మొండిబకాయిల కొండబాబు
సెటిల్మెంట్లు, కబ్జాలు, దందాలు చేయడంలోనే మొనగాడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఈసారి తన టాలెంట్‌ను ఓ బ్యాంకుకు చూపించారు. తన సోదరుడు, మరో ఏడుగురి సన్నిహితులతో కలసి సదరు బ్యాంకు నుంచి దాదాపు రూ. ఏడుకోట్ల రుణాన్ని తీసుకొని వారికి ఏడు చెరువుల నీళ్లు తాగించారు. రుణం తిరిగి చెల్లించకుండా తన బండతనంతో మొండిగా వ్యవహరించిన కొండబాబు ఆస్తులను బుధవారం వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) కాకినాడలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి తీసుకున్న రుణం చెల్లించకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. కొండబాబు, ఆయన సోదరుడు సత్యనారాయణతోపాటు మరో ఏడుగురు సన్నిహితులు కలిసి బ్యాంకు నుంచి తీసుకున్న రూ.6.88 కోట్ల రుణం చెల్లించలేదు. వీరంతా మెసర్స్ శంభులింగం మెరైన్ సర్వీసెస్ పేరుతో ఏర్పాటైన కంపెనీ తరఫున బ్యాంక్ నుంచి మూడేళ్ల క్రితం రుణం తీసుకున్నారు.
వీరిలో టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు, భార్య శ్రీదేవి రూ.48 లక్షలు తీసుకున్నారు. తాను తీసుకున్న రుణం వివరాలను ఇటీవల కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే సందర్భంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో కూడా పొందుపరిచారు. ఆయన సోదరుడు వనమాడి సత్యనారాయణ, భార్య సత్యగౌరి పేరుతో మరో రూ.67 లక్షలు తీసుకున్నారు. వీరితోపాటు మిగిలిన వారంతా కలిసి బ్యాంక్ నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు. తీసుకున్న రుణం చెల్లించాలంటూ తమ ప్రతినిధులు పలు పర్యాయాలు చేసిన విజ్ఞప్తులు వారు పట్టించుకోలేదని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. ఎంతకూ రుణం చెల్లించకపోవడంతో చేసేది లేక బ్యాంక్ అధికారులు వారి ఆస్తుల వేలానికి పత్రికల్లో ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
ఆ నోటిఫికేషన్ ప్రకారం బుధవారం కొండబాబుతోపాటు ఆయన సోదరుడు, సన్నిహితుల ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఫిబ్రవరి 28 నాటికి ఉన్న బ్యాంక్ రుణంతో పాటు మార్చి ఒకటో తేదీ వరకు వడ్డీ, ఇతర బ్యాంక్ ఖర్చులు కూడా వసూలు చేసుకునేందుకు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీ కనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కాకినాడ బ్రాంచి ఈ మేరకు వేలం కోసం సీల్డుటెండర్లు ఆహ్వానించింది. రుణం కోసం బ్యాంక్‌లో తాకట్టుపెట్టిన కొండబాబుకు చెందిన కాకినాడ జగన్నాథపురం చర్చ్‌స్క్వేర్ సెంటర్లోని నివాస భవనాన్ని వేలం నిర్వహిస్తున్నట్టుగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ బ్రాంచి ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే రుణం తీసుకున్న మిగిలినవారి ఆస్తులకు కూడా బ్యాంకు అధికారులు బుధవారం వేలం నిర్వహించనున్నారు.
ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న వెంకటేశ్వరరావు రుణం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. నలుగురికీ సూక్తులు విన్పించే నాయకుడు తాను మాత్రం ఆదర్శంగా ఉండరా అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే ఎన్నికల సమయంలో సానుభూతి కోసం అలా చేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. రుణాలు సక్రమంగా చెల్లించండి, కొత్త రుణాలు తీసుకోండని ఎమ్మెల్యేగా ఉండగా అనేక పర్యాయాలు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కొండబాబుకు ఇప్పుడు తాను తీసుకున్న రుణం చెల్లించాలనే విషయం గుర్తుకు రావడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.