400 ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జౌన్సర్ బవర్ ఏరియాలోని పరుశురాం దేవాలయ అధికారులు ప్రజలందరూ దేవాలయంలోకి అడుగు పెట్టొచ్చని తీర్మానించారు.
డెహ్రాడూన్: సుమారు నాలుగు వందల ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం పాడింది. దేవాలయల్లో దళితులు, మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ డెహ్రాడూన్లోని ఓ ప్రసిద్ధ ఆలయం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం జౌన్సర్ బవర్ ఏరియాలోని పరుశురాం దేవాలయ అధికారులు ప్రజలందరూ ఆలయంలోకి అడుగు పెట్టొచ్చని తీర్మానించారు. భవిష్యత్తులో ఆలయ ప్రవేశానికి అందరికి అనుమతి ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటుగా దేవాలయ ఆవరణలో జంతు బలులను నిషేధించడం విశేషం.
తాము గత 13 ఏళ్ల నుంచి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని దళిత నాయకుడు దౌలత్ కున్వర్ చెప్పారు. పరశురామ్ ఆలయం నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం చాలా ప్రగతిశీలమైందన్నారు. దేవాలయ అధికారులు నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన ఇతర దేవాలయాలు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.
మారుతున్న ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం చాలా అవసరమని కమిటీ చైర్మన్ జవహర్ సింగ్ చౌహాన్ చెప్పారు. తమ ప్రాంతంలో అక్షరాస్యత రేటు గణనీయంగా పెరిగిందన్నారు. ఫలితంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. పురోగతి మార్గంలో పయనిస్తున్నారని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ మార్పును ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
కాగా కేరళ లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళా భక్తుల నిషేధంపై వివాదం కొనసాగుతుంటే మరోవైపు ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ ఆలయం దేవాలయ పరిపాలనా అధికారులు నిర్ణయాన్ని పలువురు దళిత మేధావులు ప్రశంసించారు.