Errabelli Pradeep Rao
-
ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు!
'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు. ఈ నానుడికి ఆ నియోజకవర్గం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవారు. తాజా ఎన్నికల్లో మూడు పార్టీల తరపున ఆ ముగ్గురే పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోరు తీవ్రస్థాయిలో జరుగుతున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ నాయకులు ఎవరు?' అసెంబ్లీ ఎన్నికల కాలంలో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ.. శాశ్వత శత్రువులూ ఉండరని అంటారు. నిన్న మిత్రులుగా ఉన్న వారు ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారి ఉండొచ్చు. ప్రత్యర్ధులు ఏకతాటిపైకి వచ్చి ఉండొచ్చు. ఇప్పటి తరం నాయకులు ఒకే పార్టీని పట్టుకుని వేలాడటంలేదు. పొద్దున టిక్కెట్ రాలేదంటే సాయంత్రానికి కండువా మార్చేస్తున్నారు. సాయంత్రం టికెట్ ఇస్తానంటే ఉదయానికి పార్టీ మార్చేస్తున్నారు. జెండాలు, రంగులు మార్చేయడం చాలా ఈజీగా మారిపోయింది. రాజకీయ కమిట్మెంట్, కేడర్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండడం ఒకప్పటి మాట. ఇప్పుడంతా అధికారం, పదవి ముఖ్యం అన్నట్లుగా పార్టీలు మార్చేస్తున్నారు. గులాబీ పార్టీలో కొనసాగి.. ఇప్పుడు చెరోదారి! హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు బరిలో ఉన్నారు. 2014లో ఈ ముగ్గురు నాయకులు గులాబీ పార్టీలో కొనసాగారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి 2018 వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున వరంగల్ నగరంలో కార్పొరేటర్‌గా గెలిచిన నన్నపునేని నరేందర్‌ను మేయర్ పదవి వరించింది. గత ఎన్నికల్లో నరేందర్ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. కారు దిగి కమలం గూటికి.. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ సాధన సమితిలో సాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేగా కొండా సురేఖ, కార్పొరేటర్ గా నరేందర్ ఎన్నికల్లో గెలిచేందుకు తన వంతు సహకారం అందించారు. 2018లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రదీప్ రావును ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ ఆయన ఆశలపై గులాబీ పార్టీ అధిష్టానం నీళ్ళు చల్లింది. నన్నపునేని నరేందర్‌కు టికెట్ ఇవ్వడంతో ప్రదీప్‌రావు నిరుత్సాహం చెందారు. నీకు మంచి గుర్తింపు ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇవ్వడంతో అప్పుడు ఎన్నికల్లో తప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీలో గుర్తింపు లేకపోవడం, ఎలాంటి పదవులు రాకపోవడంతో.. కొన్ని నెలల క్రితం కారు దిగి కమలం గూటికి చేరారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖ, బీజెపి అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల వరకు వీరంతా ఒకే పార్టీలో పనిచేసి.. ఒకే స్టేజి పైన కూర్చున్నారు. ఇప్పుడు నన్నపునేని గులాబీ నీడనే ఉండగా.. కొండా సురేఖ, ప్రదీప్‌రావు జెండాలు మార్చారు. ఒకే నియోజకవర్గంలో ముగ్గురూ ప్రత్యర్థులుగా మారి పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు. మరి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి. ఇవి చదవండి: 'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం! -
వరంగల్ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్.. బిజీబిజీగా ఈటల
సాక్షి, వరంగల్: పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లుపై బిజేపి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ వైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర సాగుతుంటే.. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఈటల రాజేందర్ బిజీగా ఉన్నారు. వరంగల్‌లో పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో భేటీ అయ్యారు. ప్రదీప్ రావు ఇంట్లో జరిగిన ఈ భేటీలో ఈటలతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాల బీజేపీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ రావు, పద్మ.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఉన్నారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీసీ కుల సంఘాలకు చెందిన పలువురు నాయకులతో కూడా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ప్రదీప్ రావుతో పాటు ఎవరెవరు బీజేపీలో చేరుతున్నారనే అంశంపై చర్చించి, చేరికలపై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. కాగా, బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు ఈ నెల 27న భద్రకాళి అమ్మవారి పాదాల చెంతన ముగుస్తుండడంతో ఆ రోజున నిర్వహించే బహిరంగ సభలో ప్రదీప్ రావుతో పాటు టీఆర్ఎస్కు చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరేలా పగడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. చదవండి: (సోనియాగాంధీ వద్దకు కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి!) -
మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావుతో ఈటల భేటీ
-
టీఆర్ఎస్కు మంత్రి సోదరుడు షాక్
వరంగల్ జిల్లా: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు టీఆర్ఎస్కు షాకిచ్చారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే నరేందర్ రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. ‘చీరుస్తా, పాతరేస్తా అంటే పార్టీలో ఉండాలా. తన సహకారం లేకుండా నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందితే పదో తారీకు వరకు రాజీనామా చేయి. రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. బతికున్నన్ని రోజులు ఆయనకు సేవకుడిగా పని చేస్తా. 25 వేల కుటుంబాలను ఆదుకుంటే ప్రజలు ఆదరిస్తారు అనుకుంటే, 4వేల కోట్లతో అభివృద్ధి చేశాను అనుకుంటే రాజీనామా చేయ్.పదో తారీకు వరకు రాజీనామా చేయకుంటే ఎక్కడికి రమ్మన్నా వస్తా బహిరంగ చర్చకు సిద్ధం. 4 వేల కోట్లు ఎక్కడ పెట్టి అభివృద్ధి చేశావో చెప్పు. పార్టీలో ప్రాధాన్యత తగ్గించినా ఓపికగా భరించాం.ఎమ్మెల్సీ ఆశ జూపి అవమానించారు. ఏ పార్టీ ఆదరించకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తా’ అని స్పష్టం చేశారు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు. -
టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి మంత్రి సోదరుడు!
సాక్షి, వరంగల్: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, టీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఇటీవల హుజూరాబాద్‌లో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యాక.. వరంగల్ తూర్పు బీజేపీ నేతలతోనూ ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా ధ్రువీకరించడంతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చేరిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది. రెండు వారాలుగా ఆయన అనుచరులు ‘అన్న బీజేపీలోకి వెళ్తున్నాడని’ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడంతోపాటు కలిసిన వారితో చర్చించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీనిపై ప్రదీప్‌రావు బుధవారం వరంగల్‌లో తన అనుచరులతో సమావేశం కానున్నారని సమాచారం. కాగా, పార్టీ మారడంపై ఆయన ఎక్కడా అధికారికంగా మాట్లాడలేదు. చదవండి: కేటీఆర్ కోసం సీనియర్లను కేసీఆర్ తొక్కేస్తుండు.. టీఆర్ఎస్కు రాజయ్య గుడ్‌బై -
వరంగల్ ఈస్ట్‌పై ఎర్రబెల్లి గురి..!
సాక్షి, వరంగల్ అర్బన్ : వరంగల్ తూర్పు నియోజకర్గ టెకెట్ కేసీఆర్ తనకు కేటాయిస్తారన్న నమ్మకముందని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. హంటర్‌రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి మాజీ మంత్రి బస్వరాజు సారయ్యపై స్వల్ప మెజార్టీతో ఓడియానని తెలిపారు. వరంగల్ తూర్పులో తనకు కార్యకర్తల బలం ఉందని.. టీఆర్ఎస్ తరుఫున పోటీచేస్తే తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తిరుగుబాటు ఎగరవేసిన కొండా దంపతులపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో తనకు టికెట్ ఇవ్వకున్నా కేసీఆర్ మాట ప్రకారం నడుచుకుని.. కొండా సురేఖను దగ్గరుండి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని తెలిపారు. అంతేకాకుండా తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి కొండా మురళీధర్ రావుని ఎమ్మెల్సీగా గెలిపించామని వెల్లడించారు. వారు గెలిచిన అనంతరం మూడేళ్లపాటు పార్టీ కార్యకర్తలను, కార్పొరేటర్లను తీవ్రం వేధింపులకు గురిచేశారని అన్నారు. చివరికి టికెట్ రాకపోవడంతో పార్టీపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వరంగల్ తూర్పు టికెట్ తనకు కేటాయించలేదని కొండా దంపతులు టీఆర్ఎస్పై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.