ఆయేషా మీరా కేసు పునర్విచారణకు సిట్
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణ బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో ఆయన్ను ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది.
ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడంలో పోలీసుల అలక్ష్యాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. పునర్విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణకు డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదించడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీఐజీ స్థాయి అధికారి సిట్‌కు నేతృత్వం వహిస్తారని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ ఆనురాధ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించనున్నారు.