కెమెరా లెన్స్...రంగు భేదం ఎరగదు! | Exclusive Interview with photographer Arvind Chenji | Sakshi
Sakshi News home page

కెమెరా లెన్స్...రంగు భేదం ఎరగదు!

Published Wed, Sep 17 2014 10:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Exclusive Interview with photographer  Arvind Chenji

నాటి సావిత్రి, వాణిశ్రీ, స్మితాపాటిల్ నుంచి నేటి బిపాస బసు వరకు చిత్రసీమను ఏలినవారంతా చామనచాయతో ఆకట్టుకున్నవారే! రంగు తక్కువ అని బాధపడేవారినే కెమెరా కన్ను ఎక్కువగా ప్రేమించింది. ఇంకా ప్రేమిస్తోంది. ‘మేని రంగు తెలుపా, నలుపా కాదు కెమెరా లెన్స్‌కి కావల్సింది వారి ముఖ కవళికలు, శరీరాకృతి, నటన.. ’ అన్నారు అరవింద్ ఛెంజి. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ అంటే అంతగా పరిచయం లేని కాలంలోనే అరవింద్ ఛెంజి కెమెరా చేతబట్టారు. అప్‌కమింగ్ మోడల్స్‌కు పర్సనల్ పోర్ట్ ఫోలియోలు డిజైన్ చేయడం దగ్గర్నుంచి... అందాల రాణుల స్పెషల్ ఫొటో షూట్‌ల దాకా ‘ఫ్యాషన్ క్లిక్స్’కు కేరాఫ్‌గా మారారు. దాదాపు మూడున్నర దశాబ్దాల కెరీర్‌లో ఆయనకు తెలియని ఫ్యాషన్ అరుదే అని చెప్పాలి. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఎలా ఉండాలో సరికొత్త లెన్స్‌లో చూపించిన ఈ డౌన్ టు ఎర్త్ ఫొటోగ్రాఫర్‌తో ‘సాక్షి ఫ్యామిలీ’ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది.
 
ప్రసిద్ధ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా పేరున్న మీరు, ఈ రంగంలోకి ఎలా వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం?

 అరవింద్ ఛెంజి: మా పూర్వీకులు మహారాష్ట్రీయులైనా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! నాన్న ఇంజినీర్, అమ్మ డాక్టర్. చెల్లెలు బిజినెస్ రంగంలో ఉంది. ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. నాకే కెమెరా అంటే పిచ్చి. ఇలాగే చదవాలనే ఆంక్షలు లేవు. అమ్మ, నాన్న ఆంక్షలు పెట్టలేదు. బీఎస్సీ చేశాను. కెమెరా పట్టడానికి ముందు నాకు నలుగురిలో కలవాలంటే అపరిమితమైన సిగ్గు. ఎవరినీ పలకరించేవాడిని కాదు. కనీసం మా చెల్లెలు స్నేహితులు వచ్చినా వారి ముందుకూ వెళ్లేవాడిని కాదు. ఆడవాళ్లకు ఆమడదూరం ఉండేవాడిని. అలాంటిది కెమెరా పట్టాక ఇతరులతో సంభాషించడం, అందరితో కలిసిపోవడం నేర్చుకున్నాను. తప్పదు, ఫొటోగ్రఫీలో మాటే ముఖ్యం. క్లైంట్స్‌తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటేనే, వారూ ఫ్రీగా ఉండగలుగుతారు. లేదంటే ఫొటో అనగానే బిగుసుకుపోతారు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు.. ఇలా అందరితోనూ వారి వారి మనస్తత్వానికి తగినట్టుగా మారిపోతాను. ఒకరకంగా చెప్పాలంటే కెమెరా పట్టుకున్న సైకాలజిస్ట్ అని చెప్పవచ్చు.
 
మీరు కెమెరా పట్టుకున్నప్పటి రోజులు, ఇప్పటి రోజులు ఫొటోగ్రఫీలో వచ్చిన మార్పులు?

అరవింద్: ఈ రంగంలో దాదాపు 35 ఏళ్లు దాటిపోయాయి. నాకు గురువెవ్వరూ లేరు. సొంతంగా నేర్చుకున్నాను. ఒకప్పుడు ఫొటోగ్రఫీ అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అని మాత్రమే అనుకునేవారు. అలాంటిది ఇప్పుడా పదానికి అర్థమే మారిపోయింది. ఫొటోగ్రఫీ ఎంత విస్తృతమైనదో చాలామందికి తెలిసొచ్చింది. ఈ పదేళ్లలో  చాలా మంచి మార్పులు వచ్చాయి. ఫొటోగ్రాఫర్లకు మంచి ఇమేజ్ రావాలని తపించాను. అలాంటి రోజులనే ఇప్పుడు చూస్తున్నాను.
 
ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి, ఇతర ఫొటోగ్రఫీకి వ్యత్యాసం?

అరవింద్: ఫ్యాషన్ మాత్రమే కాదు, ఫుడ్, ప్రకటనలు, ఎడిటోరియల్ ఫొటోలూ తీస్తుంటాను. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో గ్లామరే ప్రధానం. అందంగా చూపించడానికే ప్రయత్నిస్తుంటాం. అయితే ఇదంతా ముందే సెట్ చేసుకొని, ఒక అవగాహన ప్రకారం ఫొటోలు తీయడం. అదే ఎడిటోరియల్ ఫొటోగ్రఫీ అయితే ఒక కథ చూపించగలగాలి. ఇది ముందుగా సెట్ చేసుకున్నది కాదు. జరుగుతున్నదే ఫొటోలో చూపించగలగాలి. అందుకే ఎడిటోరియల్ ఫొటోగ్రఫీని బాగా ఇష్టపడతాను.
 
మీరు చాలామంది మోడల్స్ ఫొటోలు తీశారు. మోడల్స్ అంటే అందంగా ఉంటే చాలా?

అరవింద్: అందం ఒక్కటే సరిపోదు. ‘నేను అందమైన అమ్మాయిని, అబ్బాయిని’ అనుకొని ఈ రంగంలోకి వచ్చేస్తుంటారు. అందం పుట్టుకతో వస్తుంది. దానికి మెరుగుపెట్టాలి. చాలా కష్టపడాలి. ఉదాహరణకు బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్‌నే తీసుకుంటే.. ఇటీవల ఓ సినిమా కోసం అతను బరువు పెరగాల్సి వచ్చింది. అందుకోసం ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సమోసా తిన్నాడట. అంటే ఈ రంగంలో ఎంతో త్యాగం చేయాల్సి ఉంటుంది. శరీరాకృతి, చర్మనిగారింపు... అన్నీ బెస్ట్‌గా ఉండాలి. అందుకు ఆహారనియమాలు పాటించాలి. వ్యాయామాలు చేయాలి. దీంతో పాటు వారి ముఖంలో భావాలు ఒలికించాలి. యాక్షన్ ఉంటేనే ఈ రంగంలో బాగా రాణించగలరు. నా పని వల్ల క్లయింట్ బిజినెస్ పెరగాలనుకుంటాను.
 
ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో తాజాగా వచ్చిన మార్పులేంటి? భవిష్యత్తు? దీని కింద ఏయే విభాగాలొస్తాయి?

అరవింద్: ఇప్పుడంతా డిజిటల్స్. పని సులువయ్యింది. విభిన్నత చూపించడం పెరిగింది. ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి ఎప్పుడూ ఆదరణ పెరుగుతుందే తప్ప, తగ్గదు. బ్యూటీ కూడా ఫ్యాషన్ కిందకే వస్తుంది. ఫొటోగ్రాఫర్ పని ఒక్కదానికే పరిమితం అనేది ఉండదు. ఒక జనరల్ డాక్టర్ లాగే అన్ని అంశాలలోనూ ప్రావీణ్యత సాధించాలి.  
 
వ్యక్తి రూపంలో ఉన్న లోపాలను ఫొటోలు తీసే విధానంలో కవర్ చేయవచ్చా?

అరవింద్: లోపం లేకుండా ఎవరూ ఉండరు. అలాగని లోపాలను కప్పి పెట్టి ఫొటోలను తీయను. అయితే వారిలో ఉన్న మంచిని బయటకు తీసుకువస్తాను. కళ్లలో నిజాయితీ, కళ కనిపించకపోతే జనాలకు నచ్చదు. అందుకే నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను. మనిషిలో శరీరాకృతి, నవ్వు, చూపు.. ఇలా ఏదో ఒకటి బాగుంటుంది. దాన్నే బయటకు తీసుకువస్తాను. నల్లగా ఉన్నామని చాలా మంది కెమెరా ముందుకు రావడానికి భయపడుతుంటారు. కానీ కెమెరాకు నలుపు మైనస్ కాదు. ఎప్పుడూ ప్లస్సే! ఇప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా ఫొటోషాప్‌లో మార్పులు చేసేస్తున్నారు. అలా సరిచేయడం అంటే చెరుకు పిప్పి నుంచి రసం తీసి, పంచదార కలిపినట్టుగా ఉంటుంది.
 
ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్స్‌తో ఫొటోలు తీసేస్తున్నారు. ఇలాంటివారికి మీరిచ్చే సూచనలు?

అరవింద్: ఓ రకంగా మంచిదే! కానీ, ఫొటోలు తీయడానికి వారికి బేసిక్స్ కూడా తెలియవు. టైపింగ్ నేర్చుకున్నంత మాత్రాన నవల రాయలేరు కదా! పెద్ద ఫొటోగ్రాఫర్‌లే ఏది బెస్ట్ ఫొటో అనేది చెప్పలేకపోతున్నారు. ఇక సాధారణ వాళ్ల పరిస్థితి చెప్పక్కర్లేదు. నాలుగు ఫొటోలు తీసి, ఫేస్‌బుక్‌లో పెట్టినంత మాత్రాన వాళ్లని ఫొటోగ్రాఫర్స్ అనలేం. ఫొటోగ్రఫీ అనేది ఒక హాబీ. ఆత్మసంతృప్తి కోసం ఫొటోలు తీస్తూనే ఉండాలి. గడిచిన పదేళ్లలో ఫొటోగ్రఫీలో ఎన్నో మార్పులు వచ్చాయి. అత్యున్నత స్థాయికి చేరింది. ఇంకో పదేళ్లు గడిచిపోతే మళ్లీ బ్యాక్ టు అంటూ బెస్ట్ ఫొటోగ్రాఫర్స్ వైపు చూస్తారు.   
 
ఫ్యాషన్ ఫొటోలు బాగా రావాలంటే మంచి రంగులు ఉండాలా? ఫొటోలు తీయడానికి ఏ సమయం మేలు?

అరవింద్: ఎంత తక్కువ కలర్స్ ఉంటే సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. కలర్స్ కోసమే చేస్తే అది ఫొటో అనిపించుకోదు. ఎప్పుడైనా తెల్లవారుజామున తీసిన ఫొటోలే అద్భుతంగా వస్తాయి. ఏ టైమ్‌లో తీసినా లైటింగ్ ప్రధానంగా చూసుకుంటాను. ఎంచుకునే థీమ్‌ను బట్టి ఉదయం, సాయంత్రం, రాత్రి ఉంటుంది. ఫ్యాషన్ ఫోటోలు తీయాలంటే మోడల్స్‌కి ఉదయం 8 గంటలలోపే పని ముగించేస్తాను. అందుకే వారికి ఉదయం 5:30 గంటలకే మేకప్‌తో రెడీగా ఉండమని చెబుతాను. ఫొటోగ్రాఫర్ ఏ కొంత రాజీపడినా ఫొటో నాణ్యత దెబ్బతింటుంది.
 
ఏయే మోడల్స్‌తో వర్క్ చేశారు? ప్రముఖులతో వర్క్ చేసినప్పుడు అనుభవాలు?

అరవింద్: దాదాపు పాత తరం తెలుగు నటీనటులందరినీ ఫొటోలు తీశాను. వారిలో నటి సౌందర్య, సిమ్రాన్, సాక్షిశివానంద్... ఉన్నారు. చిన్నా, పెద్ద మోడల్స్ నుంచి మిస్‌యూనివర్స్ మంత్రి ప్రార్, మిస్ ఇండియా రాణీ జయరాజ్, క్రీడాకారులు సానియామీర్జా, జ్వాలాగుత్తా, సింధు, సైనా నెహ్వాల్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు... నా జాబితాలో ఇలా చాలా మందే ఉన్నారు. ప్రముఖులతో పని చేసినప్పుడు వారి షెడ్యూల్‌ను బట్టి నా టైమ్ సెట్ చేసుకుంటాను.
 
చాలా మంది లేడీ మోడల్స్‌తో కలిసి పనిచేస్తుంటారు.  దీనివల్ల్ల మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు..?

అరవింద్: (నవ్వుతూ) అస్సలు లేవు. కెమెరా పట్టుకున్న తర్వాత ఆడ, మగ.. అనే తేడాలు గుర్తుకురావు. న్యూడ్ ఫొటోగ్రాప్స్ కూడా తీసాను. తీసే ఫొటో వైవిధ్యంగా, అద్భుతంగా రావాలి.. దానిపైనే దృష్టి అంతా! నా పని విధానం గురించి మా ఆవిడ షిప్రాకు పూర్తిగా తెలుసు. నేను ఏదైనా చెప్పినా ‘నాకు అరవింద్ ఛెంజి గురించి తెలుసు, ఇంకేమీ తెలియదు వదిలేయండి’ అంటుంది. మాది ప్రేమ వివాహం. తను ఇంటీరియర్ డిజైనర్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వ్యాపారం చేస్తోంది. మాకు నలుగురు అబ్బాయిలు. మరో వందేళ్లకు నా మనవలు నా ఫొటో గుర్తుపట్టి, అరవింద్ ఛెంజి తీసిన ఫొటో ఇదీ .. అంటే చాలు... అదే నాకు పెద్ద అవార్డ్. ఎందుకంటే నేను వేరే అవార్డులేవీ ఇష్టపడను. అవి ప్రతిభకు కొలమానం కాదు.
 
 సంభాషణ: నిర్మలారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement