excursion tours
-
Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..
దొండపర్తి(విశాఖ దక్షిణ): మూడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణం.. సెవెన్ స్టార్ హోటల్‌కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్‌లో జలకాలాటలు.. రాక్ క్లైంబింగ్ విన్యాసాలు.. హ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమైంది. విశాఖ వాసులను ఎంతో కాలంగా ఊరిస్తున్న విహార నౌక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు విదేశాలతో పాటు దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కార్డీలియా ఎంప్రెస్ విహార నౌక ఇప్పుడు విశాఖ తీరానికి వచ్చేసింది. ఈ నెల 6వ తేదీన చెన్నై నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టులో నూతనంగా నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకుంది. నగరానికి 1,200 మంది పర్యాటకులతో.. చెన్నై నుంచి 36 గంటల పాటు ప్రయాణించిన ఈ కార్డిలియా నౌకలో 1,200 మంది పర్యాటకులు విశాఖకు చేరుకున్నారు. ఇందులో సుమారు 800 మంది ప్రయాణికులు ఇక్కడ దిగిపోయారు. మిగిలిన వారు పుదుచ్చేరి మీదుగా చెన్నైకు అదే క్రూయిజ్‌లో ప్రయాణించనున్నారు. విశాఖకు చేరుకున్న తరువాత వీరికి ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కల్పించి నగరంలో వివిధ సందర్శనీయ ప్రదేశాలకు తీసుకువెళ్లారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి వీరిని క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి 1,345 మంది పర్యాటకులు విశాఖ నుంచి బుధవారం రాత్రి 8 గంటలకు ఈ కార్డీలియా నౌక విశాఖ నుంచి బయలుదేరింది. ఉదయం 8 గంటలకే పోర్టులో క్రూయిజ్ టెర్మినల్‌కు నౌక చేరుకున్నప్పటికీ.. సాయంత్రం 4 గంటల నుంచి పర్యాటకులను అనుమతించారు. ఇక్కడి నుంచి 1,345 మంది బయలుదేరారు. వారందరిని తనిఖీ చేసి క్రూయిజ్‌లోకి అనుమతించారు. చాలా మంది విశాఖ నుంచి టికెట్లు దొరక్కపోవడంతో చెన్నై నుంచి టికెట్లు కొనుగోలు చేశారు. ముందుగానే చెన్నై వెళ్లిపోయి అక్కడ నుంచి క్రూయిజ్‌లో విశాఖకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో విశాఖకు క్రూయిజ్ కార్డీలియా క్రూయిజ్ సర్వీసు వాస్తవానికి విశాఖకు లేదు. ముంబయి, చెన్నై, గోవా, అండమాన్, లక్షద్వీప్ వంటి ప్రాంతాల్లో ఉండేది. దేశంలోనే కాకుండా శ్రీలంకకు కూడా ఈ నౌకా యాత్ర ఉండేది. అయితే శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో క్రూయిజ్ యాజమాన్యం శ్రీలంక సర్వీసును నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఇతర ప్రాంతానికి క్రూయిజ్ సర్వీస్ నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విశాఖ నుంచి సర్వీసు నడిపేందుకు అంగీకరించింది. అది కూడా ముందు మూడు సర్వీసులు నడిపి డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించింది. రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఈ విహారయాత్రకు విస్తృతంగా ప్రచారం కల్పించింది. అద్భుత స్పందన చెన్నై–విశాఖ–పుదుచ్చేరి–చెన్నై సర్వీసు నడుపుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన వెంటనే విక్రయాలు జోరుగా సాగాయి. ఈ నెలలో మూడు సర్వీసులకు ఇప్పటికే 90 శాతం మేర టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న మాదిరిగానే సెప్టెంబర్ వరకు విశాఖ నుంచి సర్వీసు నడపాలని నిర్వాహకులు నిర్ణయించారు. విశాఖలో ఈ క్రూయిజ్ నిర్వహణ బాధ్యతలను విశాఖ పోర్టు అథారిటీ అధికారులు జేఎం భక్షీ అనే సంస్థకు అప్పగించారు. విశాఖ నుంచి ప్రతీ బుధవారం సర్వీసు కార్టీలియా క్రూయిజ్‌కు విపరీతమైన డిమాండ్ రావడంతో ప్రతీ బుధవారం విశాఖ నుంచి చెన్నైకు సర్వీసును నడపనున్నారు. ప్రతీ సోమవారం చెన్నై నుంచి నౌక బయలుదేరి బుధవారం విశాఖకు చేరుకుంటుంది. ఇక్కడ అదే రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరి పుదుచ్చేరి మీదుగా చెన్నైకు వెళుతుంది. ఈ నెల 10వ తేదీ ఉదయం 7 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11వ తేదీన చెన్నైకు వెళుతుంది. తిరిగి ఈ నెల 13వ తేదీన చెన్నై నుంచి బయలుదేరి 15వ తేదీ ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకుంటుంది. విశాఖ నుంచి చెన్నై వరకు ముందు ఒకవైపు టికెట్ తీసుకున్నప్పటికీ.. అటునుంచి కూడా విశాఖకు ప్రయాణాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ క్రూయిజ్‌లో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. అయితే ఎయిర్‌పోర్టు తరహా తనిఖీలు చేసి పర్యాటకులను క్రూయిజ్‌లోకి అనుమతిస్తున్నారు. పర్యాటకంగా విశాఖ మరో అడుగు క్రూయిజ్ రాకతో విశాఖ పర్యాటకంగా మరో అడుగు ముందుకేసినట్టయింది. ఈ విలాసవంతమైన నౌక రాకతో విశాఖలో పర్యాటక సందడి మరింత పెరిగే అవకాశముంది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖవాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖకు వస్తారని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో విశాఖ నుంచి విదేశాలకు క్రూయిజ్ విహార యాత్రకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. నెరవేరిన కల చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రూయిజ్ విహారయాత్ర అందుబాటులోకి రావడంతో విశాఖవాసుల కల నెరవేరినట్టయింది. విశాఖ వాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్గడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్ విహార యాత్రకు పోటీ పడ్డారు. తొలి సర్వీసుకు పూర్తి స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నెల 15వ తేదీన మరో సర్వీసుకు 90 శాతం టికెట్ల విక్రయాలు జరగగా.. 22వ తేదీకి పూర్తిస్థాయిలో ఫుల్ అయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అలాగే జూలై, ఆగస్టు, సెపె్టంబర్ మాసాల్లో సర్వీసులకు అప్పుడే 60 శాతం టికెట్లు అమ్ముడైనట్లు తెలిపారు. మూవింగ్ స్టార్ హోటల్ కార్డీలియా క్రూయిజ్ ఒక మూవింగ్ స్టార్ హోటల్. మొట్టమొదటిసారిగా విలాసవంతమైన క్రూయిజ్‌లో విహారయాత్ర సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బయట ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ అన్ని సదుపాయాలు, సౌకర్యాలను బాగా ఎంజాయ్ చేయవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ సంతోషంగా, విలాసవంతంగా గడిపే మంచి యాత్ర ఇది. – జయకర్, విశాఖపట్నం క్రూయిజ్‌లో సదుపాయాలు ► కార్డీలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ► మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్, రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది. ► మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. ► అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. ► పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెర్రస్ ఉంటుంది. ► పదకొండో అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. ► లగ్జిరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ► ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి. ► చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డీలియా కిడ్స్ అకాడమీ పేరితో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ► జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ► డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ► అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్‌మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి. ► టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. ► లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్యాసినో ఆడాలంటే.. రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Shobhaa De: ఇదేనా ఇందుకు సమయం?
సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. అందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. చక్కటి కొటేషన్స్ పెడతారు, మంచి సంఘటనలను ట్వీట్ చేస్తారు, వారు చదివిన పుస్తకాలలోని మంచి విషయాలను వివరిస్తారు. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియాను బాగా వాడుకుంటారు. తాజాగా సెలబ్రిటీలు వారి విహార యాత్ర చిత్రాలను పోస్టు చేస్తున్నారు. ‘‘దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో మీకు ఇంత సమయం దొరికినందుకు మీరు అదృష్టవంతులు. మీరు మీ ఫొటోలను మీకు మాత్రమే పరిమితం చేసుకోవడం మంచిది’’ అంటూ శోభా డే కొంచెం ఘాటుగా స్పందించారు. శోభాడే అంటేనే వివాదాలకు మారు పేరు. నచ్చని అంశంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తీకరిస్తారు. ప్రజాస్వామ్యం లో ఏ విషయాన్నయినా నిర్భయంగా మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉందని శోభాడే నమ్మకం. అందుకే ఇప్పుడు ఈ విపత్కర సమయంలో సెలబ్రిటీల వైఖరిపై తన అభిప్రాయాలను కొంచెం ఘాటుగానే వెల్లడించారు. ప్రస్తుతం భారత ప్రజలు కరోనా వైరస్ బారిన పడి ఊపిరి పోసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిన కారణంగా మరణిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాలలో లాక్డౌన్ విధించారు. ఇటువంటి భయంకరమైన సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతుంటే, చాలామంది బాలీవుడ్ తారలు తమ స్నేహితులు, కుటుంబాలతో మాల్దీవుల వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, సరదాగా గడుపుతున్న ఫొటోలు పోస్టు చేయటం శోభాడే ఆగ్రహానికి కారణమైంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. గట్టిగా గొంతు విప్పి, స్పష్టంగా తన సందేశాన్ని వినిపించారు శోభాడే. ‘సరదాగా గడుపుతున్న ఫొటోలను పోస్టు చేయడానికి ఇది సరైన సమయం కాదు, అందరూ చావుబతుకుల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతుంటే, సెలబ్రిటీలు బాధ్యత లేకుండా ఇటువంటివి పోస్టు చేయటంలో అర్థం ఏంటి? మాల్దీవుల్లో ఉల్లాసంగా గడపండి. అయితే మీరు గడిపే సన్నివేశాలను అందరికీ తెలిసేలా కాకుండా వ్యక్తిగతంగా ఉంచుకోండి’’ అంటున్నారు శోభాడే. ‘మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వం ఏమీ చేయలేదు’ అంటూ ఇరవై నిమిషాల పాటు ప్రధాని మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఖరి పైనా శోభాడే గొంతు విప్పారు. ‘కరోనా భయం ఎప్పటికి తగ్గుతుందో ఎవ్వరికీ తెలియదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించటం వలన ఉపయోగం లేదు. మన ఆరోగ్యం గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మీయులతో మాట్లాడుతూ, ఆనందంగా గడుపుతూ హాయిగా ఉండండి’ అని చెబుతున్న శోభాడే మాటలతో ఆశ్వాసన పొందిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
కొల్లేరు పక్షుల అందాలు భేష్: నీలం సాహ్ని
ఆటపాక(కైకలూరు): కొల్లేరు పక్షుల కేరింతలు ఎంతగానో ఆకట్టుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కితాబిచ్చారు. కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని ఆదివారం కుటుంబసభ్యులతో కలసి ఆమె సందర్శించారు. బోటు షికారు చేస్తూ పెలికాన్, పెయింటెడ్ స్ట్రాక్ పక్షుల అందాలను తిలకించారు. అనంతరం పక్షినమూనా కేంద్రాన్ని సందర్శించారు. కొల్లేరు నైసర్గిక స్వరూపం, పక్షుల జీవిత విశేషాలు, వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానాన్ని సీఎస్‌కు అటవీశాఖ రేంజర్ బి.విజయ వివరించారు. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు రద్దు చేయడంపై మీడియా ప్రశి్నంచగా.. ఆ విషయమై అటవీ శాఖ పీసీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ అధికారితో మాట్లాడానని చెప్పారు. -
టూరెళ్లే ట్రైన్లు.. ఇది ఖరీదైన ప్రయాణం గురూ!
‘భూతల స్వర్గం’ అనే పేరు వినేఉంటారు కదా! మరి అలాంటి అనుభూతిని మీరెప్పుడైనా సొంతం చేసుకున్నారా.. లేదంటే ఇప్పుడు చెప్పబోయే రైలు ఎక్కాల్సిందే. బోలెడుసార్లు ఎక్కాం రైలు, అందులో అంత గొప్పేముంటుంది అనుకుంటున్నారా.. మీరు ఇంతకు ముందు ఎక్కింది ఊరెళ్లే రైళ్లు. ఇవి మాత్రం టూరెళ్లే రైళ్లు. సకల సౌకర్యాలతో విహారయాత్రలు చేసే సౌలభ్యాన్ని ఇవి కల్పిస్తున్నాయి. కాకపోతే ఇది ఖరీదైన ప్రయాణం సుమా! మన దేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన రైళ్ల విశేషాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! ప్యాలెస్ ఆన్ వీల్స్: భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్ వీల్స్. తొలినాళ్లలో ఖరీదైన రైలు ప్రయాణాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆక్రమించిన ఈ రైలును 1982 జనవరి 26న ప్రారంభించారు. చారిత్రక వైభవం ఉట్టిపడేలా దీని ఇంటీరియర్ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఇది రాజస్తాన్ పర్యాటక శాఖ, ఇండియన్ రైల్వే సంయుక్త ప్రాజెక్టు. ఇందులోని 14 బోగీలకు రాజస్తాన్‌లోని 14 సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. 6 నెలల ముందుగానే టికెట్స్ అన్నీ బుక్అయిపోయే ఈ రైలుకు విదేశీ పర్యాటకులెక్కువ. 1991లో ఏసీ ఏర్పాటు చేశారు. 2009లో మొత్తం రైలును సరికొత్తగా తీర్చిదిద్దారు. ఖర్చు: ఎనిమిది రోజుల ప్యాకేజీ ధర రోజుకు ఒకరికి రూ.22,000. ఒక గదిని ఇద్దరు పంచుకుంటే రూ.33,000, ముగ్గురు పంచుకుంటే రూ.45,000 వసూలు చేస్తారు. అక్టోబర్-మార్చి నెలల్లో ధరలు ఎక్కువ. మే, జూన్, జూలైలలో ఈ ట్రైన్ సేవలు బంద్. ది గోల్డెన్ చారియట్.. ఇది కర్ణాటక, గోవాల్లో అందాలను తిలకించేందుకు రూపొందించిన ప్యాకేజీ. 2008 మార్చిలో ప్రారంభమైంది. ఇండియన్ రైల్వే అండ్ కర్ణాటక టూరిజమ్‌లు సంయుక్తంగా రెండు రకాల ప్యాకేజీలను నిర్వహిస్తున్నాయి. ప్రతి సోమవారం బెంగళూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కబిని, బందీపూర్, మైసూర్, హసన్, హోస్పేట్, బాదామి, గోవాల మీదుగా ప్రయాణిస్తుంది. ఒక గదిని ఇద్దరు షేర్ చేసుకుంటే ఒకరికి రోజుకు రూ. 18,000 చార్జ్ చేస్తారు. ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్న లగ్జరీ ట్రైన్లలో ఇందులోనే కాస్త ధర తక్కువ. రాయల్ రాజస్తాన్.. ఇది ప్యాలెస్ ఆన్ వీల్స్‌కు సమాంతర ప్రాజెక్టు. 2009 జనవరిలో ప్రారంభమైంది. రాజ్‌పుత్‌ల అంతఃపురంలో మాత్రమే కనిపించే ప్రత్యేక అలంకరణలను దీనికి ఇంటీరియర్ డిజైన్‌గా ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఆదివారం వరకు కొనసాగే ఈ ప్రయాణం ఢిల్లీ, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, చిత్తోర్‌ఘడ్, సవై మదోపూర్, జైపూర్, ఖజురహో, వారణాసి, ఆగ్రా, ఢిల్లీల్లో ప్రయాణిస్తుంది. ఖర్చు: ఇద్దరు కలిసి గది తీసుకుంటే ఒకరికి రోజుకు రూ.26,200. ఎక్స్ట్రార్డినరీ సూట్‌కు రోజుకు రూ. 75,000 వరకు ఉంటుంది. ఫెయిరీ క్వీన్.. 1855లో ఇంగ్లండ్‌లో తయారైన ఈ రైలు ప్రపంచంలోనే వాడుకలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ లోకోమోటివ్. 1909లో కాలం చెల్లిన ఈ రైలును బాగుచేసి 1997 జులైలో మళ్లీ పట్టాలెక్కించారు. ఇది ఢిల్లీ ఆల్వార్ సరిస్కా (పులుల కేంద్రం), ఢిల్లీ ప్యాకేజీలను నిర్వహిస్తుంది. రెండ్రోజుల ప్యాకీజీకి ఒకరికి రూ.10,500 వీటిలో సదుపాయాలు.. ప్రతి గదికి ప్రత్యేక ఏసీతో ఫైవ్‌స్టార్ సదుపాయాలతో బెడ్రూమ్ ఉంటుంది. ప్రతి ట్రైన్లో ఒక బార్, రెండు రెస్టారెంట్లు ఉంటాయి. లైబ్రరీ, షాపింగ్, విశ్రాంతి గది, జిమ్, అవుట్గోయింగ్ పోస్ట్, ఫోను, ఇంటర్నెట్, ఎల్సీడీ టీవీలు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ వేడినీరు, చల్లనినీరు అందుబాటులో ఉంటాయి. మహరాజా ఎక్స్‌ప్రెస్.. 2010లో ప్రారంభమైన ఈ రైలు లగ్జరీ ట్రైన్ సిరీస్‌లో కొత్త ప్రాజెక్టు. దీన్ని ఇండియన్ రైల్వే, గ్లోబల్ ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్ సంయుక్తంగా నడుపుతున్నాయి. ఇందులో మూడు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మహారాజుల వైభవానికి ఆధునికతను మిక్స్ చేసి దీన్ని రూపొందించారు. పర్యటించే ప్రదేశాలు: ప్రిన్స్లీ ఇండియా: ప్రతి శనివారం ముంబై నుంచి ప్రారంభమవుతుంది. వడోదర, ఉదయ్‌పూర్, ఆగ్రా, జోధ్‌పూర్, బికనీర్, జైపూర్, రణతంబోర్, ఆగ్రా, ఢిల్లీల్లో పర్యటిస్తుంది. రాయల్ ఇండియా: పైనున్న ప్రాంతాల్లోనే పర్యటిస్తుంది. ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది. క్లాసికల్ ఇండియా: ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగ్రా, గ్వాలియర్, ఖజురహో, బంద్‌వగ్రా, వారణాసి, లక్నోల మీదుగా సాగుతుంది. ఖర్చు.. ప్రిన్స్లీ ఇండియా, క్లాసికల్ ఇండియా టూర్ ప్యాకేజీ మొత్తం రూ. 3 లక్షల 18 వేలు. రాయల్ ఇండియా ప్యాకేజీకి రూ. 2 లక్షల 78 వేలు. ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్ ప్యాకేజీకి రూ. 9 లక్షలు.