ఇబోలా రావచ్చు.. కోతులతో ఆడొద్దు!
ఇబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి, ఎవరూ కోతులతోను, బబూన్లతోను ఆటలు ఆడొద్దని గోవా ఆరోగ్యశాఖ హెచ్చరించింది. పశ్చిమాఫ్రికాలో మొదలైన అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ను ఎదుర్కోడానికి, దీనికి సంబంధించిన విషయాలను పర్యవేక్షించడానికి ఓ కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు గోవా సర్కారు వెల్లడించింది. ఉన్నత స్థాయి ఆరోగ్యశాఖాధికారులు, పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. దీనికి ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు.
ఇబోలా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని, సరిగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని ప్రజలకు సూచిస్తున్నారు. గోవాలో ఇప్పటివరకు ఒక్క ఇబోలా కేసు కూడా నమోదు కాకపోయినా.. ముందు జాగ్రత్తగా ఈ హెచ్చరికలు చేశారు.