నోకియా బుల్లి ఫోన్ కమింగ్ సూన్...
అప్పట్లో మొబైల్ ప్రపంచానికి ఐకానిక్ బ్రాండు. ఎప్పటికీ చెక్కుచెదరని డిజైన్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యత గల ఫోన్ గా మధ్యతరగతి ప్రజలతో ఎక్కువగా మమేకమైన నోకియా 3310, మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. బెర్సీలోనాలో జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ) 2017లో దీన్ని ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తుందట. ఈ ఫోన్ ను 2000లో మొదటిసారి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తీసుకురాబోతున్న ఈ ఫోన్ ధర సుమారు రూ.4173గా ఉండనున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లోకి రాబోతున్న ఫోన్లను ముందస్తుగా లీక్ చేసే ఇవాన్ బ్లాస్ ఈ విషయాన్ని తెలిపారు.
నోకియా ఫోన్లను ఉత్పత్తి చేయడానికి లైసెన్సు హక్కులను రాబట్టుకున్న హెచ్ఎండీ గ్లోబల్, ఫిన్నిస్ కంపెనీ దీన్ని ప్రవేశపెట్టబోతుందని పేర్కొన్నారు. నోకియా 3310 ఫోన్ అంటే అప్పట్లో ఎక్కువగా క్రేజ్ ఉండేది. దానికి గల కారణం, అది అందించే ఫీచర్లే. ఎస్ఎంఎస్ క్యారెక్టర్ కంటే ఎక్కువగా మెసేజ్ లు చేసుకునే సామర్ధ్యం, 84 x 48 పిక్సెల్ మోనోక్రోమ్ స్క్రీన్, స్క్రీన్ సేవర్స్, క్యాలిక్యులేటర్, గేమ్స్, ఏడు రింగ్ టోన్స్, వెనుక, ముందు వైపు ఎప్పడికప్పుడూ కవర్ మార్చుకుంటూ ఎప్పుడు కొత్త ఫోన్ లా మెరిసిపోయేలా చేసుకోవడం దీన్ని ప్రత్యేకతలు. అంతేకాక 55 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయగల ఫోన్ గా ఇది తెగ గుర్తింపు పొందింది.
దీంతో మళ్లీ ఈ ఫోన్ ను తీసుకొచ్చి లో ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తుందట.ఈ ఏడాది జనవరిలో నోకియా మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హెచ్ఎమ్డీ గ్లోబల్ నోకియా 6 పేరుతో ఓ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీనికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. రిలీజ్కు ముందే 14 లక్షల బుకింగ్స్ రావడం విశేషం. చైనా ఈకామర్స్ వెబ్సైట్ జేడీ.కామ్ ద్వారా ఈ ఫోన్లు విక్రయానికి ఉంచారు.