Enter The Girl Dragon
-
‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ ఓ ట్రెండ్ సెట్టర్
ఒకప్పుడు బ్రూస్లీ నటించిన హాలీవుడ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో బ్రూస్లీ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూడా బ్రూస్లీ అంటే ఎనలేని అభిమానం. తన సినిమాలలోని ఫైట్స్ ఆయనను స్ఫూర్తిగా చేసుకుని చేసినవే అని వర్మ చెబుతుంటారు. ఇదిలావుండగా...ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో తన దర్శకత్వంలో ఆర్జీవీ ఇప్పుడు ఓ సినిమాను రూపొందిస్తున్నారు. పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ చిత్రం కావడం విశేషం. మొదటి నుంచి విభిన్నచిత్రాలు చేస్తూ.. ఓ ప్రత్యేక పంథా కు తెరతీసిన వర్మ మార్షల్ ఆర్ట్స్ కు గ్లామర్ ను మేళవించి మరో కొత్త ట్రెండుకు తెర తీయబోతున్నారు. ఇండో చైనీస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రధారి పూజా భలేకర్ చేసిన రిస్కీ ఫైట్స్ అత్యంత ఆకర్షణీయంగా, వళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉండనున్నాయని చిత్రబృందం వెల్లడించింది. పై పెచ్చు ఆమె గ్లామర్ కూడా ఒక హైలైట్ కానుందని వారు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు విశేషమైన ప్రేక్షక స్పందన లభించడమే కాదు ట్రెండింగ్ అయ్యింది. లోగడ చైనాలోనూ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్ లో పూర్తి చేసుకుంది. జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా చిత్రనికి సంబందించిన పోస్టర్స్‌ను విడుదల చేసింంది. చదవండి: రేణుక, ఆమె బిడ్డకు సాయం చేయండి: ఆర్జీవీ కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ -
సినిమా ట్రైనింగ్ క్లిప్స్ విడుదల చేసిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ చిత్ర టీజర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లోనే తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రం అని చెప్పుకుంటున్న వర్మ సినిమాలో ఫైట్స్ కన్నా ఎక్కువగా మసాలా సన్నివేశాలే ఉన్నాయని చాలా మంది పెదవి విరిచారు. కానీ వీటన్నింటికి సమాధానంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ క్లిప్స్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. సినిమాలోని పోరాట సన్నివేశాలు డూప్ కాదని వెల్లడించారు. హీరోయిన్ పూజా భాలేకర్ తైక్వాండో మార్షల్ ఆర్టిస్ట్ అని, కానీ బ్రూస్లీ స్టైల్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందన్నారు. ఇక ఈ వీడియోలో పూజా భాలేకర్ అంకితభావానికి జనాలు ఫిదా అవుతున్నారు. ట్రైలర్ చూసి విమర్శించినవాళ్లు సైతం ట్రైనింగ్ వీడియో క్లిప్స్ చూసి ఆమె కఠోర సాధనకు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక సినిమా కోసం ఎంతగానో కష్టపడిన పూజా భాలేకర్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నూతన నటి ఓవైపు అందాల ఆరబోతను, మరోవైపు ఫైట్ సీన్లను సమంగా బ్యాలెన్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఇండోచైనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్ సిటీలో డిసెంబర్ 13న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. -
వర్మ మరో సంచలనం; టీజర్ విడుదల
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ టీజర్ విడుదలైంది. బ్రూస్లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఈ సినిమాను టీజర్‌ను వర్మ విడుదల చేశారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. వర్మ అభిమానులు మెచ్చేలా ఈ సినిమా టీజర్ ఉంది. పూజా భలేకర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్టుగానే కనిపిస్తోంది. ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని, తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్ సిటీలో డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇండో-చైనా సంయుక్త నిర్మాణంలో జింగ్ లియు, టి.నరేశ్, టి.శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. రవి శంకర్ సంగీతం అందించారు. -
ఇది నా కెరీర్లోనే ప్రతిష్టాత్మక సినిమా: వర్మ
నిత్యం వివాదాలు, వరుస సినిమాలతో నిరంతరం వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు వంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న వర్మ తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ సినిమాను తెరపైకి తెచ్చాడు. ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని, తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా టీజర్‌ను బ్రూస్లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 3.12 గంటలకు విడుదల చేయబోతున్నట్టు వర్మ ట్విటర్లో వెల్లడించాడు. ఇండో-చైనా సంయుక్త ప్రోడక్షన్లో ఈ సినిమా నిర్మితమవుతుందని తెలిపిన వర్మ.. చైనీస్ నిర్మాతతో ఒప్పందంపై సంతకం చేస్తున్న ఫొటోను కూడా ట్విటర్లో పోస్టు చేశారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్ సిటీలో డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇక నేడు (బుధవారం) బ్రూస్ లీ జయంతి కావడంతో ఆయన పట్ల తన ప్రేమను, ఆరాధనను చాటుతూ రాంగోపాల్ వర్మ ఫేస్బుక్లో ఒక నోట్ పోస్టు చేశారు.