‘మార్పిడి’కి విరుగుడు చట్టమే
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఆగ్రా ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పార్టీలు... ‘మత మార్పిడుల వ్యతిరేక చట్టం’ ప్రతిపాదన వద్దకు వచ్చేసరికి పాక్షికంగా మూగబోయాయి. అలాంటి చట్టం ఆగ్రా త రహా ఘటనలు భవిష్యత్తులో జరిగితే దాన్ని సూటిగా క్రిమినల్ నేరంగా గుర్తిస్తుంది. ప్రలోభాలతో జరిపే మత మార్పిడులు ఎవరు చేసినా... హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధమతాలు ఏవి చేసేవైనా వాటికి అడ్డుకట్ట వేస్తుంది. మతం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంగా ఉండటమే ఆదర్శప్రాయం.
వేల ఏళ్ల వివాదాస్పద చరిత్ర గలిగిన సామాజిక సమస్యకు చట్టం ఎల్లవేళలా అత్యుత్తమ పరిష్కార మార్గం కాదు. అయితే ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ఘటనలను నియంత్రించలేవు. కొన్ని సందర్భాలలో, ఘటనలే ప్రభుత్వాలను నియంత్రిస్తాయి. ఆగ్రాలో పేదరికం, వలస రావడం సహా ఎన్నో రూపాలలోని ఒత్తిడుల కింద మనుగడ సాగిస్తున్న కొందరు ముస్లింలను ‘‘పునఃపరివర్తన’’ చెందించాలని కొందరు కరడుగట్టిన మతవాదులు భావించారు. ఈ ఘటన మత సంబంధాల విషయంపై అంతర్గతంగా పెల్లుబుకుతున్న అంతర్వాహినిని బయటకు తెచ్చింది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ స్పందన సూటిగానూ, గందరగోళానికి తావులేనివిధంగా, సుస్పష్టంగా ఉంది. అది సమస్యను మూలం నుంచి చర్చించింది. బలవంతపు మత మార్పిడుల నిరోధక చట్టాన్ని చేయడానికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరింది. ఇందులోని క్రియాత్మక పదం ‘బలవంతపు’. దీనితో న్యాయపరంగా గానీ లేదా నైతికపరంగాగానీ ఎలాంటి సమస్యా ఉండకూడదు. ఏ మత విశ్వాసమూ అందుకు అనుమతించదు.
బలవంతపు మత మార్పిడి అర్థరహితం
ఉదాహరణకు, ఖురాన్ ఈ విషయంలో చాలా విస్పష్టంగా ఉంది. సురా 2 వచనం 256 నిస్సంశయంగానూ, విస్పష్టంగానూ ఇలా చెప్పింది: ‘‘మతం లో ఎలాంటి నిర్బంధమూ ఉండనీయరాదు.’’ అబ్దుల్లా యూసఫ్ తన ప్రామాణిక అనువాదంలో ఆ అంశాన్ని ఇలా వివరించారు. ‘‘బలవంత పెట్టడానికి, మతానికి పొంతన కుదరదు. ఎందుకంటే మతం విశ్వాసంపై, అభీష్టంపై ఆధారపడినది. వాటిని బలవంతంగా ప్రేరేపించడం అర్థరహి తం...’’ గతంలో బలాన్ని ప్రయోగించి ఉంటే అది తప్పు. ఏది ఏమైనా ప్రజాస్వామిక సమాజంలో అందుకు తావులేదు. ఉదారవాద హిం దూ సిద్ధాంత, తత్వశాస్త్రాలలో సైతం బల ప్రయోగానికి సామంజస్యం లేదు. అలాంటి చట్టం తేవాలంటే పార్లమెంటే గాక, ఇతర సంస్థల మద్దతు కూడా కావాలని అనవచ్చు. విశ్వసనీయత గలిగిన మత నేతల వివేచనాయుతమైన అభిప్రాయాలను కోరడానికి వీలుగా ప్రభుత్వం ఈ చర్చ పరిధిని విస్తరించి, నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అప్పుడు మనకు ఎవరు, ఎక్కడ నిలుస్తారనేది తెలుస్తుంది. అయితే అంతిమంగా ఆ బాధ్య త పార్లమెంటుది, అందులో ప్రాతినిధ్యం వహించే పార్టీలది.
సభలో మూగబోయిన పార్టీలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఆగ్రా ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పార్టీలు ఈ ప్రతిపాదన వద్దకు వచ్చేసరికి పాక్షికంగా మూగబోయాయి. మత మార్పిడి వ్యతిరేక చట్టం ఆగ్రా త రహా ఘటనలు భవిష్యత్తులో జరిగితే దాన్ని సూటిగా క్రిమినల్ నేరాన్ని చేస్తాయి. ప్రలో భాలతో జరిపే మత మార్పిడులు ఎవరు చేసినా... హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధమతాలు ఏవి చేసేవైనా అడ్డుకట్ట వేస్తుంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వివిధ రకాల జనతాదళ్‌లు, మార్క్సిస్టుల లక్ష్యం ఇదేనని ఎవరైనా భావిస్తారు. వాస్తవానికి, మతం పట్ల మార్క్సిస్టుల సంశయాత్మకత వల్ల వారు ఈ అంశంపై ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని ఆశిస్తాం. కానీ అందుకు బదులుగా వారు దాన్ని వెనక్కునెట్టే వైఖరిని నర్మగర్భంగా చేపట్టారు. ఎందుకు?
పాలకపక్షం స్పష్టవైఖరి
ప్రధాని నరేంద్ర మోదీ నుండి ప్రారంభించి ప్రధానంగా ప్రభుత్వం తరఫున మాట్లాడిన వారంతా... ఎన్నికైన ప్రభుత్వం విధి... మంచి పరిపాలనను అందించడమే తప్ప, ఏ రూపంలోని మతతత్వాన్నీ ప్రోత్సహించడం కాదని స్పష్టంగా చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నాటి ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. వినిపిం చుకునే వారు ఎవరికైనాగానీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదే చెబుతూ వచ్చారు. నేటి భారతావనికి కావలసిందీ, అది డిమాండు చేసేదీ దేశం సౌభాగ్యవంతం కావడానికి రహదారే తప్ప, ఉద్వేగవాద రాజకీయాలు, విరోధాలు కావు. శాంతి లేనిదే సౌభాగ్యం కలగదని, శాంతి మొదలు కావాల్సింది ఇంటి నుంచేనని పామర జ్ఞానం చెబుతుంది.
పేదల సంక్షేమమే విధి
ప్రతి ప్రభుత్వమూ వచ్చేటప్పుడు తన సొంత పనికిరాని సామాన్ల బరువును మోసుకుంటూనే వస్తుంది. అయితే ఆ బరువు దాని ప్రయాణా నికి ఆటంకంకారాదు. నేటి మన కేంద్ర ప్రభుత్వం ఎక్కడికి పోవాలను కుంటోంది? దాని దృష్టి పథం విస్తృతి ఎంత? 2019లో తిరిగి ప్రజాతీర్పు ను కోరే నాటికి అది ఎక్కడ ఉండాలని కోరుకుంటోంది? సమాధానం విషయంలో గందరగోళానికి తావేలేదు. ప్రధాని తన తొలి లోక్‌సభ ఉప న్యాసంలోనే, పేదల సంక్షేమం కోసం కాకపోతే ప్రభుత్వం అవసరమేమిటి? అని చెప్పనే చెప్పారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలిచింది ‘అందరికీ అభివృద్ధి’ అనే సామాన్యమైన సందేశంతోనే. ‘అందరికీ’, అందులోనే మైనారిటీలూ ఉన్నారు. భారత ముస్లింలు ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని ఈ సందర్భంగా పదేపదే చెప్పారు. ఆ కేంద్ర సందేశంలోని ఏ భాగాన్నీ రవ్వంతైనా ఆయన మార్చిం ది లేదు. సందేశాన్ని పలచబారేట్టు లేదా గందరగోళపరచేట్టు చేసేవారు ప్రధాని మోదీకి ఏమీ మంచి చేయడం లేదు.
మతం వ్యక్తిగతమైనదే కానీ...
అసంబద్ధమైన ఈ గోలలో పడి ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో సంస్కరణలకు తిరిగి దిక్సూచిని నెలకొల్పగలిగిందనే విషయం మరుగున పడిపోయింది. సంశయవాదులకు సమాధానం చెప్పడానికి ఇన్సూరెన్స్ నిబంధనల్లో మార్పులు చాలు. జాతీయీకరణను తలకిందులు చేసే చర్య అంటూ వామపక్షం నుండి అలవాటు గా వినవచ్చే శబ్దాలెలా ఉన్నా బొగ్గు బిల్లు ఆమోదం పొందింది. ఇక జీఎస్టీకి సంబంధించి చిట్టచివరి ఆటంకం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుండి వచ్చింది. దీన్ని సైతం వర్షాకాల సమావేశాల నాటికి పరిష్కరించాల్సిందే.
బెంగాల్ ముఖ్యమంత్రి ఆందోళన, దేశం గురించో లేదా దేశ ఆర్థిక వ్యవస్థ గురించో కాదు. శారదా కుంభకోణానికి, ఆమె మంత్రివర్గ సహచరుడు మదన్ మిత్రాకు ఉన్న సంబంధాన్ని సీబీఐ కనిపెట్టడమే అందుకు కారణం. కెవ్వున కేకపెట్టడమే అందుకు సమాధానమని ఆమె దురదృష్టవశాత్తూ అనుకుంటున్నారు. కానీ ఓటరు అంతకంటే తెలివైన వాడని గుర్తించాలి. మతం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంగా ఉండటమే ఆదర్శప్రాయం. అదే సమయంలో ప్రజాజీవితానికీ ఓ గ్రంథం ఉంది... అది రాజ్యాంగం. రాజకీయాల ఏకైక కర్తవ్యం ప్రజలకు ఎక్కువ మేలు చేయడమే.