‘బెటాలియన్’ పనులు వేగవంతం
‘అనంత’కు ఆరు కిలోమీటర్ల దూరంలో.. రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మాణాలు
అనంతపురం సెంట్రల్ జైలు సమీపంలో 118 ఎకరాల్లో బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తొలివిడతగా రూ. 13కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో తొలుత ఎంపిక చేసిన స్థలం చుట్టూ ప్రహరీ, విద్యుత్, అంతర్గత రహదారులు, నీటి వసతి పనులు పూర్తి చేశారు. అదే సమయంలో పాలక భవనం, మన్ బ్యారక్, సిబ్బంది క్వాటర్స్, ఆయుధగారం పనులు చేపట్టారు. ఈ పనులు శరవేగంతో పూర్తి అవుతున్నాయి. రానున్న కాలంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, రక్షక విభాగాలకు సంబంధించిన మూడు నుంచి నాలుగు వేల మంది నివాసముండేలా 800 క్వాటర్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు.
చుట్టూ పరుచుకుంటున్న పచ్చదనం
ఏపీఎస్పీ 14వ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతం చుట్టూ పచ్చదనం పరుచుకుంటోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో నాటిన రెండు వేల మొక్కలు పచ్చదనాన్ని సంతరించుకుని విస్తరిస్తున్నాయి. బ్లాక్‌ల వారిగా వరుస క్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. విశాలమైన మట్టి రోడ్లనే వేశారు. పాలక భవనం దాదాపు పూర్తి కావస్తోంది. బెటాలియన్ సిబ్బందికి ఇక్కడ వివిధ రంగాలలో ప్రత్యేక శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది ; జగదీష్‌కుమార్, కమాండర్
బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించి తొలుత అడ్మినిస్ట్రేషన్ భవనం, మన్ బ్యారెక్, ఆయుధగారం వంటి నిర్మానాలు చేస్తున్నాం. మరిన్ని పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు నిధుల అవసరం చాలా ఉంది. ఏదేమైనా నిర్మాణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం.