English teachers
-
‘ఇంగ్లిష్’ టీచర్లకు శిక్షణ
జిల్లాలో 654 పాఠశాలల్లో ఇంగ్లిషు మాధ్యమంలో బోధన ఈనెల 12 నుంచి.. మూడు విడతలుగా కార్యక్రమం పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించే విషయమై ఓ అడుగు ముందుకు పడింది. ఇంతకాలం ప్రారంభోత్సవాలకే పరిమితమైన విద్యాశాఖ ఇంగ్లీష్ భాషపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లాలోని 654 పాఠశాలల నుంచి ఇద్దరేసి ఉపాధ్యాయుల చొప్పున శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 12 నుంచి 19 వరకు షెడ్యూల్ రూపొందించింది. ఇందుకనుగుణంగా ఇంగ్లీష్ బోధన నైపుణ్యాన్ని పొందుపరుస్తు తయారు చేసిన మాడ్యూల్స్ గురువారం మండల వనరుల కేంద్రాలకు చేరాయి. నాలుగైదు మండలాల ఉపాధ్యాయులను ఒక చోట చేర్చి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఒకటో, రెండో తరగతులకు సంబంధించి సిలబస్ రూపొందించి పుస్తకాలు రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వ బడులను బతికించకునేందుకు ఈ యేడు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రారంభించింది.మెదక్ జిల్లాలో మొత్తం 2940 పాఠశాలలుండగా 654 పాఠశాలల్లో ఈ యేడు ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించారు.అయితే పాఠశాలలను ప్రారంభించినప్పటికీ పుస్తకాలు..కరిక్యులం లేక చాలా చోట్ల చిన్నారులు బడికి రావడం..పోవడం వరకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. దీనికి తోడు తెలుగు మీడియం బోధిస్తున్న టీచర్లకు ఇంగ్లీషు భాష బోధన మెలకువలు..నైపుణ్యం లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయినప్పటికీ చాలా చోట్ల టీచర్లు తమ సొంత డబ్బులతో ఇంగ్లిషు మీడియం పుస్తకాలు కొనుగోలు చేసి ఉన్న పరిజ్ఞానం మేరకు బోధించారు. మూడు విడతల శిక్షణ ఈనెల 12 నుంచి 30 వరకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.ఈ మేరకు మాడ్యూల్స్ గురువారం ఎమ్మార్సీలను చేరాయి. ఇందుకు అవసరమైన రిసోర్స్ పర్పన్లను నియమించి బోధన మెలకువలు, కమ్యునికేషన్ స్కిల్స్ నేర్పనున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు మొదటి విడత, 19 నుంచి 23 వరకు రెండో విడత, 26 నుంచి 30 వరకు మూడోవిడత శిక్షణ కార్యక్రమాలు 5 రోజుల చొప్పున కొనసాగనున్నాయి.నాలుగేసి మండలాలను ఒక చోట కలిపి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ను కూడా విడుదల చేశారు. -
ఆంగ్ల అధ్యాపకులకు శిక్షణ తరగతులు
హన్మకొండ చౌరస్తా : ఇంటర్ మొదటి, రెండో సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ సిలబస్‌పై హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ఎయిడెడ్ అధ్యాపకులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి, కమిషనర్ డాక్టర్ ఏ.అశోక్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆర్జేడీ ఐఈ డాక్టర్ కాశీనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మొదటి రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ పై శిక్షణ కొనసాగింది. కార్యక్రమంలో ఆర్ఐఓ షేక్ అహ్మద్, రిటైర్డ్ ఆర్జేడీ మలహల్రావు, రిటైర్డ్ డీవీఈఓ ఎ.పరాయ్, జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.బాబురావు, రిసోర్స్ పర్సన్ ఇ.శ్రీనివాసరావు, టీఎస్ ప్రవీణ్‌కుమార్, ఇ.సత్యనారాయణ, స్వర్ణలత, డిప్యూటీ డీవీఈఓ రమణారావు, సూపరింటెండెంట్ మోహన్‌జీ తదితరులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్ టీచర్లు ఇంగ్లిష్ లో ఫెయిల్ అయ్యారు!
చంఢీఘర్:ఏ భాష భోదించే టీచర్లకైనా ఆ భాషపై కనీస పట్టు ఉండాలి. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఇంగ్లిష్ బోధించే ప్రభుత్వ టీచర్లు ఆ సబ్జెక్ట్ లో బాగా వెనుకబడిపోయారట. తాజాగా కొంతమంది ఇంగ్లిష్ టీచర్లకు అక్కడ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించగా ఆశ్చర్యపోయే విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పని చేస్తున్న 220 మంది ఇంగ్లిష్ టీచర్లకు ఇంగ్లిష్ టెస్టు నిర్వహించారు.అయితే వారు ఇంగ్లిష్ లో భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు మొదలుకొని దాదాపు అన్ని పదాలను తప్పుగా రాసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దలిత్ సింగ్ చీమా తెలిపారు.టీచర్లు చేసిన తప్పిదాలను స్కూళ్లకు తిరిగి వెళ్లిన తరువాత తెలుసుకుంటారని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యధిక శాతం మంది ఇంగ్లిష్ భాషలో తప్పడంతో మొహాలీ పట్టణంలో టీచర్లతో విద్యాశాఖ సమావేశం నిర్వహించింది. మూడు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు హాజరుకాగా.. అందులో ఎనభై వేలమందికి పైగా పరీక్షల్లో తప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. -
నకి‘లీలలు’ వెలుగుచూసేనా..?
ఖమ్మం, న్యూస్‌లైన్: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై సీబీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విద్యాశాఖాధికారులు చేసిన విచారణ ఎటూ తేలకపోవడంతో నకిలీలను సీబీసీఐడీ అయినా బట్టబయలు చేస్తుందా అనేది చర్చనీయాంశమైంది. గురువారం వీటికి సంబంధించిన దర్యాప్తును సీబీసీఐడీ డీఎస్పీ సంజీవరావు ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలను తీసుకున్నారు. యూనివర్సిటీల్లో పరీక్షలు రాసిన ఉపాధ్యాయుల హాల్‌టికెట్ నంబర్లు, మార్కుల జాబితా, యూనివర్సిటీ వివరాలు జిల్లా విద్యాశాఖాధికారుల నుంచి సేకరించారు. డీఈఓ రవీంద్రరనాధ్రెడ్డితో ఈ విషయంపై చర్చించారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నకిలీ ఇంగ్లిష్ టీచర్ల వ్యవహారంపై తీసుకున్న చర్యలు, ఉన్నతాధికారులకు సమర్పించిన జాబితా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలపై స్పందించిన తీరు వివరాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. దీంతో నకిలీ ఇంగ్లిష్ టీచర్లలో ఆందోళన మొదలైంది. 2009లో ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి తీసుకొచ్చిన సర్టిఫికెట్లను సమర్పించి దొడ్డిదారిన పదోన్నతులు పొందారని, ఒరిజినల్ ఇంగ్లిష్ టీచర్స్ ఫోరం నాయకులు లోక్ అదాలత్‌కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. లోక్ అదాలత్ విచారణలో భాగంగా కొద్దిరోజుల క్రితం జిల్లాలోని 66 మంది ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ల వివరాలను డీఈఓ కార్యాలయ సిబ్బంది హైదరాబాద్‌లోని ఉన్నత విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించారు. సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులే నకిలీ వ్యవహారంలో భాగస్వాములు కావడంతో మండిపడ్డ ఉన్నతాధికారులు నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీసీఐడీకి అప్పగించారు. ఆ శాఖాధికారులు ఈ వ్యవహారంపై మొదటినుంచి కూపీ లాగడంతో దొడ్డిదారి వ్యవహారం బట్టబయలు అవుతుందని ‘నకిలీ’లలో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారం బయటపడితే డబ్బుతో పాటు పరువూ పోతుందని, సహచర ఉపాధ్యాయుల ఎదుట తలెత్తుకుని తిరగలేమని పలువురు మథనపడుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా వివిధ రకాలుగా విచారణ చేపట్టి ఎటూ తేల్చని ఈ వ్యవహారం సీబీసీఐడీ అధికారుల చేతుల్లోకి రావడంతో వీరైనా నిజానిజాలను నిగ్గుతేల్చి తమకు న్యాయం చేస్తారో.. లేదో అని ఒరిజినల్ ఇంగ్లిష్ టీచర్స్ ఫోరం నాయకులు వేచి చూస్తున్నారు.