అమెరికా ఎన్నికల్లో పర్యావరణమే ప్రధాన అజెండా
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పర్యావరణమే ప్రధాన ఎజెండా అవుతుందని, త్వరలో భారత రాజకీయాల్లో కూడా కీలక అంశంగా మారుతుందని పర్యావరణ పరిశోధకుడు అట్లాంటిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ పేర్కొన్నారు. సంప్రదాయ ఇంధన వనరుల మితిమీరిన వినియోగం వల్ల భూమిపై వేగంగా సహజ వనరులు తరిగిపోతున్నాయని, వ్యవసాయం, పర్యావరణం దెబ్బతిని కరువు, విపత్తులు సంభవిస్తాయని, మానవాళి మనుగడకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై మంగళవారం ఆయన హైదరాబాద్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు.
హైదరాబాద్ మెట్రో బావుంది
హైదరాబాద్ నగరం బావుందని, రవాణా వ్యవస్థలో మెట్రో, ఎలక్ట్రిక్ బస్సులు రావడం శుభపరిణామమని లివింగ్స్టన్ పేర్కొన్నారు. పర్యావరణహితంగా స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయని, ఇవి మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. బొగ్గు, డీజిల్, పెట్రోల్ లాంటి స్థానంలో వీలైనంత త్వరగా హైడ్రోజన్, విద్యుత్, న్యూక్లియర్ వంటి ఆధునిక ఇంధనాలు రావాలన్నారు. అమెరికా పర్యావరణంపై ప్రజల్లో, స్థానిక ప్రభుత్వాల్లో పర్యావరణమార్పులపై అనేక ఆందోళనలు ఉన్నాయని, ప్రకృతి విపత్తులతో జరుగుతున్న ఆస్తి, ప్రాణనష్టాల నేపథ్యంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పర్యావరణమే ప్రధాన ఎజెండా అవుతుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో కాలుష్య తీవ్రత పెరిగిపోయిన దరిమిలా.. వచ్చే ఎన్నికల్లో భారత రాజకీయాల్లోనూ పర్యావరణం కీలకాంశంగా ఉంటుందని అన్నారు. ఇండియాలో సౌర విద్యుత్తు పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే..మరింత ఎక్కువ మంది వినియోగదారులు చేరతారని అభిప్రాయ పడ్డారు. పవన, సౌర టర్బైన్ల నిర్వహణ వివిధ శీతోష్ణస్థితుల వద్ద కష్టంగా మారుతోందని, దీన్ని అధిగమించేందుకు డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిమోట్ సెన్సింగ్ వంటి ఆధునిక పద్ధతులు ఉపయోగించుకోవచ్చని వివరించారు.
లిథియం, కోబాల్ట్ మినరల్స్‌పై దృష్టి
భవిష్యత్తులో సౌర, పవన, తదితర పద్ధతుల్లో ఇంధనాన్ని ఉత్పత్తి చేసినా..వాటిని నిల్వ చేయడం సవాలుగా మారుతుంద న్నారు. అందుకే, ప్రస్తుతం బ్యాటరీలో వాడుతున్న లిథియం, కోబాల్ట్ మినరల్స్‌పై దేశాలు దృష్టి సారించాలని సూచించారు. వచ్చేవారం అమెరికా విదేశాంగ మంత్రితో భారత ప్రభుత్వం ఇదే విషయమై జరపనున్న చర్చల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. కర్బన ఉద్గారాలు వెలువరించే వాహనాలు, పరిశ్రమలపై కఠినమైన చలానాలు విధించడం ద్వారా స్వీడన్ ప్రపంచంలోనే సంప్రదాయేతర ఇంధనాల వినియోగంలో మొదటి స్థానంలో ఉందని, ప్రపంచమంతా ఈ బాటలో నడవాలని సూచించారు. జర్మనీ, జపాన్, సౌదీ అరేబియా వివిధ వాహనాలు, పరిశ్రమల్లో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కర్బన ఉద్గారాలను అరికట్టకపోతే భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు, సునామీలు, తుపాన్లు, కరువు, వ్యవసాయ ఉత్పత్తి మందగించడం, వలసలు, దేశాల మధ్య కలహాలు రేగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాయన్నారు. అందుకే, సంప్రదాయేతర ఇంధన వనరులపై ఇండియా– అమెరికా కలసి నూతన ఆవిష్కరణల కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.