
సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. అందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. చక్కటి కొటేషన్స్ పెడతారు, మంచి సంఘటనలను ట్వీట్ చేస్తారు, వారు చదివిన పుస్తకాలలోని మంచి విషయాలను వివరిస్తారు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియాను బాగా వాడుకుంటారు. తాజాగా సెలబ్రిటీలు వారి విహార యాత్ర చిత్రాలను పోస్టు చేస్తున్నారు. ‘‘దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో మీకు ఇంత సమయం దొరికినందుకు మీరు అదృష్టవంతులు. మీరు మీ ఫొటోలను మీకు మాత్రమే పరిమితం చేసుకోవడం మంచిది’’ అంటూ శోభా డే కొంచెం ఘాటుగా స్పందించారు.
శోభాడే అంటేనే వివాదాలకు మారు పేరు. నచ్చని అంశంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తీకరిస్తారు. ప్రజాస్వామ్యం లో ఏ విషయాన్నయినా నిర్భయంగా మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉందని శోభాడే నమ్మకం. అందుకే ఇప్పుడు ఈ విపత్కర సమయంలో సెలబ్రిటీల వైఖరిపై తన అభిప్రాయాలను కొంచెం ఘాటుగానే వెల్లడించారు.
ప్రస్తుతం భారత ప్రజలు కరోనా వైరస్ బారిన పడి ఊపిరి పోసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిన కారణంగా మరణిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాలలో లాక్‌డౌన్ విధించారు. ఇటువంటి భయంకరమైన సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతుంటే, చాలామంది బాలీవుడ్ తారలు తమ స్నేహితులు, కుటుంబాలతో మాల్దీవుల వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, సరదాగా గడుపుతున్న ఫొటోలు పోస్టు చేయటం శోభాడే ఆగ్రహానికి కారణమైంది.
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. గట్టిగా గొంతు విప్పి, స్పష్టంగా తన సందేశాన్ని వినిపించారు శోభాడే. ‘సరదాగా గడుపుతున్న ఫొటోలను పోస్టు చేయడానికి ఇది సరైన సమయం కాదు, అందరూ చావుబతుకుల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతుంటే, సెలబ్రిటీలు బాధ్యత లేకుండా ఇటువంటివి పోస్టు చేయటంలో అర్థం ఏంటి? మాల్దీవుల్లో ఉల్లాసంగా గడపండి. అయితే మీరు గడిపే సన్నివేశాలను అందరికీ తెలిసేలా కాకుండా వ్యక్తిగతంగా ఉంచుకోండి’’ అంటున్నారు శోభాడే.
‘మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వం ఏమీ చేయలేదు’ అంటూ ఇరవై నిమిషాల పాటు ప్రధాని మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఖరి పైనా శోభాడే గొంతు విప్పారు. ‘కరోనా భయం ఎప్పటికి తగ్గుతుందో ఎవ్వరికీ తెలియదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించటం వలన ఉపయోగం లేదు. మన ఆరోగ్యం గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మీయులతో మాట్లాడుతూ, ఆనందంగా గడుపుతూ హాయిగా ఉండండి’ అని చెబుతున్న శోభాడే మాటలతో ఆశ్వాసన పొందిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment