ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.. | Old Fashion Trending For Ladies Jewellery | Sakshi
Sakshi News home page

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌..

Published Wed, Jul 18 2018 10:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Old Fashion Trending For Ladies Jewellery - Sakshi

వడ్డాణం, బంగారు జడ... ఓస్‌ ఇవి తెలుసు కదా అంటారా? మరి కంకణాలు, కంటెలు..ఈ పేర్లెక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? కానీ కాసుల మాలలు, గుట్ట పూసలు? బాబోయ్‌ ఇవెక్కడి పేర్లు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరింకా ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’కి దూరంగానే ఉన్నారన్న మాట. ఆనాటి ఆభరణాలు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి.మరోవైపు బరువైనా పరవాలేదంటూ సిటీ మహిళలు పాతకాలం జ్యువెలరీకి పచ్చజెండా ఊపుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో : ‘ఏమిటలా ఒంటినిండా ఆభరణాలు దిగేసుకున్నావ్‌? గుళ్లో అమ్మవారిలా?’ అంటూ ఆభరణ ప్రియులైన మహిళల్ని ఆటపట్టించే రోజులు గతించనున్నాయి. నడుముకి వడ్డాణాలు, బంగారపు పూల జడలు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్‌లు తదితర ఒకప్పటి ఫ్యాషన్లే కావచ్చు. కానీ ఇవే ఇప్పుడు ట్రెండ్‌. పాతే వింత అంటున్న ఆధునికులు... మోటుగా ఉంటాయంటూ తీసిపారేసిన నగల్నే మోజుగా ఆదరిస్తున్నారు. అంతేకాదు... మరింతగా వెనక్కెళ్లి శోధించి, మరీ పురాతన ఆభరణ శైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, అవ్వల కాలం నాటి స్టైల్స్‌కు ప్రాణం పోస్తున్నారు.   

కాసుల గలగల..  
కాసుల పేర్లంటూ ఆనాటి ఆభరణం మరోసారి కొత్తగా సవ్వడి చేస్తోంది. ఆధునిక మహిళల మెడలో గలగలమంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీకాసుల మాలలు ఇప్పుడు ట్రెండీ. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగో మాలలని పిలుస్తున్నారు. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల కనీసం 30–300 గ్రాముల బరువు ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

కొత్తవాటి ‘కంటె’ మిన్న..
ఒకప్పటి సంప్రదాయ ఆభరణమైన కంటెలు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. వీటిని రాజుల కాలంలో ధరించేవారట. ఇటీవల మహానటి సినిమాలో కీర్తి సురేష్‌ «సైతం ధరించింది. కాళ్ల పట్టీల టైప్‌లో ఉండే వీటిని మెడలో ధరిస్తారు. ఇది చూడ్డానికి థిక్‌గా ఒక రాడ్‌లా ఉంటుంది. దీనికే పెండెంట్స్,పెరల్‌ డ్రాప్స్‌ జోడించడం, స్టోన్స్‌తో కార్వింగ్‌ చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నారు. రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వీటి ధరలు ఉంటున్నాయి.

గుట్టలు గుట్టలుగా...
అలనాటి తెలంగాణ సంప్రదాయ ఆభరణం గుట్ట పూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్‌ అయ్యాయి. వీటిని షేప్‌లెస్‌ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించొచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వివిధ ధరల్లో లభిస్తున్నాయి.

కంకణం కట్టుకుంటున్నారు..  
మోచేతి అందాన్ని పెంచే గాజులకు ముందుగా బంగారు కంకణం ధరించడమనేది చాలా పాతకాలం నాటి ఆభరణాల శైలి. అయితే ఆధునికులు కూడా దీన్ని అనుసరిస్తున్నారు. రెండు చేతులకూ గాజులతో పాటు  ఒక్కో కంకణం తొడుగుతున్నారు. ఇవి చూసేందుకు లావుగా ఉంటాయి. ఒక్కోటి 30 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉంటాయి. ధర రూ.లక్ష  నుంచి రూ.5 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.  

వేడుకల్లో తప్పనిసరి...  
మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. ఓల్డ్‌ ట్రెండ్స్‌ని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాతకాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవే. అయితే గతంలో ఉన్నత స్థాయి వాళ్లు మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మిడిల్‌క్లాస్‌ కూడా వీటినే ఎంచుకుంటున్నారు.  
– శ్వేతారెడ్డి, డిజైనర్, హియా–లాస్య జ్యువెలర్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement