టం ఆశపెట్టడంతో బ్రతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు. తాజాగా ఇప్పుడు ఇంగ్లండ్ స్పిన్నర్ మోంటీ పనేసర్ వంతు వచ్చినట్లుంది. అనుచిత ప్రవర్తనతో పోలీసులకు జరిమానా కట్టాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే... సోమవారం బ్రింగ్టన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో ఈ ఇంగ్లండ్ స్పిన్నర్ పీకలదాకా తాగేశాడు. ఆ నిషా తలకెక్కి ఒళ్లుమరిచాడు. క్లబ్‌కొచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడు. వాళ్ల ఫిర్యాదుతో బౌన్సర్లు అతన్ని ఈడ్చుకెళ్లి బయటికి గెంటేశారు. అసలే ఫూటుగా తాగడం... ఏం చేస్తున్నాననే ఇంగితం మరచిన పనేసర్... ఆ బౌన్సర్లపై మూత్ర విసర్జన చేశాడు. ఈ అసహ్యమైన ఘటన పోలీసుల దాకా వెళ్లింది. వార్నింగ్ ఇచ్చి, రూ.8300 (90 పౌండ్లు) జరిమానా విధించారు. దీనిపై సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ విచారణకు ఆదేశించింది. ఆ క్రికెటర్ ప్రతినిధి జరిగిన ఘటనపై పనేసర్ క్షమాపణ కోరాడని చెప్పారు.