‘రోడ్డు మీద కనిపించిన రూపాన్ని చూసి వెంటనే మోహించడం.. ప్రేమ పేరుతో వల వేయడం.. మోజు తీరాక వదిలేసి మొహం చాటేయడం’... ఇవన్నీ చేయడం కొందరు అబ్బాయిల పనే కదా! అదే పని ఓ అమ్మాయి చేస్తే... వినడానికే ఆశ్చర్యం అనిపించే ఈ వి‘చిత్రం’ చూడ్డానికి ఇంకెలా ఉంటుంది? మరి అలాంటి అమ్మాయి పాత్రని తెరపై పండించడం ఇంకెంత సాహసం అనిపిస్తుంది? ఆ సాహసం చేసింది కాబట్టే పాయల్ రాజ్‌పుత్ సూపర్ పాపులర్ అయింది. ఈ పంజాబీ అమ్మాయి ‘ఆర్‌ఎక్స్ 100’ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగాళ్ ఇమేజ్ సంపాదించుకుంది. ‘అదొక స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను వ్యక్తిగతంగా స్ట్రాంగ్. అయితే ‘ఇందూ’ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని మాత్రం అస్సలు ఇష్టపడను’ అంటున్న పాయల్ ..
‘తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ (సినిమా ఆఫర్లు ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం) కచ్చితంగా ఉంది. ఇది నన్ను బాగా డిసప్పాయింట్ చేస్తోంది. ‘ఆర్‌ఎక్స్100’ పెద్ద హిట్టయి, నాకు పేరొచ్చిన తర్వాత కూడా నన్ను కాంప్రమైజ్ అవ్వమంటూ అడుగుతున్నారు. ఈ మాటను తప్పకుండా పబ్లిష్ చేయండి. ఐ మీన్.. ఇది క్యాస్టింగ్ కౌచ్ గురించి. ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇలాంటి ప్రపోజల్‌తో నాలుగు రోజుల క్రితమే ఒకరు కలిశారు. బహుశా ఫస్ట్ మూవీలోనే బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్ల అలా అనుకుంటున్నారో ఏమో! కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ టాలెంట్‌తో ఈ పొజిషన్‌లో ఉన్నాను. అంతే తప్ప.. కాంప్రమైజ్ అయ్యో, మరో విధంగానో కాదు’’ అంటోంది పాయల్ రాజ్‌పుత్. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు..
పుట్టి పెరిగింది ఢిల్లీలో. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్స్. నాకు ఒక సోదరుడు. మాది చిన్న హ్యాపీ ఫ్యామిలీ. సినిమాల మీద చిన్నప్పటి నుంచి ఇష్టమే. అయితే కాలేజీకి ముందు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. పిరికిదాన్ని కూడా. అక్కడి నుంచే సెల్ఫ్‌మేడ్ ఉమన్‌గా మారాను. చదువుతూనే ట్యూషన్లు చెబుతూ మోడలింగ్ చేశాను. మోడలింగ్ నుంచి టీవీ రంగంలోకి ప్రవేశించాను. అలా తర్వాత పంజాబీ సినిమాలు చేశాను. అక్కడ మంచి పేరు రావడంతో ఇప్పుడు కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నాను.
ఇందూ.. అందరికీ నచ్చేసింది..
‘ఆర్‌ఎక్స్ 100’లో ఇందూ పాత్ర అంగీకరించేటప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలైన మాట వాస్తవం. ఇందూ క్యారెక్టర్ విన్నప్పుడు ‘ఓమై గాడ్’ అనుకున్నాను. పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర కాదిది. తెస్తే మంచి పేరు తేవొచ్చు.. లేదా నా పేరు చెడగొట్టొచ్చు. తెలుగులో ఆరంభ చిత్రంలోనే పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ పోషించడమంటే... అది ప్రమాదకరమైన నిర్ణయం కావచ్చు. పైగా సినిమాలో శృంగార దృశ్యాలు కూడా ఆలోచింపజేశాయి. మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. దీనిపై మా అమ్మానాన్నతో కూర్చొని చర్చించాను. పాత్ర నచ్చిందని, నా మీద నమ్మకం ఉంచమని చెప్పాను. నాన్న తొలుత కొంచెం డిస్ట్రబ్ అయినా... చివరికి అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ నాతో కలిసి సినిమా చూశారు. ఆమెకు ఏమీ అభ్యంతరం అనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్ చేసినందుకు ఐ ఫీల్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే పబ్లిక్ ఇందూని బాగా లవ్ చేస్తున్నారు. నిజానికి పంజాబీ సినిమాల్లో నా పాత్రలన్నీ చాలా ఒద్దికగా, సిగ్గరి అయిన అమ్మాయి పాత్రలే. ప్రస్తుతం అమ్మాయిలు బాగా డామినేటింగ్‌గా, చాలా తెలివిగా కూడా ఉంటున్నారు. కొందరైతే మగవాళ్ల కంటే కన్నింగ్‌గా కూడా ప్రవర్తిస్తున్నారు. కాని నిజ జీవితంలో ఇందూ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయెవరూ నాకు తారస పడలేదు. ఒకవేళ పరిచయమైనా... నేను దూరం పెట్టేస్తాను.
డబుల్ ధమాకా..
నాలుగేళ్ల క్రితం దక్షిణాదిలో తొలిసారి తమిళ సినిమా చేశాను. అయితే ఏవో సమస్యలతో అది విడుదల కాలేదు. ఆ తర్వాత కూడా సౌత్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఒక డిఫరెంట్ రోల్ కోసం వెయిట్ చేశాను. అందుకే ‘ఇందూ’ పాత్రకు ఓకే చెప్పా. చాలా బాగా ప్రారంభమై.. అంతే బాగా ముగిసింది ‘ఆర్‌ఎక్స్ 100’ జర్నీ. ఈ నెల 15న నా పంజాబీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్టర్ 420’ కూడా రిలీజైంది. అదీ మంచి హిట్టయింది. ఇటు ‘ఆర్‌ఎక్స్ 100’, అటు పంజాబీ సినిమా రెండూ హిట్ కావడంతో నాకు డబుల్ ధమాకా అన్నమాట.
‘హీరోయిన్’ నా డ్రీమ్ రోల్...
ఆఫర్స్ బాగా వస్తున్నాయి. అయితే నేను ఏవి పడితే అవి అంగీకరించను. ఇందూ హిట్టయింది కాబట్టి... అన్నీ అదే రకమైన నెగెటివ్ క్యారెక్టర్స్ చేయను. ఒకదానికి ఒకటి పొంతన లేని పాత్రలు చేయాలని ఉంది. ఒక అమ్మాయిగా నేను చాలా స్ట్రాంగ్. అందుకేనేమో... పవర్‌ఫుల్ రోల్స్, ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీస్ అంటే ఇష్టం. ‘హీరోయిన్’ అనే సినిమాలో కరీనా కపూర్ చేసిన క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉంది. ఒక యువతి సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పట్టే అలాంటి పాత్ర ప్రస్తుతానికి నా డ్రీమ్ రోల్ అని చెప్పొచ్చు. ఓ రకంగా ఇందూ కూడా డ్రీమ్ రోల్ లాంటిదే. నేను నార్త్ ఇండియన్ అయినా నా ఫేస్ సౌతిండియన్‌లా ఉంటుంది అంటున్నారు. బహుశా మా అమ్మ గారి ఫీచర్స్ వల్ల అలా అనిపిస్తున్నానేమో. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా గుడ్ స్క్రిప్ట్, గుడ్ డైరెక్షన్, మంచి పాత్రలకే నా ప్రాధాన్యత. ‘ఆర్‌ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి లాంటి దర్శకులు చాలా తక్కువ. ఆయన ఈ సినిమాలో నన్ను అద్భుతంగా పోట్రైట్ చేయించారు. అతనితో మరిన్ని మూవీస్ చేయాలని ఉంది.
సిటీలో సెటిల్ అవుతానేమో...
స్వీట్స్ అంటే బాగా ఇష్టం. సౌతిండియా ఫ్రెండ్ నుంచి నిన్నే నాకు పెద్ద స్వీట్ ప్యాకెట్ కూడా వచ్చింది (నవ్వుతూ). ఏవి తిన్నా, రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తాను. అన్నింటికన్నా యోగాసనాలు బాగా ఇష్టం. ఈ మధ్య పంజాబ్, హైదరాబాద్ ఎక్కువగా తిరగడం వల్ల 10కిలోలు పెరిగాను. మళ్లీ తగ్గాలి. ప్రస్తుతం ముంబైలో నివస్తున్నాను. కానీ ఐ లవ్ హైదరాబాద్. ఏమో భవిష్యత్తులో ఇక్కడే సెటిల్ అవుతానేమో చెప్పలేను. ఇక్కడ నాకు స్నేహితులు కూడా ఏర్పడ్డారు. తెలుగులో నా తర్వాతి సినిమా గురించి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. అది అక్టోబరులో ప్రారంభమై డిసెంబరులో రిలీజ్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. ఇంతకు మించి వివరాలు ఇప్పుడే చెప్పలేను.
ఐ యామ్ ప్రొఫెషనల్..
ఇకపై కూడా ‘ఆర్‌ఎక్స్ 100’లో లాంటి బోల్డ్ సీన్స్ ఉన్న పాత్రలు చేస్తారా అంటే... అది దర్శకుడు నాకు నా పాత్ర గురించి, సినిమా కథకు అవెంత వరకు అవసరమో చెప్పి కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే అందరూ గుర్తించాల్సింది ఏమిటంటే... ఇక్కడకి నేను నటించడానికి వచ్చాను. మంచి పాత్ర ఇస్తే... నా సత్తా ఏమిటో చూపిస్తా. ఉత్తరాది అమ్మాయిని కాబట్టి ఇన్‌హిబిషన్స్ తక్కువగా ఉంటాయి. అయితే నేను పూర్తిగా ప్రొఫెషనల్‌ని అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరినీ ముద్దు పెట్టుకోవడానికి నేనిక్కడికి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment