exclusive interviews
-
నన్ను కాంప్రమైజ్ అవ్వమన్నారు: నటి
‘రోడ్డు మీద కనిపించిన రూపాన్ని చూసి వెంటనే మోహించడం.. ప్రేమ పేరుతో వల వేయడం.. మోజు తీరాక వదిలేసి మొహం చాటేయడం’... ఇవన్నీ చేయడం కొందరు అబ్బాయిల పనే కదా! అదే పని ఓ అమ్మాయి చేస్తే... వినడానికే ఆశ్చర్యం అనిపించే ఈ వి‘చిత్రం’ చూడ్డానికి ఇంకెలా ఉంటుంది? మరి అలాంటి అమ్మాయి పాత్రని తెరపై పండించడం ఇంకెంత సాహసం అనిపిస్తుంది? ఆ సాహసం చేసింది కాబట్టే పాయల్ రాజ్‌పుత్ సూపర్ పాపులర్ అయింది. ఈ పంజాబీ అమ్మాయి ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగాళ్ ఇమేజ్ సంపాదించుకుంది. ‘అదొక స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను వ్యక్తిగతంగా స్ట్రాంగ్. అయితే ‘ఇందూ’ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని మాత్రం అస్సలు ఇష్టపడను’ అంటున్న పాయల్ .. ‘తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ (సినిమా ఆఫర్లు ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం) కచ్చితంగా ఉంది. ఇది నన్ను బాగా డిసప్పాయింట్ చేస్తోంది. ‘ఆర్ఎక్స్100’ పెద్ద హిట్టయి, నాకు పేరొచ్చిన తర్వాత కూడా నన్ను కాంప్రమైజ్ అవ్వమంటూ అడుగుతున్నారు. ఈ మాటను తప్పకుండా పబ్లిష్ చేయండి. ఐ మీన్.. ఇది క్యాస్టింగ్ కౌచ్ గురించి. ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇలాంటి ప్రపోజల్‌తో నాలుగు రోజుల క్రితమే ఒకరు కలిశారు. బహుశా ఫస్ట్ మూవీలోనే బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్ల అలా అనుకుంటున్నారో ఏమో! కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ టాలెంట్‌తో ఈ పొజిషన్లో ఉన్నాను. అంతే తప్ప.. కాంప్రమైజ్ అయ్యో, మరో విధంగానో కాదు’’ అంటోంది పాయల్ రాజ్‌పుత్. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు.. పుట్టి పెరిగింది ఢిల్లీలో. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్స్. నాకు ఒక సోదరుడు. మాది చిన్న హ్యాపీ ఫ్యామిలీ. సినిమాల మీద చిన్నప్పటి నుంచి ఇష్టమే. అయితే కాలేజీకి ముందు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. పిరికిదాన్ని కూడా. అక్కడి నుంచే సెల్ఫ్‌మేడ్ ఉమన్‌గా మారాను. చదువుతూనే ట్యూషన్లు చెబుతూ మోడలింగ్ చేశాను. మోడలింగ్ నుంచి టీవీ రంగంలోకి ప్రవేశించాను. అలా తర్వాత పంజాబీ సినిమాలు చేశాను. అక్కడ మంచి పేరు రావడంతో ఇప్పుడు కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నాను. ఇందూ.. అందరికీ నచ్చేసింది.. ‘ఆర్ఎక్స్ 100’లో ఇందూ పాత్ర అంగీకరించేటప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలైన మాట వాస్తవం. ఇందూ క్యారెక్టర్ విన్నప్పుడు ‘ఓమై గాడ్’ అనుకున్నాను. పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర కాదిది. తెస్తే మంచి పేరు తేవొచ్చు.. లేదా నా పేరు చెడగొట్టొచ్చు. తెలుగులో ఆరంభ చిత్రంలోనే పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ పోషించడమంటే... అది ప్రమాదకరమైన నిర్ణయం కావచ్చు. పైగా సినిమాలో శృంగార దృశ్యాలు కూడా ఆలోచింపజేశాయి. మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. దీనిపై మా అమ్మానాన్నతో కూర్చొని చర్చించాను. పాత్ర నచ్చిందని, నా మీద నమ్మకం ఉంచమని చెప్పాను. నాన్న తొలుత కొంచెం డిస్ట్రబ్ అయినా... చివరికి అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ నాతో కలిసి సినిమా చూశారు. ఆమెకు ఏమీ అభ్యంతరం అనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్ చేసినందుకు ఐ ఫీల్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే పబ్లిక్ ఇందూని బాగా లవ్ చేస్తున్నారు. నిజానికి పంజాబీ సినిమాల్లో నా పాత్రలన్నీ చాలా ఒద్దికగా, సిగ్గరి అయిన అమ్మాయి పాత్రలే. ప్రస్తుతం అమ్మాయిలు బాగా డామినేటింగ్‌గా, చాలా తెలివిగా కూడా ఉంటున్నారు. కొందరైతే మగవాళ్ల కంటే కన్నింగ్‌గా కూడా ప్రవర్తిస్తున్నారు. కాని నిజ జీవితంలో ఇందూ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయెవరూ నాకు తారస పడలేదు. ఒకవేళ పరిచయమైనా... నేను దూరం పెట్టేస్తాను. డబుల్ ధమాకా.. నాలుగేళ్ల క్రితం దక్షిణాదిలో తొలిసారి తమిళ సినిమా చేశాను. అయితే ఏవో సమస్యలతో అది విడుదల కాలేదు. ఆ తర్వాత కూడా సౌత్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఒక డిఫరెంట్ రోల్ కోసం వెయిట్ చేశాను. అందుకే ‘ఇందూ’ పాత్రకు ఓకే చెప్పా. చాలా బాగా ప్రారంభమై.. అంతే బాగా ముగిసింది ‘ఆర్ఎక్స్ 100’ జర్నీ. ఈ నెల 15న నా పంజాబీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్టర్ 420’ కూడా రిలీజైంది. అదీ మంచి హిట్టయింది. ఇటు ‘ఆర్ఎక్స్ 100’, అటు పంజాబీ సినిమా రెండూ హిట్ కావడంతో నాకు డబుల్ ధమాకా అన్నమాట. ‘హీరోయిన్’ నా డ్రీమ్ రోల్... ఆఫర్స్ బాగా వస్తున్నాయి. అయితే నేను ఏవి పడితే అవి అంగీకరించను. ఇందూ హిట్టయింది కాబట్టి... అన్నీ అదే రకమైన నెగెటివ్ క్యారెక్టర్స్ చేయను. ఒకదానికి ఒకటి పొంతన లేని పాత్రలు చేయాలని ఉంది. ఒక అమ్మాయిగా నేను చాలా స్ట్రాంగ్. అందుకేనేమో... పవర్ఫుల్ రోల్స్, ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీస్ అంటే ఇష్టం. ‘హీరోయిన్’ అనే సినిమాలో కరీనా కపూర్ చేసిన క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉంది. ఒక యువతి సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పట్టే అలాంటి పాత్ర ప్రస్తుతానికి నా డ్రీమ్ రోల్ అని చెప్పొచ్చు. ఓ రకంగా ఇందూ కూడా డ్రీమ్ రోల్ లాంటిదే. నేను నార్త్ ఇండియన్ అయినా నా ఫేస్ సౌతిండియన్లా ఉంటుంది అంటున్నారు. బహుశా మా అమ్మ గారి ఫీచర్స్ వల్ల అలా అనిపిస్తున్నానేమో. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా గుడ్ స్క్రిప్ట్, గుడ్ డైరెక్షన్, మంచి పాత్రలకే నా ప్రాధాన్యత. ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి లాంటి దర్శకులు చాలా తక్కువ. ఆయన ఈ సినిమాలో నన్ను అద్భుతంగా పోట్రైట్ చేయించారు. అతనితో మరిన్ని మూవీస్ చేయాలని ఉంది. సిటీలో సెటిల్ అవుతానేమో... స్వీట్స్ అంటే బాగా ఇష్టం. సౌతిండియా ఫ్రెండ్ నుంచి నిన్నే నాకు పెద్ద స్వీట్ ప్యాకెట్ కూడా వచ్చింది (నవ్వుతూ). ఏవి తిన్నా, రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తాను. అన్నింటికన్నా యోగాసనాలు బాగా ఇష్టం. ఈ మధ్య పంజాబ్, హైదరాబాద్ ఎక్కువగా తిరగడం వల్ల 10కిలోలు పెరిగాను. మళ్లీ తగ్గాలి. ప్రస్తుతం ముంబైలో నివస్తున్నాను. కానీ ఐ లవ్ హైదరాబాద్. ఏమో భవిష్యత్తులో ఇక్కడే సెటిల్ అవుతానేమో చెప్పలేను. ఇక్కడ నాకు స్నేహితులు కూడా ఏర్పడ్డారు. తెలుగులో నా తర్వాతి సినిమా గురించి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. అది అక్టోబరులో ప్రారంభమై డిసెంబరులో రిలీజ్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. ఇంతకు మించి వివరాలు ఇప్పుడే చెప్పలేను. ఐ యామ్ ప్రొఫెషనల్.. ఇకపై కూడా ‘ఆర్ఎక్స్ 100’లో లాంటి బోల్డ్ సీన్స్ ఉన్న పాత్రలు చేస్తారా అంటే... అది దర్శకుడు నాకు నా పాత్ర గురించి, సినిమా కథకు అవెంత వరకు అవసరమో చెప్పి కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే అందరూ గుర్తించాల్సింది ఏమిటంటే... ఇక్కడకి నేను నటించడానికి వచ్చాను. మంచి పాత్ర ఇస్తే... నా సత్తా ఏమిటో చూపిస్తా. ఉత్తరాది అమ్మాయిని కాబట్టి ఇన్హిబిషన్స్ తక్కువగా ఉంటాయి. అయితే నేను పూర్తిగా ప్రొఫెషనల్‌ని అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరినీ ముద్దు పెట్టుకోవడానికి నేనిక్కడికి రాలేదు. -
గ్లోబల్ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలి
గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ బాల వి.బాలచంద్రన్ దేశంలో ఎంబీఏ, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్యార్థులు దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూనే.. గ్లోబల్ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కోవడానికి వీలవుతుంది అంటున్నారు గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ బాల వి.బాలచంద్రన్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో దశాబ్దాల టీచింగ్ అనుభవం ఉన్న ఆయన ప్రపంచ ప్రఖ్యాత కెల్లాగ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో అకౌంటింగ్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ వంటి ఉన్నత హోదా సొంతం చేసుకున్నారు. ఇంకా ఐఎస్బీ-హైదరాబాద్ ఏర్పాటులో, ఎండీఐ-గుర్గావ్లో ఎంబీఏ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రొఫెసర్ బాల వి.బాలచంద్రన్‌తో మేనేజ్మెంట్ విద్యపై ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఫ్యాకల్టీ కొరత తీరితేనే పరిష్కారం మేనేజ్మెంట్ కోర్సులు, బి-స్కూల్స్ విషయంలో దేశం ముందంజలో నిలుస్తోందనేది నిస్సందేహం. ఐఐఎంలు, ఐఎస్బీ వంటి ఎన్నో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లు దేశంలో ఉన్నాయి. విద్యార్థుల్లోనూ చక్కటి ప్రతిభ కనిపిస్తోంది. వారు ఎంఐటీ, హార్వర్డ్, కెల్లాగ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీల విద్యార్థులతో పోటీ పడేలా నైపుణ్యాలు సొంతం చేసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ వేధిస్తున్న సమస్య ఫ్యాకల్టీ కొరత. బి-స్కూల్స్‌లో ఆశించిన స్థాయిలో, అవసరాలకు తగిన రీతిలో ఫ్యాకల్టీ సంఖ్య లేదు. ఫ్యాకల్టీ కొరతకు అరకొర ఆర్థిక ప్రోత్సాహకాలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రీసెర్చ్ ఇన్సెంటివ్స్ వంటివి కూడా పెద్దగా ఉండవు. దాంతో నిపుణులు ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాలి. మంచి ఫ్యాకల్టీ ఉంటే మరెన్నో లాభాలు ఫ్యాకల్టీకి ప్రోత్సాహకాలు అందిస్తే బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులకు, సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతోపాటు క్వాలిటీ రీసెర్చ్, పేపర్స్ పబ్లికేషన్స్పట్ల ఉత్సాహం చూపుతారు. వాస్తవానికి విద్యార్థులకు నాణ్యమైన కోర్సులు అందించే దిశగా ఇన్స్టిట్యూట్లకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. అన్నిటికీ మించి సామాజిక అవసరాలూ విస్తృత స్థాయిలో నెరవేరుతాయి. గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్స్‌తో పోటీ పడాలంటే మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ కోర్సు ఏదైనా.. ఒక ఇన్స్టిట్యూట్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే మూడు ముఖ్య అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ ఫ్యాకల్టీ, క్వాలిటీ కరిక్యులం. ఈ అంశాల్లో కొన్ని లోపాల కారణంగానే మన ఇన్స్టిట్యూట్లు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయి. ఐఐఎంలు తదితర ప్రముఖ విద్యా సంస్థలు మంచి ఇన్స్టిట్యూట్లుగానే పేరు పొందుతున్నాయి. కానీ గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉండట్లేదు. కరిక్యులం.. సొంత శైలిలో ప్రస్తుతం దేశంలోని బి-స్కూల్స్‌లో కోర్సుల కరిక్యులంలో ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరముంది. ఆధునిక యుగంలోనూ అనేక ఇన్స్టిట్యూట్లు ‘కాపీ-పేస్ట్’ విధానంలో కరిక్యులంను రూపొందిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని పేరున్న కళాశాలల కరిక్యులంను యథాతథంగా అనుసరించడం మంచిది కాదు. దీనివల్ల ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మన అవసరాలకు తగ్గట్టు సొంత శైలిలో మేనేజ్మెంట్ కరిక్యులం రూపకల్పన జరగాలి. మనకు మూడు వేల ఏళ్ల చరిత్ర గల అకడమిక్ వారసత్వం ఉంది. ఇదే మన సొంత శైలిలో కరిక్యులం రూపకల్పనకు చక్కటి మార్గ నిర్దేశకంగా నిలుస్తోంది. సొల్యూషన్ ఓరియెంటేషన్ కావాలి మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రస్తుతం అధిక శాతం థియరిటికల్ అప్రోచ్ లేదా ప్రాబ్లమ్ ఓరియెంటేషన్‌తో ఉంటున్నాయి. సమస్యకు కారణాలు తెలుస్తున్నాయి కానీ పరిష్కార మార్గాలు తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది సొల్యూషన్ ఓరియెంటెడ్ లెర్నింగ్. పాశ్చాత్య దేశాల్లో అనుసరిస్తున్న విధానం ఇదే. అక్కడ ప్రాబ్లమ్తోపాటు సదరు సమస్య పరిష్కార మార్గాలపైనా అవగాహన లభించేలా బోధన, కరిక్యులం ఉంటుంది. అలాంటి విధానమే మన దేశ పరిస్థితులు, స్థానిక అవసరాలకు తగ్గట్టు రూపొందించి అమలుచేయాలి. ఈ విషయంలో విద్యార్థులు సైతం చొరవతో స్వీయ అభ్యసన శైలిని అలవర్చుకోవాలి. ఇంటర్నెట్ యుగంలో గూగుల్, వికీపీడియా వంటి ఎన్నో మాధ్యమాల ద్వారా నాణ్యమైన సమాచారం లభిస్తోంది. దీన్ని అందిపుచ్చుకుంటే అకడమిక్‌గా మరింత నైపుణ్యం లభిస్తుంది. ప్రయోజనం చేకూర్చే లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ప్రొఫెషనల్ విద్యార్థుల్లో స్కిల్స్ విషయంలో ప్రయోజనం చేకూర్చేవి లీడర్షిప్, టాలెంట్ ప్రోగ్రామ్స్. ఇందుకోసం ఇండస్ట్రీలు, అకడమిక్ ఇన్సిట్యూట్‌లు భాగస్వాములు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మన దేశంలో టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ తదితర ప్రముఖ కార్పొరేట్ సంస్థలు వీటి ఆవశ్యకతను గుర్తించి విద్యా సంస్థలతో ఒప్పందాల ద్వారా లీడర్షిప్, టాలెంట్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇవి మరింత విస్తృతం కావాలి. దీర్ఘకాలిక వ్యూహంతో వ్యవహరించాలి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల అంతిమ లక్ష్యం చక్కటి ఉద్యోగం. ఆకర్షణీయమైన వేతనాలు పొందడం. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ కేవలం ఉద్యోగ కోణానికే కెరీర్ ఆలోచనను పరిమితం చేసుకోకూడదు. అకడమిక్ ఎక్స్‌లెన్స్‌కు కాల పరిమితి లేదని గుర్తించాలి. అందుకోసం నిత్య నూతనంగా వ్యవహరించాలి. నిరంతరం అప్డేట్ అవుతుండాలి. స్కిల్ సెట్ విషయంలో ఇతరుల కంటే ముందుండేలా పోటీతత్వాన్ని సైతం అలవర్చుకోవాలి. మంచి మేనేజర్‌గా ఎదగాలంటే మేనేజ్మెంట్ విద్యార్థులకు అకడమిక్, కెరీర్ పరంగా తప్పనిసరిగా అవసరమైన స్కిల్స్ రెండు. అవి.. ఇన్నోవేషన్, క్రియేటివిటీ. బ్లాక్ అండ్ వైట్ అప్రోచ్ నుంచి బయటపడాలి. ఒక అంశంలోని సానుకూల, ప్రతికూల అంశాలను, వివిధ మార్గాలను గుర్తించే విధంగా ఆలోచన శైలిని మార్చుకోవాలి. అప్పుడు కచ్చితంగా మంచి మేనేజర్లుగా తమను తాము తీర్చిదిద్దుకోగలుగుతారు. -
కెమెరా లెన్స్...రంగు భేదం ఎరగదు!
నాటి సావిత్రి, వాణిశ్రీ, స్మితాపాటిల్ నుంచి నేటి బిపాస బసు వరకు చిత్రసీమను ఏలినవారంతా చామనచాయతో ఆకట్టుకున్నవారే! రంగు తక్కువ అని బాధపడేవారినే కెమెరా కన్ను ఎక్కువగా ప్రేమించింది. ఇంకా ప్రేమిస్తోంది. ‘మేని రంగు తెలుపా, నలుపా కాదు కెమెరా లెన్స్‌కి కావల్సింది వారి ముఖ కవళికలు, శరీరాకృతి, నటన.. ’ అన్నారు అరవింద్ ఛెంజి. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ అంటే అంతగా పరిచయం లేని కాలంలోనే అరవింద్ ఛెంజి కెమెరా చేతబట్టారు. అప్‌కమింగ్ మోడల్స్‌కు పర్సనల్ పోర్ట్ ఫోలియోలు డిజైన్ చేయడం దగ్గర్నుంచి... అందాల రాణుల స్పెషల్ ఫొటో షూట్ల దాకా ‘ఫ్యాషన్ క్లిక్స్’కు కేరాఫ్‌గా మారారు. దాదాపు మూడున్నర దశాబ్దాల కెరీర్లో ఆయనకు తెలియని ఫ్యాషన్ అరుదే అని చెప్పాలి. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఎలా ఉండాలో సరికొత్త లెన్స్‌లో చూపించిన ఈ డౌన్ టు ఎర్త్ ఫొటోగ్రాఫర్‌తో ‘సాక్షి ఫ్యామిలీ’ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. ప్రసిద్ధ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా పేరున్న మీరు, ఈ రంగంలోకి ఎలా వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం? అరవింద్ ఛెంజి: మా పూర్వీకులు మహారాష్ట్రీయులైనా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! నాన్న ఇంజినీర్, అమ్మ డాక్టర్. చెల్లెలు బిజినెస్ రంగంలో ఉంది. ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. నాకే కెమెరా అంటే పిచ్చి. ఇలాగే చదవాలనే ఆంక్షలు లేవు. అమ్మ, నాన్న ఆంక్షలు పెట్టలేదు. బీఎస్సీ చేశాను. కెమెరా పట్టడానికి ముందు నాకు నలుగురిలో కలవాలంటే అపరిమితమైన సిగ్గు. ఎవరినీ పలకరించేవాడిని కాదు. కనీసం మా చెల్లెలు స్నేహితులు వచ్చినా వారి ముందుకూ వెళ్లేవాడిని కాదు. ఆడవాళ్లకు ఆమడదూరం ఉండేవాడిని. అలాంటిది కెమెరా పట్టాక ఇతరులతో సంభాషించడం, అందరితో కలిసిపోవడం నేర్చుకున్నాను. తప్పదు, ఫొటోగ్రఫీలో మాటే ముఖ్యం. క్లైంట్స్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటేనే, వారూ ఫ్రీగా ఉండగలుగుతారు. లేదంటే ఫొటో అనగానే బిగుసుకుపోతారు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు.. ఇలా అందరితోనూ వారి వారి మనస్తత్వానికి తగినట్టుగా మారిపోతాను. ఒకరకంగా చెప్పాలంటే కెమెరా పట్టుకున్న సైకాలజిస్ట్ అని చెప్పవచ్చు. మీరు కెమెరా పట్టుకున్నప్పటి రోజులు, ఇప్పటి రోజులు ఫొటోగ్రఫీలో వచ్చిన మార్పులు? అరవింద్: ఈ రంగంలో దాదాపు 35 ఏళ్లు దాటిపోయాయి. నాకు గురువెవ్వరూ లేరు. సొంతంగా నేర్చుకున్నాను. ఒకప్పుడు ఫొటోగ్రఫీ అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అని మాత్రమే అనుకునేవారు. అలాంటిది ఇప్పుడా పదానికి అర్థమే మారిపోయింది. ఫొటోగ్రఫీ ఎంత విస్తృతమైనదో చాలామందికి తెలిసొచ్చింది. ఈ పదేళ్లలో చాలా మంచి మార్పులు వచ్చాయి. ఫొటోగ్రాఫర్లకు మంచి ఇమేజ్ రావాలని తపించాను. అలాంటి రోజులనే ఇప్పుడు చూస్తున్నాను. ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి, ఇతర ఫొటోగ్రఫీకి వ్యత్యాసం? అరవింద్: ఫ్యాషన్ మాత్రమే కాదు, ఫుడ్, ప్రకటనలు, ఎడిటోరియల్ ఫొటోలూ తీస్తుంటాను. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో గ్లామరే ప్రధానం. అందంగా చూపించడానికే ప్రయత్నిస్తుంటాం. అయితే ఇదంతా ముందే సెట్ చేసుకొని, ఒక అవగాహన ప్రకారం ఫొటోలు తీయడం. అదే ఎడిటోరియల్ ఫొటోగ్రఫీ అయితే ఒక కథ చూపించగలగాలి. ఇది ముందుగా సెట్ చేసుకున్నది కాదు. జరుగుతున్నదే ఫొటోలో చూపించగలగాలి. అందుకే ఎడిటోరియల్ ఫొటోగ్రఫీని బాగా ఇష్టపడతాను. మీరు చాలామంది మోడల్స్ ఫొటోలు తీశారు. మోడల్స్ అంటే అందంగా ఉంటే చాలా? అరవింద్: అందం ఒక్కటే సరిపోదు. ‘నేను అందమైన అమ్మాయిని, అబ్బాయిని’ అనుకొని ఈ రంగంలోకి వచ్చేస్తుంటారు. అందం పుట్టుకతో వస్తుంది. దానికి మెరుగుపెట్టాలి. చాలా కష్టపడాలి. ఉదాహరణకు బాలీవుడ్ నటుడు హృతిక్రోషన్నే తీసుకుంటే.. ఇటీవల ఓ సినిమా కోసం అతను బరువు పెరగాల్సి వచ్చింది. అందుకోసం ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సమోసా తిన్నాడట. అంటే ఈ రంగంలో ఎంతో త్యాగం చేయాల్సి ఉంటుంది. శరీరాకృతి, చర్మనిగారింపు... అన్నీ బెస్ట్‌గా ఉండాలి. అందుకు ఆహారనియమాలు పాటించాలి. వ్యాయామాలు చేయాలి. దీంతో పాటు వారి ముఖంలో భావాలు ఒలికించాలి. యాక్షన్ ఉంటేనే ఈ రంగంలో బాగా రాణించగలరు. నా పని వల్ల క్లయింట్ బిజినెస్ పెరగాలనుకుంటాను. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో తాజాగా వచ్చిన మార్పులేంటి? భవిష్యత్తు? దీని కింద ఏయే విభాగాలొస్తాయి? అరవింద్: ఇప్పుడంతా డిజిటల్స్. పని సులువయ్యింది. విభిన్నత చూపించడం పెరిగింది. ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి ఎప్పుడూ ఆదరణ పెరుగుతుందే తప్ప, తగ్గదు. బ్యూటీ కూడా ఫ్యాషన్ కిందకే వస్తుంది. ఫొటోగ్రాఫర్ పని ఒక్కదానికే పరిమితం అనేది ఉండదు. ఒక జనరల్ డాక్టర్ లాగే అన్ని అంశాలలోనూ ప్రావీణ్యత సాధించాలి. వ్యక్తి రూపంలో ఉన్న లోపాలను ఫొటోలు తీసే విధానంలో కవర్ చేయవచ్చా? అరవింద్: లోపం లేకుండా ఎవరూ ఉండరు. అలాగని లోపాలను కప్పి పెట్టి ఫొటోలను తీయను. అయితే వారిలో ఉన్న మంచిని బయటకు తీసుకువస్తాను. కళ్లలో నిజాయితీ, కళ కనిపించకపోతే జనాలకు నచ్చదు. అందుకే నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను. మనిషిలో శరీరాకృతి, నవ్వు, చూపు.. ఇలా ఏదో ఒకటి బాగుంటుంది. దాన్నే బయటకు తీసుకువస్తాను. నల్లగా ఉన్నామని చాలా మంది కెమెరా ముందుకు రావడానికి భయపడుతుంటారు. కానీ కెమెరాకు నలుపు మైనస్ కాదు. ఎప్పుడూ ప్లస్సే! ఇప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా ఫొటోషాప్‌లో మార్పులు చేసేస్తున్నారు. అలా సరిచేయడం అంటే చెరుకు పిప్పి నుంచి రసం తీసి, పంచదార కలిపినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్స్‌తో ఫొటోలు తీసేస్తున్నారు. ఇలాంటివారికి మీరిచ్చే సూచనలు? అరవింద్: ఓ రకంగా మంచిదే! కానీ, ఫొటోలు తీయడానికి వారికి బేసిక్స్ కూడా తెలియవు. టైపింగ్ నేర్చుకున్నంత మాత్రాన నవల రాయలేరు కదా! పెద్ద ఫొటోగ్రాఫర్లే ఏది బెస్ట్ ఫొటో అనేది చెప్పలేకపోతున్నారు. ఇక సాధారణ వాళ్ల పరిస్థితి చెప్పక్కర్లేదు. నాలుగు ఫొటోలు తీసి, ఫేస్బుక్లో పెట్టినంత మాత్రాన వాళ్లని ఫొటోగ్రాఫర్స్ అనలేం. ఫొటోగ్రఫీ అనేది ఒక హాబీ. ఆత్మసంతృప్తి కోసం ఫొటోలు తీస్తూనే ఉండాలి. గడిచిన పదేళ్లలో ఫొటోగ్రఫీలో ఎన్నో మార్పులు వచ్చాయి. అత్యున్నత స్థాయికి చేరింది. ఇంకో పదేళ్లు గడిచిపోతే మళ్లీ బ్యాక్ టు అంటూ బెస్ట్ ఫొటోగ్రాఫర్స్ వైపు చూస్తారు. ఫ్యాషన్ ఫొటోలు బాగా రావాలంటే మంచి రంగులు ఉండాలా? ఫొటోలు తీయడానికి ఏ సమయం మేలు? అరవింద్: ఎంత తక్కువ కలర్స్ ఉంటే సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. కలర్స్ కోసమే చేస్తే అది ఫొటో అనిపించుకోదు. ఎప్పుడైనా తెల్లవారుజామున తీసిన ఫొటోలే అద్భుతంగా వస్తాయి. ఏ టైమ్‌లో తీసినా లైటింగ్ ప్రధానంగా చూసుకుంటాను. ఎంచుకునే థీమ్‌ను బట్టి ఉదయం, సాయంత్రం, రాత్రి ఉంటుంది. ఫ్యాషన్ ఫోటోలు తీయాలంటే మోడల్స్‌కి ఉదయం 8 గంటలలోపే పని ముగించేస్తాను. అందుకే వారికి ఉదయం 5:30 గంటలకే మేకప్‌తో రెడీగా ఉండమని చెబుతాను. ఫొటోగ్రాఫర్ ఏ కొంత రాజీపడినా ఫొటో నాణ్యత దెబ్బతింటుంది. ఏయే మోడల్స్‌తో వర్క్ చేశారు? ప్రముఖులతో వర్క్ చేసినప్పుడు అనుభవాలు? అరవింద్: దాదాపు పాత తరం తెలుగు నటీనటులందరినీ ఫొటోలు తీశాను. వారిలో నటి సౌందర్య, సిమ్రాన్, సాక్షిశివానంద్... ఉన్నారు. చిన్నా, పెద్ద మోడల్స్ నుంచి మిస్‌యూనివర్స్ మంత్రి ప్రార్, మిస్ ఇండియా రాణీ జయరాజ్, క్రీడాకారులు సానియామీర్జా, జ్వాలాగుత్తా, సింధు, సైనా నెహ్వాల్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు... నా జాబితాలో ఇలా చాలా మందే ఉన్నారు. ప్రముఖులతో పని చేసినప్పుడు వారి షెడ్యూల్‌ను బట్టి నా టైమ్ సెట్ చేసుకుంటాను. చాలా మంది లేడీ మోడల్స్‌తో కలిసి పనిచేస్తుంటారు. దీనివల్ల్ల మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు..? అరవింద్: (నవ్వుతూ) అస్సలు లేవు. కెమెరా పట్టుకున్న తర్వాత ఆడ, మగ.. అనే తేడాలు గుర్తుకురావు. న్యూడ్ ఫొటోగ్రాప్స్ కూడా తీసాను. తీసే ఫొటో వైవిధ్యంగా, అద్భుతంగా రావాలి.. దానిపైనే దృష్టి అంతా! నా పని విధానం గురించి మా ఆవిడ షిప్రాకు పూర్తిగా తెలుసు. నేను ఏదైనా చెప్పినా ‘నాకు అరవింద్ ఛెంజి గురించి తెలుసు, ఇంకేమీ తెలియదు వదిలేయండి’ అంటుంది. మాది ప్రేమ వివాహం. తను ఇంటీరియర్ డిజైనర్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వ్యాపారం చేస్తోంది. మాకు నలుగురు అబ్బాయిలు. మరో వందేళ్లకు నా మనవలు నా ఫొటో గుర్తుపట్టి, అరవింద్ ఛెంజి తీసిన ఫొటో ఇదీ .. అంటే చాలు... అదే నాకు పెద్ద అవార్డ్. ఎందుకంటే నేను వేరే అవార్డులేవీ ఇష్టపడను. అవి ప్రతిభకు కొలమానం కాదు. సంభాషణ: నిర్మలారెడ్డి