ఆడపిల్లనే...ఐతే ఏంటంట | Pretty damsels eyeing cop roles in Tollywood | Sakshi
Sakshi News home page

ఆడపిల్లనే...ఐతే ఏంటంట

May 14 2024 12:16 AM | Updated on May 14 2024 1:13 PM

Pretty damsels eyeing cop roles in Tollywood

హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్‌ ఎ చేంజ్‌ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్‌ పోలీస్‌ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. 

సత్యభామ సాహసం
హైదరాబాద్‌ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్‌ తీసుకున్నారు హీరోయిన్  కాజల్‌ అగర్వాల్‌. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్‌గా ఆల్మోస్ట్‌ సస్పెండ్‌ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్‌ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌ చేసిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీకి సుమన్  చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్‌ పాత్రలో ప్రకాశ్‌రాజ్, అమరేందర్‌ అనే పాత్రలో నవీన్  చంద్ర లీడ్‌ రోల్స్‌లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్‌ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్‌ పోలీసాఫీసర్‌గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్‌ఫుల్‌ పోలీస్‌గా ఒదిగిపోయారు కాజల్‌. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్‌ఫుల్‌ ఆఫీసర్‌గా విజృంభించారని యూనిట్‌ పేర్కొంది.

పాయల్‌ రక్షణ
హీరోయిన్  పాయల్‌ రాజ్‌పుత్‌ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్‌ ధరించి, లాఠీ పట్టారు. పాయల్‌ రాజ్‌పుత్‌ ఫస్ట్‌ టైమ్‌ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్‌ ఠాకోర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్‌ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించినట్లుగా యూనిట్‌ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్‌ స్వరకర్త.

అగ్ని నక్షత్రం
మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న మర్డర్‌ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్‌. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్  థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఐతే ఏంటంట?
‘కలర్‌ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్  చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్‌’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్‌ రోల్స్‌లో నటించారు. ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్  గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన  ఈ సినిమాలో ఎస్‌ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.

ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్  ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.

హీరోయిన్  త్రిష నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘బృందా’. త్రిష టైటిల్‌ రోల్‌లో నటించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్  థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్‌ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్‌ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌ కావడంవల్లే త్రిష ఈ వెబ్‌ సిరీస్‌ చేశారని  కోలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement