కుల వ్యవస్థ నిర్మూలనతోనే సమాజ మార్పు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన జరగాలని మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రగాఢంగా కోరుకున్నారని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభా గం ప్రొఫెసర్ కే.శ్రీనివాసులు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బీసీ సెల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్- సమకాలీన భారతదేశంలో కులం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే దేశంలో నూతన సమాజ ఆవిష్కరణ జరుగుతుందని పూలే, అంబేద్కర్ స్పష్టం చేశారన్నారు. వారిద్దరూ కులవ్యవస్తను తీవ్రంగా వయతిరేకించారన్నారు. కుల వ్యవస్థకు అనుకూల, వ్యతిరేకవర్గాల మధ్య చరిత్రలో ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉందన్నారు. కుల వ్యవస్థ విషయంలో మార్క్సిస్టుల అవగాహనకు, అంబేద్కర్ అవగాహనకు ఎంతో తారతమ్యం ఉందన్నారు. భారతీయ సమాజంలో కుల ప్రాధాన్యత తగ్గినట్లు గతంలో ఎంఎన్ శ్రీనివాస్ వంటి మేధావులు చెప్పినా, వాస్తవ ం అందుకు విరుద్ధంగా ఉందన్నారు.
ఇప్పటికీ కుల ప్రభావం నిమ్నవర్గాలను చిన్నచూపు చూస్తుందన్నారు. తెయూ వీసీ అక్బర్‌అలీఖాన్ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. అన్నివర్గాల వారికి సమానమైన అవకాశాలు లభించాలన్నారు. అప్పుడే సమాజంలో శాంతి, సౌభాగ్యం వెళ్లివిరిస్తుందన్నారు. వనరుల పంపిణీ సమాన స్థాయిలో జరిగి అన్నివర్గాలకు మేలు జరగాలని ఆకాంక్షించారు.
కేయూ సామాజిక శాస్త్ర విభాగం మాజీ డీన్ ప్రొఫెసర్ రాములు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యా రు. తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సదస్సుకు అధ్యక్షత వహించారు. సదస్సులో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కనకయ్య, ఆర్ట్స్ విభాగం డీన్ ధర్మరాజు, బీసీ సెల్ డెరైక్టర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.