ఆర్టీసీ కార్మికుల బీమా మొత్తం పెంపు
రూ. 3.60 లక్షల నుంచి రూ. 6 లక్షలకు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చనిపోతే చెల్లించే బీమా మొత్తాన్ని పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈపీఎఫ్ బోర్డు ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించటం విశేషం. ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్న కార్మికులు చనిపోతే బీమాగా రూ. 3.60 లక్షలు చెల్లిస్తున్నారు. దీన్ని రూ. 6 లక్షలకు పెంచుతూ గతేడాది మేలో కేంద్ర బోర్డు నిర్ణయం తీసుకుంది.
కానీ ఇప్పటివరకు టీఎస్ఆర్టీసీ దాన్ని అమలు చేయలేదు. తాజా గా గత మే 24 నుంచి వర్తించేలా దాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అంటే.. గత మే 24 తర్వాత చనిపోయిన వారికి ఆ మొత్తం అందాల్సి ఉంటుంది. ఇప్పటికే పాత పద్ధతిలో చెల్లింపులు జరిగి ఉంటే.. మిగతా మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగానైనా దీన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం పట్ల ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.