everyone
-
కరోనా ఎవరినీ వదిలి పెట్టదు : బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరూ బహుశా ఏదో ఒక సమయంలో కరోనావైరస్ మహమ్మారి బారిన పడక తప్పదని ఆయన పేర్కొన్నారు. వైరస్ ఎవరినీ వదిలిపెట్టదు..కాబట్టి భయం వద్దు దాన్ని ఎదుర్కోండి అంటూ చెప్పుకొచ్చారు. కరోనా మరణాల పట్ల విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన ప్రతిరోజు చాలా కారణాలతో జనం చనిపోతారు. అదే జీవితం అంటూ వేదాంత ధోరణి ప్రదర్శించడం గమనార్హం. కరోనావైరస్ నిర్ధారణ తరువాత బలహీనంగా ఉన్నానని, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నానని బోల్సొనారో చెప్పిన ఒక రోజు తర్వాత శుక్రవారం దక్షిణ రియో గ్రాండే దో సుల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కోవిడ్-19 ఒక సాధారణ ఫ్లూ లాంటిదే నని వ్యాఖ్యానించిన బోల్సొనారో, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందంటూ లాక్ డౌన్ ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. జూలై 7న బోల్సొనారోకు కరోనా సోకింది. 20 రోజులకు పైగా హోం ఐసోలేషన్ లో ఉంటూ అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలను చక్కబెట్టారు. 18 రోజుల్లో మూడుసార్లు పాజిటివ్ రాగా గత శనివారం నాల్గవసారి నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే ఆయన భార్య, ప్రథమ మహిళ మిచెల్ బోల్సొనారోకు వైరస్ సోకింది. అలాగే ఆయన ఇద్దరు సహాయకులతోపాటు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మంత్రి మార్కోస్ పోంటెస్ కు పాజిటివ్ వచ్చిందని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ఈ వైరస్ బారిన పడ్డారు. కాగా బ్రెజిల్ ప్రభుత్వ సమాచారం ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,662,485 గా ఉండగా, 92,475 మరణాలు సంభవించాయి. (బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా) -
ప్రతిఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలి
నేరడగం పీఠాధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామి మాగనూర్ : ప్రతి మనిషి తనకు ఉన్నదానిలో కొంత పేదలకు దానం చేయాలని, సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంపొందించాలని పశ్చిమాద్రి విరక్తమఠం పీఠాధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామి అన్నారు. శ్రావణ ఆఖరి సోమవారం సందర్భంగా కాంట్రాక్టర్ బెంగుళూర్ నాగిరెడ్డి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి మనిషి ఎంత సంపాదించిన చివరకు ఆయన వెంట ఏవీ రావని, మిగిలేది కీర్తి, ప్రతిష్టలేనని స్వామిజీ అన్నారు. అందుకు ప్రతిఒక్కరూ తనకు ఉన్నదానిలో కొంత దానం చేయడం వల్ల వారికి పుణ్యం లభిస్తుందని అన్నారు. అనంతరం స్వామిజీలతో పాటు ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్షీరలింగమహస్వామి, ఎంపీపీ ఆంజనమ్మ, జెడ్పీటీసీ సరిత మధుసూదన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ఆశిరెడ్డి, సర్పంచ్‌లు సూగమ్మ, లింగప్ప, ఆంజప్పగౌడ్, చెన్నప్పగౌడ్, మహదేవ్, ఎంపీటీసీ మునాఫ్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజప్పగౌడ్, నాయకులు కీరప్పగౌడ్, శివరాజ్పాటేల్, సిద్రాంరెడ్డి, వీరప్పగౌడ్, రాజు, రాంచందర్, శరణప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలని సీడీఎంఏ దాన కిశోర్ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణను వందశాతం అమలు చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీలో రెండుకు తగ్గకుండా మహిళా మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్, ఐజ మున్సిపల్ కమిషనర్లు భూక్యాదేవ్సింగ్, వెంకన్న, ఇంజనీరింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. -
400 ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం
డెహ్రాడూన్: సుమారు నాలుగు వందల ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం పాడింది. దేవాలయల్లో దళితులు, మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ డెహ్రాడూన్‌లోని ఓ ప్రసిద్ధ ఆలయం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం జౌన్సర్ బవర్ ఏరియాలోని పరుశురాం దేవాలయ అధికారులు ప్రజలందరూ ఆలయంలోకి అడుగు పెట్టొచ్చని తీర్మానించారు. భవిష్యత్తులో ఆలయ ప్రవేశానికి అందరికి అనుమతి ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటుగా దేవాలయ ఆవరణలో జంతు బలులను నిషేధించడం విశేషం. తాము గత 13 ఏళ్ల నుంచి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని దళిత నాయకుడు దౌలత్ కున్వర్ చెప్పారు. పరశురామ్ ఆలయం నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం చాలా ప్రగతిశీలమైందన్నారు. దేవాలయ అధికారులు నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన ఇతర దేవాలయాలు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం చాలా అవసరమని కమిటీ చైర్మన్ జవహర్ సింగ్ చౌహాన్ చెప్పారు. తమ ప్రాంతంలో అక్షరాస్యత రేటు గణనీయంగా పెరిగిందన్నారు. ఫలితంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. పురోగతి మార్గంలో పయనిస్తున్నారని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ మార్పును ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కాగా కేరళ లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళా భక్తుల నిషేధంపై వివాదం కొనసాగుతుంటే మరోవైపు ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ ఆలయం దేవాలయ పరిపాలనా అధికారులు నిర్ణయాన్ని పలువురు దళిత మేధావులు ప్రశంసించారు. -
పర్యాటకాభివృద్ధికి పంచసూత్రాలు
కార్తీకమాస సంరంభానికి బెజవాడలోని భవానీద్వీపం ముస్తాబైంది. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ద్వీపం కృష్ణానదీపాయలో.. పచ్చటి పచ్చిక బయళ్లలో.. చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరంగా గడపడానికి అనువైన స్థలం. అందుకే.. ఏటా వందల సంఖ్యలో వనసమారాధకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే, ఇక్కడ అడుగు పెట్టేపర్యాటకులకు మాత్రం అడుగడుగునా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో భవానీద్వీపాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన పంచసూత్రాలివీ.. - సాక్షి, విజయవాడ 1- ప్యాకేజీల్లో మార్పు అవసరం ఈ కార్తీకమాసంలో వందల సంఖ్యలో భవానీద్వీపానికి రానున్నారు. లక్షల్లో ఆదాయం రానుంది. అయితే, ఏపీటీడీసీ అధికారులు ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ప్యాకేజీల గురించి ప్రచారం చేసే ప్రయత్నం చేయలదు. యూత్రికుల కోసం ఏపీటీడీసీ రెండు ప్యాకేజీలు సిద్ధం చేసింది. ఒక్కొక్కరికీ రూ.200 చెల్లిస్తే భవానీద్వీపానికి బోటింగ్‌తో పాటు ద్వీపంలో తాలి (భోజనం) ఏర్పాటు చేస్తారు. రూ.280 చెల్లిస్తే బోటింగ్, తాలితో పాటు ఐస్‌క్రీమ్, స్వీట్, సలాడ్ ఇస్తారు. రూ.50 చెల్లిస్తే కేవలం బోటింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. ఇలా మొక్కుబడి ప్యాకేజీల కంటే.. పర్యాటకులకు భవానీద్వీపంలో ఆటలు పోటీలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తే బాగుంటుంది. ద్వీపంలోనే హస్తకళాకారుల షాపులను ఏర్పాటుచేస్తే పర్యాటకులు షాపింగ్ చేసే వెసులుబాటు కూడా కలుగుతుంది. 2- మరిన్ని సౌకర్యాలు కల్పించాలి కార్తీకమాసంలో భవానీద్వీపానికి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తగినన్ని మరుగుదొడ్లు నిర్మించాలి. ద్వీపానికి వచ్చిన వారంతా మినరల్ వాటర్ కొనుగోలు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల తాగునీటి సౌకర్యం కల్పించాలి. గత ఏడాది పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో భోజనాల వద్ద తోపులాట జరిగింది. అలాకాకుండా ద్వీపంలోనే నాలుగైదు చోట్ల భోజన ఏర్పాట్లు చేయాలి. పర్యాటకులందరికీ సరిపడా భోజనాలు సిద్ధం చేయూలి. ఎండలో ఇబ్బంది పడకుండా షామియానాలు సిద్ధంచేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. నదివైపు చిన్నారులు వెళ్లకుండా సెక్యూరిటీని పెంచాలి. 3- అధికారులు శ్రద్ధ పెట్టాలి ఏవిధమైన సౌకర్యాలు లేకపోయినా కార్తీకమాసంలో భవానీద్వీపానికి లక్షకుపైగా పర్యాటకులు వస్తారని లెక్కలు చెబుతున్నాయి. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఐదు నుంచి పదివేలమంది, సాధారణ రోజుల్లో వెయ్యిమంది వరకు పర్యాటకులు వస్తారు. గత ఏడాది కార్తీకమాసానికి ఏమాత్రం ప్రచారం చేయకపోయినా రూ.16లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఏమాత్రం శ్రద్ధ చూపినా రూ.25లక్షలు దాటే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా ప్రయత్నాలు చేయడం మంచిది. 4- ప్రచారమే ప్రధానాస్త్రం పర్యాటకుల కోసం ఏపీటీడీసీ అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలి. కొత్త ప్యాకేజీలను జనం ముందుకు తీసుకెళ్లాలి. వనభోజనాలకు అధికంగా వచ్చే ఉద్యోగుల కోసం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయూలు, కార్పొరేట్ సంస్థల్లో ప్రచారం నిర్వహించాలి. ద్వీపంలో ఆహ్లాదంగా గడిపేందుకు ఉన్న అవకాశాలను వివరించాలి. కార్పొరేట్ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తే మంచిది. ఏపీటీడీసీ బస్సును జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపితే ఆదాయం పెరుగుతుంది. 5- బోటులో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేయూలి భవానీద్వీపానికి వచ్చే చాలామంది పర్యాటకులు బోటు షికారుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం భవానీపురంలోని బరంపార్కు వద్ద ప్రారంభమయ్యే బోటు సుమారు 10 నిమిషాల్లో భవానీద్వీపానికి చేరుస్తుంది. అలాకాకుండా.. టికెట్ రేటు పెంచయినా సరే.. బోటు నదిలో రెండు మూడు రౌండ్లు తిరిగేలా బోటు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మధ్యమధ్యలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, బోటులోనే రకరకాల పోటీలు, విజేతలకు బహుమతులు అందిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పై అంశాలపై దృష్టి పెడితే.. భవానీ ద్వీపానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించి ఓటు హక్కు కల్పించాలని ఓటరు నమోదు పరిశీలకుడు శశిధర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల నమోదులో రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని పేర్కొన్నారు. మండలాల వారీగా నమోదు చేయాల్సిన ఓటర్లు ఎంత మంది, ఇప్పటి వరకు ఎంత మందిని నమోదు చేశారనేది తహశీల్దార్లు, ఆర్డీవోలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో ఎక్కువగా మరాఠి ప్రజలు ఉన్నారని, ప్రతి ఫారం అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ.. 1.73 లక్షల ఓటర్లు నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 70 వేల మందిని నమోదు చేశామన్నారు. ఓటర్ల నమోదుకు ప్రతి మండల కేంద్రం ఓ కంప్యూటర్ సిస్టం, ఆపరేటర్‌ను ఇవ్వాలని కోరారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, చక్రధర్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, తహశీల్దార్లు రమేష్, రాజేశ్వర్‌రెడ్డి, మోతీరాం, నాయకుడు బండి దత్తాత్రి పాల్గొన్నారు.