ఖమ్మం, న్యూస్‌లైన్: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై సీబీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విద్యాశాఖాధికారులు చేసిన విచారణ ఎటూ తేలకపోవడంతో నకిలీలను సీబీసీఐడీ అయినా బట్టబయలు చేస్తుందా అనేది చర్చనీయాంశమైంది. గురువారం వీటికి సంబంధించిన దర్యాప్తును సీబీసీఐడీ డీఎస్పీ సంజీవరావు ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలను తీసుకున్నారు. యూనివర్సిటీల్లో పరీక్షలు రాసిన ఉపాధ్యాయుల హాల్‌టికెట్ నంబర్లు, మార్కుల జాబితా, యూనివర్సిటీ వివరాలు జిల్లా విద్యాశాఖాధికారుల నుంచి సేకరించారు. డీఈఓ రవీంద్రరనాధ్‌రెడ్డితో ఈ విషయంపై చర్చించారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నకిలీ ఇంగ్లిష్ టీచర్ల వ్యవహారంపై తీసుకున్న చర్యలు, ఉన్నతాధికారులకు సమర్పించిన జాబితా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలపై స్పందించిన తీరు వివరాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. దీంతో నకిలీ ఇంగ్లిష్ టీచర్లలో ఆందోళన మొదలైంది.
2009లో ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి తీసుకొచ్చిన సర్టిఫికెట్లను సమర్పించి దొడ్డిదారిన పదోన్నతులు పొందారని, ఒరిజినల్ ఇంగ్లిష్ టీచర్స్ ఫోరం నాయకులు లోక్ అదాలత్‌కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. లోక్ అదాలత్ విచారణలో భాగంగా కొద్దిరోజుల క్రితం జిల్లాలోని 66 మంది ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌ల వివరాలను డీఈఓ కార్యాలయ సిబ్బంది హైదరాబాద్‌లోని ఉన్నత విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించారు. సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులే నకిలీ వ్యవహారంలో భాగస్వాములు కావడంతో మండిపడ్డ ఉన్నతాధికారులు నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీసీఐడీకి అప్పగించారు. ఆ శాఖాధికారులు ఈ వ్యవహారంపై మొదటినుంచి కూపీ లాగడంతో దొడ్డిదారి వ్యవహారం బట్టబయలు అవుతుందని ‘నకిలీ’లలో ఆందోళన మొదలైంది.
ఈ వ్యవహారం బయటపడితే డబ్బుతో పాటు పరువూ పోతుందని, సహచర ఉపాధ్యాయుల ఎదుట తలెత్తుకుని తిరగలేమని పలువురు మథనపడుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా వివిధ రకాలుగా విచారణ చేపట్టి ఎటూ తేల్చని ఈ వ్యవహారం సీబీసీఐడీ అధికారుల చేతుల్లోకి రావడంతో వీరైనా నిజానిజాలను నిగ్గుతేల్చి తమకు న్యాయం చేస్తారో.. లేదో అని ఒరిజినల్ ఇంగ్లిష్ టీచర్స్ ఫోరం నాయకులు వేచి చూస్తున్నారు.
నకి‘లీలలు’ వెలుగుచూసేనా..?
Published Fri, Nov 15 2013 5:07 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement
Advertisement