evolved
-
మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో ఉత్పత్తి అయిన రెండు అధునాతన స్మార్ట్ఫోన్లను ప్రీమియం బ్లాక్‌బెర్రీ గురువారం మార్కెట్లో విడుదలచేసింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 5.99 అంగుళాల డిస్ప్లేతో ఈ రెండు ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు భారత్‌లో బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ తెలిపింది. ఎవాల్వ్ ఎక్స్ పేరిట విడుదలైన మొబైల్ ధర రూ.34,990 కాగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత స్టోరేజీ స్పెషల్ ఫీచర్స్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఎవాల్వ్ ధర రూ.24,990గా నిర్ణయించింది. ఈ నెలాఖరులో ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. -
పిల్లలు అందుకే ముద్దొస్తారు!
లండన్: చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికైనా దగ్గరకు తీసుకోవాలనిపిస్తోంది. వాళ్లను మద్దు చేయాలనిపిస్తుంది. వారి పెద్దపెద్ద కళ్లు, పాల బుగ్గలు, బోసినవ్వు వీటన్నింటిలో ఉన్న ఆకర్షణను వర్ణించలేము. అయితే ఈ ఆకర్షణ వెనుకాల పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. సాధారణంగా చిన్న పిల్లలకు పెద్దవారి నుంచి ఎక్కువ సంరక్షణ అవసరం. ప్రతీ అంశంలో వారి అవసరాలను పెద్దవారే గుర్తించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్దవారి నుంచి ఈ అదనపు కేర్‌ను పొందటానికి.. చిన్నపిల్లలు ఆకర్షణగా కనిపించే అంశం దోహదం చేస్తుందని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ క్రింగల్బాచ్ తెలిపారు. పురుషులు, స్త్రీలు అనే భేదం లేకుండా పిల్లలు అందరినీ ఆకర్షించడానికి కారణం వారికి కావాల్సిన 'సంరక్షణ' అని పరిశోధకులు వెల్లడించారు. చిన్నపిల్లలు చేసే శబ్దాలు, కదలికలు లాంటివి సైతం పెద్దవారిని ఆకర్షించేలా ఉండటానికి కారణం ఇదేనన్నారు. జీవపరిణామంలో సైతం 'క్యూట్‌నెస్' అనే అంశం రక్షణ విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలను 'ట్రెండ్స్ ఇన్ కాగ్నిటీవ్ సైన్సెస్' జర్నల్‌లో ప్రచురించారు.